Sunday, 28 June 2015

మా ఇంటి దగ్గర ఒక చిన్నారి బుజ్జాయి గాడు ఉన్నాడు. మా అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న ఒక కార్పొరేట్ స్కూల్ లో నర్సరీ చదువుతున్నాడు. అసలు ఆ స్కూల్లో చేర్పించడం కోసమే మా దగ్గర ఫ్లాట్స్ కొనుక్కున్నారు అంటే సబబుగా ఉంటుంది. ఇంచుమించు ప్రతి క్లాస్ పిల్లలూ ఉన్నారు మా ఫ్లాట్స్లో. ఈ బుజ్జాయిగాడు ప్రతిరోజూ ఉదయాన్నే ఏడుస్తూ నిద్ర లేస్తాడు. నిద్ర లేవడానికే ఏడుస్తాడు. లేచిన దగ్గర్నుంచి వాల్ల అమ్మ, "స్కూల్ కి వెళ్ళాలి లే." అంటూ సతాయిస్తుంది.  చక్కగా తయారవుతాడు పేచీ పెట్టకుండా. ఇక స్కూల్ కి వెళ్ళాలంటే మొదలు పెడతాడు మళ్ళీ. వాళ్ళ అమ్మ, "టీచర్ని పిలవనా?" అంటూ మొదలెడుతుంది. అసలు అక్కడే ఉంది కిటుకంతా అనిపిస్తుంది నాకు. పిల్లల్ని స్కూల్ లో చేర్పించక ముందు, వాళ్ళు కొంచెం అల్లరి చేసినా సరే, "స్కూల్ లొ వేసేస్తే వదులుతుంది గొడవ...వీడి అల్లరి కొంతైనా తగ్గుతుంది" అని పక్కవాళ్ళతో చెప్పడమో, "ఇలాగే అల్లరి చేసావంటే స్కూల్ లో వేసేస్తాను వెధవా" అని పిల్లలతోనో చాలా మంది తల్లులు అంటూ ఉంటారు. ఇక అక్కడినుంచి వాళ్ళకు స్కూల్ అన్నా, టీచర్లు అన్న ఒక శిక్షలాగే కనపడుతుంది. పాపం ఈకాలంలో వాళ్ళు మాత్రం ఎప్పుడు అల్లరి చేస్తారు? 2 సంవత్సరాలు నిండకుండానే, ప్లే స్కూల్ లో పడేస్తున్నారు. తరువాత +2, ప్రొఫెషనల్ కోర్సులు, అందులొ మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లు అయిన వెంటనే, చదువు అవ్వకుండానే వారికోసం ఒక ఉద్యోగం ఎదురుచూస్తూ ఉంటుంది. అంత చిన్న వయసులో నెలకు 50,000 ఇచ్చే కంపెనీ వీరిని స్థిమితంగా ఎక్కడ ఉండనిస్తుంది? తీవ్రమైన పని ఒత్తిడి తో కాలం గడిచిపోతుంది. కష్టపడకుండా విద్యార్థి దశలోనే వచ్చిన ఉద్యోగాన్ని వదలలేరు, ఆ పని ఒత్తిడి భరించలేరు. అదో టెన్షన్. ఇక పెళ్ళి, తరువాత జీవితం అందరికీ తెలిసినదే కదా...మరెప్పుడండీ వాళ్ళు అమ్మా, నాన్న దగ్గర స్వేచ్చగా అల్లరి చేసేది?ఆడుకొనేది? ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఇంట్లొ ఉన్న సభ్యులందరూ తలో మూల అవి పట్టుకునే కూర్చుంటున్నారు కదా.. ఈ బుజ్జాయి గాడి తల్లిని, కింద పిల్లలందరూ ఆడుకుంటున్నారు కదా, అక్కడికి పంపచ్చుకదా మీ వాడిని అని అడిగితే, ఆమె చెప్పిన సమాధానం...పిల్లలందరూ వీడిని పడేస్తారేమొ అని భయం ఆంటీ, అయినా ఫోన్ ఇస్తే అల్లరి చేయకుండా ఆడుకుంటాడు మావాడు. అన్నం కూడా అడగడు. అని చెప్పింది. అంటే, ఆకలి కూడా తెలియనంతగా ఆ పిల్ల వెధవకి ఫోన్ తో ఆడుకోడం అలవాటు అయ్యిందన్న మాట. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే మానసిక వికాసం కలుగుతుంది అని ఆమెకు అర్ధం అయ్యేలా చెప్పలేక పోయాను నేను. ఇక మన విద్యావ్యవస్థ కూడా మార్కులు, ర్యాంకులు తప్ప విజ్ఞానాన్ని అందించేలా లేదు.  ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యార్థులకే కాదు, టీచర్లకు కూడా ఎన్ని నిబంధనలో...పిల్లలతో మనం గడిపే కాలాన్ని వాళ్ళు అప్పటికి ఆనందించడమే కాకుండా పెద్దయ్యేవరకు గుర్తు పెట్టుకుంటారు కూడా..వాళ్ళ కోసం మనం చేసే ప్రతి పని వాళ్ళు గమనించుకుంటారు. పిల్లల కోసం డబ్బు ఖర్చుపెట్టడం కాకుండా, మీ విలువైన సమయాన్ని "నాణ్యమైన" విధంగా వారికి ఖర్చుపెట్టండి. వారు మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. తీరిక లేకపోవడం కాదు, తీరిక చేసుకుని వారితో గడపండి. మనం ప్రతి రోజూ బయటి వ్యక్తుల కోసం ఎన్నో పనులు చేస్తున్నాం. మన పిల్లల కోసం ఆమాత్రం చేయలేమా?  

No comments:

Post a Comment