Friday 7 March 2014

మహిళా దినోత్సవం అనగానే చాలా సాధారణం గా వినిపించే పదం.... "పరిపూర్ణ మహిళ" . నేటి కాలం లో స్త్రీలు అందరు కూడా చక్కగా పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసి అందులో కూడా ఉన్నత పదవులు సాధిస్తున్నారు. చాలా మంది మహిళలు టాక్సీ డ్రైవర్లు గా, లారీ డ్రైవర్లుగా, పైలట్లుగా, యుద్ధ పైలట్లుగా, లోకో డ్రైవర్లు గా పని చేస్తున్నారు. సైన్యంలో కూడా మహిళలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. .... ఏమాత్రం భయపడకుండా సైన్యంలోకి తమ పిల్లలను, భర్తలను పంపిస్తున్న మాతృ మూర్తులకు....ధర్మ పత్నులకు నా శతకోటి వందనాలు. అలాగే ఫైనాన్సు రంగం లో బ్యాంకింగ్ రంగంలో, పరిశోధనా రంగంలో అనేకమంది ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. ఆ మహిళలు అందరికి వందనములు.

ప్రఖ్యాతి చెందిన మహిళలే కాక, సాధారణ జీవితం గడిపే స్త్రీలు కుడా ఎంతోమంది ఎన్నో త్యాగాలకు ఓర్చి, తమ కుటుంబాలకు ఆసరా అవుతున్నారు. త్యాగం అనే పదానికి సిసలైన తార్కాణం స్త్రీయే. ఎందుకంటే మొట్టమొదట తన తనువుని చీల్చి ప్రాణాన్ని పణం గా పెట్టి ఇంకో ప్రాణికి జన్మనిస్తుంది. ఆ బిడ్డ సక్రమంగా భూమి మిద పడేవరకు తల్లి ప్రాణానికి ఎవరూ హామీ ఇవ్వలేరు. ఇంత కన్నా త్యాగం భూమి మిద ఉంటుందా? కడుపుతో ఉన్నపుడు, కాన్పు అయ్యాక బిడ్డ ఆరోగ్యం కోసం తను కొన్ని తినడం మానేయాలి, పసిపిల్లల నిద్రకు, ఆకలికి ఒక సమయం అంటూ ఉండదు. అన్నిటికి adjust అయి ఆమె పిల్లలను పెంచుతుంది. ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగోలేకపోయినా ఆమెకు కంటిమీద కునుకు ఉండదు. పిల్లలు పుట్టినప్పడి నుండి వారికీ ఒక యోగ్యతా వచ్చి వాళ్ళకు పెళ్ళిళ్ళు అయేవరకు తల్లికి విశ్రాంతి ఉండదు. త్యాగం అంటే ఇంతకన్నా అర్ధం ఏమి చెప్పగలం? తల్లి గా పడే బాధలు స్త్రీలందరికీ ఒకటే. కానీ వ్యసన పరుడైన భర్త, ఆరళ్ళు పెట్టె అత్తా మామలు, ఆర్ధిక ఇబ్బందులు----వీటన్నిటిని అధిగమించి మనో నిబ్బరంతో జీవితాలు సాగిస్తున్న మహిళా మణులు అందరికి నా శత సహస్ర వందనాలు.

ప్రతి మహిళా దినోత్సవం రోజునా నాకు గుర్తొచ్చే ఒకే ఒక పరిపూర్ణ మహిళ (నా దృష్టిలో) మా అమ్మమ్మగారు వలివేటి వెంకట సీతామహాలక్ష్మి గారు....ఆవిడకు తొమ్మండుగురు సంతానం. చిన్న వయసులోనే మా తాతగారు కాలం చేసారు. అయన కాలం చేసే సమయానికి ఆవిడ కడగొట్టు సంతానానికి ఒకటిన్నర సం.ల వయసు. మా తాతగారు డాక్టర్ గా ప్రైవేటు ప్రాక్టీసు చేసేవారు. అందువల్ల అయన పోయాక పెన్షన్ అది ఏది వచ్చేది కాదు. ఆడపిల్లలు పెళ్ళికి ఎదిగి ఉన్నారు. మగపిల్లలు చేతికి అంది రాలేదు. అయిన వాళ్ళు అందరు బాధ్యతలు పంచుకోవాలనే భయంతో దూరం అయిపోయారు. ఉన్న కొంచెం పొలాన్ని చూసుకుంటూ దానిమీద వచ్చే ఆదాయం తో, పిల్లలను ఒంటి చేతితో, మగ తోడూ లేకుండా, పైకి తీసుకువచ్చి,పిల్లలకు ఏ లోటు లేకుండా, ఏమి తింటున్నారో, ఎలా ఉంటున్నారో మూడో కంటి వాడికి తెలియకుండా పెంచి మంచి జీవితాలను ఇచ్చారు ఆవిడ. పెంచడం అంటే అలా ఇలా కాదు, మంచి క్రమశిక్షణ తో పెంచారు. (మగపిల్లలకు కూడా ఏమి వ్యసనాలు లేకుండా) . ఆవిడ పిల్లలనే కాదు, మనవలు, మనవరాళ్ళను కూడా ఎంతో క్రమశిక్షణ తో తీర్చి దిద్దింది ఆవిడ. ఆవిడ చెప్పే ఒక్కో సలహా ఒక్కో ఆణిముత్యం. జీవితం లో ఎంతో ఉపయోగపడే సలహాలు చెప్పేవారు. పిల్లలు అందరు దగ్గర దగ్గర ఊళ్ళ లోనే ఉండడం వల్ల ఎవరికీ ఏ సహాయం కావలసి వచ్చినా వెంటనే అటెండ్ అయ్యేవారు. ఇక మా అందరి కాన్పులు ఆవిడ చల్లని చేతుల మీదుగానే జరిగినాయి. ముని మనవలను కూడా చుసిన పుణ్యాత్మురాలు .ఆవిడ కాలం చేసి చాలా సం.లు అయినప్పటికీ ఆవిడతో గడిపిన క్షణాలు నేను అసలు మర్చిపోలేను. ఆవిడ ఋణం ఏనాటికి తీర్చుకోలేను. ఏదో ఉడతా భక్తీ గా ఆవిడ పేరు మిద కొన్ని దేవాలయాలలో డబ్బు కడుతున్నాము.

i miss you a lot ammammaa !

No comments:

Post a Comment