Friday, 26 June 2015

కొత్తగా వివాహం అయిన ఒక ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం ఇది....
అమ్మా! అందరు ఆడపిల్లలలాగే, నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నాకోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను.
కానీ, ఈరోజు, నా వివాహం అయిన తర్వాత, నాకు తెలిసింది, పెళ్ళి అంటే పూలపానుపు కాదు అని. కేవలం నాకు ప్రియమైన వాడితో సమయం గడపడం మాత్రమే కాదు అని నాకు అర్ధం అయింది. నేను ఊహించినదాని కన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడా నా కోసం నా వంతు, బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి.
నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి, వాళ్ళకు కావలసినవన్నీ సిధ్ధం చేయాలి అని ఆశిస్తారు. మన ఇంట్లో లాగా, పైజామాలతో రోజంతా, ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పధ్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకీ సిధ్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు. నేను ప్రతిక్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణి లాగా శ్రధ్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు కానీ, నేను అందరి గురిచి శ్రధ్ధ తీసుకోవాలి.
అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక, నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుంది. ఒక్కోసారి, మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి, నీ దగ్గర గారాలుపోవాలని అనిపిస్తుంది.
మన ఇంటికి వచ్చేసి, నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని, ప్రపంచం లో నాకు ఇక ఏ బాధలు లేనట్టు నీ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది.
కాని అప్పుడే నాకు గుర్తొస్తుంది....నువ్వు కూడా ఇలా పెళ్ళి చేసుకుని, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చినదానివేగా అని....నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా...నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్నీ, శాంతినీ, సౌకర్యాన్నీ మాకు అందించావో, వాటిని నేను మళ్ళి నేను అడుగు పెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది..
నేను చెప్తున్నా అమ్మ...కొంత కాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితం లో మాకోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా కృతజ్ఞతలు. అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, స్థైర్యాన్ని ఇచ్చాయి. థాంక్ యూ అమ్మా...

***********
బాగుంది కదా....తరం వెనుక తరం ఆడపిల్లలు తాము పుట్టిన ఇల్లు వదిలి, పరిచయమే లేని మరో ఇంటికి వచ్చి వంశాభివృధ్ధికి, వంశం యొక్క గౌరవం ఇనుమడించడానికి కృషి చేస్తారు. ఇంట్లొ ఆడపిల్లలు గలగలలాడే సెలయేటి సంగీతం వంటివారు. వారు ఎడతెగకుండా మాట్లాడుతున్నంతసేపు ఎక్కువ మాట్లాడకు నోరు ముయ్యి అంటారు. అదే ఒక్కనిముషం మాట్లాడకుండా ఉంటే ఎవరికీ తోచదు. రకరకాల సందేహాలు వస్తాయి. అమ్మ "ఏం? ఒంట్లో బాగాలేదా?" అని కంగారు పడుతుంది. నాన్న "ఏంటి? ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది" అని ఆశ్చర్యపోతారు. అన్న "కోపం వచ్చిందా?" అని ఆందోళన పడతాడు. ఇంక ఒకేసారి పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతే, ఇంట్లో వెలుగే ఉండదు.
ఇది మనందరి కథ. మీరు, నేను, మన అమ్మాయిలు, మన కోడళ్ళ కథ....అవునంటారా....
ఆడపిల్ల...
అమ్మకు యువరాణి.
నాన్నకు చిన్నారి దేవత..
అన్నలకు గారాల చిట్టి చెల్లి..
భర్తకు అతని శ్వాస, హృదయ స్పందన...
ఆడపిల్లగా పుట్టినందుకు గర్విద్దాం. ఎందుకంటే ఈ సృష్టి మన వలనే మనుగడలో ఉంది. ఇంటి పరువు ప్రతిష్ట, గౌరవం, సౌఖ్యం, సంతోషం మన చేతుల్లోనే ఉన్నాయి.
ధన్యవాదములు.

No comments:

Post a Comment