Wednesday, 18 February 2015

శరన్నవరాత్రుల పుణ్య కాలం వచ్చేసింది. అమ్మవారి పూజలలో కేవలం తెలుగు ప్రజలే కాక, యావత్ దేశం అంతటా దేవి పూజలు జరుపుకుంటారు. అమ్మ దయ ఉంటె, అన్ని ఉన్నట్టే అని చెప్పుకుంటాం మనం, తమ బిడ్డలను అమ్మ కాక ఇంకెవరు కడుపులో పెట్టుకొని చూసుకోగలరు?
త్రిమూర్తుల అంశతో జగన్మాత ఆవిర్భవించింది అని చెప్తారు. అంటే, సృష్టి, స్థితి, లయ కారకులు కదా త్రిమూర్తులు అంటే,!ప్రతి ఇంటిలోనూ, సృష్టి చేసేది అమ్మ, అంటే జన్మ నిచ్చేది అమ్మ. మన పోషణ, పెంపకం విషయాలు చూసుకునేది అమ్మ. ఆ జగన్మాత భూమి మిద జనుల క్షేమం కోసం, రాక్షసులతో పోరాడి విజయం సాధించినట్లే, ఇంటిలో అమ్మ కూడా, మన లో ఉన్న దుష్ట భావాలు, దుష్ట గుణాలు అనే రాక్షసులతో పోరాడి మనను పెంచి పెద్ద చేయడం లో విజయం సాధిస్తుంది.
మనం సాధారణంగా వసంత ఋతువులో వసంత నవరాత్రులు, శరదృతువు లో జరుపుతాము. వసంత కాలం లో చెట్లు చిగిర్చి, ప్రక్రుతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అలాగే శరదృతువులో వెన్నెల ఎంతో ఆహ్లాదంగా ఉండి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అన్ని రుతువులలోకీ శరదృతువు వెన్నెల ఆ తల్లి కరుణ వలెనే ఎక్కువ చల్లగా, ఎక్కువ కాంతితో కూడి ఉంటుంది. వాతావరణం కూడా ఎక్కువ ఎండా, ఎక్కువ చలి లేకుండా చక్కటి సమతూకం తో ఉంటుంది. అమ్మ మనం ఎక్కువ కష్టపడకుండా ఈ ఏర్పాటు చేసింది అనుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పండుగకు కొన్ని చోట్ల బొమ్మల కొలువులు పెడతారు. అనేక ప్రాంతాలలో జరిగే ఈ పండుగ జాతరలలో , పులి వేషాలు, ఇంకా ఎన్నో ఇతర జానపదా కళా రూపాలను చూడవచ్చు. తెలంగాణా ప్రాంతం లో బతుకమ్మ పండుగ చాలా ఘనంగా చేస్తారు. విదేశాలలో ఉన్న ఆడపిల్లలు కూడా, ఈ పండుగకు పుట్టింటికి వస్తారు. రంగురంగుల తంగేడు పూలు, బంతి పూలు వరుసగా పేర్చి బతుకమ్మలను చాల అందంగా పేరుస్తారు. 9 రోజులూ ఆ బతుకమ్మల చుట్టూ ఆడవారు పాటలు పాడుతూ, చేతులు తడుతూ, చాలా వైభవంగా పండగ చేసుకుంటారు.
మైసూరు లో కర్ణాటక ప్రభుత్వం, ప్రబుత్వ లాంచనాలతో 9 రోజుల ఉత్సవాలు ఘనంగా చేస్తారు. రాజవంశం వారి కులదేవత శ్రీ చాముండి అమ్మవారి మందిరం నుంచి ఈ ఉత్సవాలు మొదలు అవుతాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందినా అనేక మంది కళాకారులను ఈ ఉత్సవాలలో సత్కరిస్తారు.
శరన్నవరాత్రులు వైభవంగా జరిగే ఇంకో ప్రాంతం పశ్చిమ బెంగాల్. ఇక్కడ కూడా మనం గణపతి విగ్రహాలను నిలబెట్టి ఉత్సవాలు జరిపినట్టు అక్కడ ఈ నవరాత్రులలో అమ్మవారి విగ్రహాలను నిలబెట్టి సామూహికంగా పూజలు చేస్తారు. సంప్రదాయ బద్దంగా శంఖనాదం తో మొదలయ్యే ఈ ఉత్సవాలలో, విదేశాలలో స్థిరపడిన వారు అందరూ కూడా వచ్చి పాల్గొంటారు. అడ, మగ అందరూ వారి వారి సాంప్రదాయ దుస్తులలో ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.
ఇంకా గుజరాత్ లో గర్బా అనే నాట్య రీతులతో ఈ పండగ జరుపుకుంటారు. ప్రతి కాలనీలో ఒక ఇంటిలో కానీ, ఒక తోట లో కానీ, అమ్మవారిని నిలబెట్టి 9 రోజులూ సాయంత్రం గర్బా నృత్యం చేస్తూ, ఆడా మగా అందరూ ఉత్సాహంగా పూజలు చేస్తారు. మిగిలిన రోజులలో ఆధునిక వస్త్రాలలో కనబడే యువత ఈ 9 రోజులూ తమదైన సాంప్రదాయ రీతిలో కన్నులకు ఇంపుగా కనబడతారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నవరాత్రులు ఎంతో ఉల్లాసభరితంగా జరుగుతాయి. మహిళలు తమ ఇంటిలో అమ్మవారికి లలితా సహస్ర నామం తో కుంకుమ పూజలు జరుపుతారు. అలా వీలు కాని మహిళలు దేవాలయాలలో జరిగే సామూహిక అర్చనలలో పాల్గొంటారు. మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీ ఆరాధన చేస్తారు. 9 రోజులూ వివిధ రకములైన పదార్దములు అమ్మకు నివేదిస్తారు. ప్రతి రోజు ఎవరో ఒకరి ఇంటిలో సామూహిక లలితా సహస్త్ర నామ పారాయణ చేస్తారు.
అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు...

No comments:

Post a Comment