Friday, 29 April 2016

"పుడితే ఆ భానుమతి లాగనో, ఇందిరాగాంధీ లాగానో పుట్టాలి.మనమూ ఉన్నాము ఎందుకూ? మా తరం ఎలాగూ దాటిపోయింది, మీరైనా ఆ ధైర్యం, తెలివితేటలు, తెగువా తెచ్చుకోండే...సుఖపడతారు జీవితంలో...."

ఇది చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని, మా చిన్నతనం  నుంచీ మాఇంట్లోనే ఉంటున్న మా పెద్దమ్మ మాట.

ఇంట్లో మగవాళ్ళు అనవసరంగా మాట జారినా, దాష్టీకం చూపించినా, తన చిన్నతనాన్నీ, మా భవిష్యత్తుని గుర్తు తెచ్చుకుని అనే మాట.

మా ఇంట్లో ఇంకా ఉమ్మడి కుటుంబమే...పెదనాన్నగారు చాలా కాలం క్రితమే కాలం చేయడంవలన, నానమ్మ, తాతయ్య, చదువుకుంటున్న బాబాయిని తీసుకుని, మా ఇంటికే వచ్చేసార్ట. తలచెడిన మా పెద్దమ్మ కూడా మాఇంటికే వచ్చేసింది.

ఆ రోజుల్లో (మా అమ్మ చిన్నతనంలో, పెళ్ళయ్యి, కొత్తగా కాపురానికి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినపుడు,) మా పెదనాన్నగారు, చండశాసనుడిగా ఉండేవారట. ఇంట్లో ఆడవాళ్ళు కాఫీ తాగడం నిషేధం....చాలా రోజులు ఆ రూలే సాగింది. మా అమ్మ పట్నం పిల్ల అవడంతో, పొద్దున్నే కాఫీ అలవాటు అని, ఆమె కోసం ప్రత్యేకంగా తెప్పించేవారట కాఫీ గింజలు..అంతకు ముందు ఆడవాళ్ళకు కూడా కాఫీలా అని చిరాకుపడ్డ మా పెదనాన్న. ..ఇంట్లోనే వేయించి పొడి కొట్టుకోవడం.

ఆవిడ ఇంకా తెల్లని సైనుపంచెనే ధరించేది. ఆవిడకి ఉన్న పెద్ద జడ చూసి, జుట్టు తీయించొద్దు అని మొత్తుకున్నా,తన ఆడపడుచులు వినలేదు అని ఎంతో బాధపడేది మా నానమ్మ.

తన, పర బేధాలు లేకుండా నన్ను, మా బాబాయి పిల్లల్ని తన పిల్లల్లాగానే పెంచింది ఆవిడ. రామాయణం, భారతం తోపాటు, పతివ్రతల కధలు, పురాణాలు చెప్పి,  "ఇదుగో ! అవి ఆ రోజులు, ఈ రోజుల్లో మరీ నోట్లో నాలుక లేకుండా ఉండకూడదు. పోట్లాడమని నేను చెప్పటంలేదు కాని, నోట్లో మాట నోట్లోనే కుక్కుకోకుండా కాస్త బయటికి రానీయండి ...." అని చక్కని సలహాలు చెప్పేది. మా నాన్నతో చనువుగా పోట్లాడి నన్ను డిగ్రీ వరకు చదివించినది ఆవిడే.

 "భానుమతి లాగా ఆ మాట చెణుకు, నొసటి విరుపు ఉండాలే తల్లీ, ఇందిరా గాంధీ లాగా మంచి చేసినా, ఏం  చేసినా ధైర్యంగా చేసే తెగువ నేర్చుకోండే అమ్మలూ...." అనేది...

ఆరోజుల్లో పల్లెటూళ్ళల్లో, కాస్త కలిగిన కుటుంబాలలో మధురవాణి మోజులు ఉండేవట...ఫలానా ఆడావిడ ఫలానా పంతులు గారి తాలూకా అని చెప్పుకోవటం కూడా ఓ గొప్పగా, స్టేటస్ గా ఉండేదట. అలా అన్ని రసాస్వాదనలు అయ్యాక ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న పెద్దమ్మని కాలితో తన్ని, "అన్నం పెట్టు" అని లేపేవారట....."గొప్ప సరసుడేలే" అనేది ఆవిడ, తనని తక్కువగా చూసినందుకు వ్యంగ్యంగా అంటోందో, ఆయన గుణానికి అంటోందో తెలిసి చచ్చేది కాదు.

"అత్తగారు నాలుగు మాటలు అన్నా, సర్దుకుపోండి, ఏదో ఆవేశంలో అన్నా, కొడుకు నొచ్చుకుంటే ఆవిడమాత్రం భరించగలదా, పండక్కో పబ్బానికో వస్తే, ఇక్కడ కూడా అన్నావదినల్లో మర్యాద కాని, చీటికీ మాటికీ వచ్చి చిన్నతనం పడకండి...నువ్వు నాలుగు చీరలు కొనుక్కుంటే, మీ అత్తగారికి ఓ రెండు, మీ నాలుగు సరదా మాటల్లో ఆవిడ మాటలు రెండు, ఇవే అత్తగారిని గెలుచుకునే మార్గాలు" అత్తారింటికి వెళ్తుంటే పెద్దమ్మ చెప్పిన సలహాలు.

ఈరోజున పెద్దమ్మ లేని ఇంటికి వెళ్ళాలంటే ఏదో వెలితి. జీవితాన్ని ఏమీ అనుభవించకపోయినా, మమ్మల్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతం. "తామరాకు మీద నీటిబొట్టు అంటే, ఏది పట్టనట్టు ఉండడం కాదు, పొగడ్తలు, చీవాట్లు మనసుకు తీసుకోకుండా నీ కర్తవ్యం నువ్వు చేయటం.....ఇంతకన్నా సులువుగా గీతాసారం బోధించగలరా ఎవరైనా?" మాకు మా పెద్దమ్మ అమ్మ కన్నా ఎక్కువ, అమ్మలగన్నయమ్మ. మాపాలిటి గీతాచార్యుడు..కృష్ణభగవానుడు..

No comments:

Post a Comment