Saturday, 6 June 2015

 సభ్యులు, పెద్దలు కృష్ణప్రసాద్ ఆలూరి గారు ఒక గ్రూప్ లొ పోస్ట్ చేసిన లేపాక్షి గారి కార్టూన్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఇది. నిజమే కదా, మనం మనకోసం కన్నా, ఎదుటివారి కోసమే ఎక్కువ బతికేస్తున్నాం. పెళ్ళిళ్ళకి వెళ్ళెటప్పుడు, " ఇది ఒకసారి కట్టేసుకున్నాను వాళ్ళ ఇంటికి, ఇప్పుడు కూడా అదే కట్టుకుంటే నవ్వరూ" అనే డైలాగ్ చాలా మంది దగ్గర విన్నాను నేను. పక్క వాళ్ళ కన్నా పెద్ద టీవీ మన ఇంట్లో ఉండాలి. పొరుగు వారింట్లో కారు ఉంటే మనమూ కొనేయ్యాలి, లేకపోతే "కారు కూడా లేదు అనుకుంటారేమో",  కొంత మంది మరీ చనువుగా, ఇంకా కారు కొనలేదా, ఈపాటికి ఉండాల్సిందే మీ ఇంట్లో...అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. ఎంత వేసవి కాలం లో అయినా, ఎంత ఉక్కపోతలో అయినా, గరగరలాడుతూ పెద్ద జరీ అంచు పట్టు చీరలే కట్టుకోవాలి., మన సౌకర్యం కోసం నేత చీరలు కట్టుకుంటే, "ఏమనుకుంటారో అందరూ"? ---- మన ఆలోచనలు ఇంతవరకే పరిమితం. దీనిని మించి ఆలోచించలేము. ఒక విధంగా మన పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, పట్టుచీరల, నగల ప్రదర్శన వేదికలు. కొంచెం తక్కువగా ప్రదర్శించిన వాళ్ళకి తరువాతి ఫంక్షన్ లో విలువ ఉండదు. వాళ్ళను పన్నెత్తి పలుకరించరు... ఆఖరికి మన పిల్లల చదువుల విషయం లో కూడా ఇలాగె ప్రవర్తిస్తున్నాం మనం. ఇంజినీరింగో, మెడిసినో తప్ప, ముఖ్యంగా తెలుగు ప్రజలకు వేరే ఏదీ ఉన్నత చదువు కాదు. బయట ప్రపంచం లో ఎంత పోటీ ఉన్నా సరే, ఉద్యోగాలు దొరకక పోయినా సరే, మనకు చదువు అంటే ఆ రెండు కోర్సులే. మన పిల్లవాడికి చదివే మేధ ఉందా లేదా మనకు అనవసరం. పక్కవాళ్ళు అదేదో కార్పొరేట్ కాలేజ్ లో చేర్పిస్తే, మనం స్తోమత ఉన్నా, లేకపోయినా, అప్పు చేసి మరీ అదే కాలేజ్ లొ జాయిన్ చేస్తాం. తీరా వాళ్ళు ఎంట్రన్స్ లు పాస్ అయ్యి, ప్రొఫెషనల్ కాలేజ్ కి వెళ్ళాకా అ చదువు బుర్రకు ఎక్కక, మధనపడి, మానసిక సంఘర్షణ పడిన విద్యార్థులు ఎందరో....పుట్టినరోజు పార్టీలు, ఆఖరికి శ్రావణ మంగళవారం నోములలోకి కూడా ఈ కార్పొరేట్ కల్చర్ చొచ్చుకు వచ్చేసింది. వచ్చిన పేరంటాళ్ళకు జ్యూసులు, టిఫిన్లు, కాఫీలు, అంతా అదో వేలం వెర్రి అయిపోయింది. ఇంక మన ఇళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మన డబ్బు, దర్పం, హోదా ప్రదర్శించడానికి అవి ప్రధానమైన వేదికలు. ఒక్కో పెళ్ళికి 20 నుంచి 25 లక్షల వరకూ ఖర్చు అవుతోంది అంటే, జీవితాంతం సంపాదించినది అంతా ఒక్క పెళ్ళి ఖర్చుతో సరి అన్నమాట. ఒకళ్ళు 40 ఆధరువులు, మరొకరు 60, మరొకరు 100, ఇంకొకరు 150.....60 వంటకాలలో ఎంతమంది ఎన్ని తింటారు? 60 ముద్దలు తినడానికి పొట్ట పడుతుందా అసలు....అవసరమైన చోట ఖర్చు పెట్టడం లో తప్పు లేదు. మండపం అలంకరణకి విదేశీ పూవులు, ఇన్నిన్ని ఆహార  పదార్థాలు అవసరమా? ఉత్తర భారతం లోని వేడుకలు అయిన మెహెందీ, సంగీత్ మన పెళ్ళిళ్ళలో కూడా చోటు చేసుకుంటున్నాయి.  డబ్బు ఉన్నది ఖర్చు పెట్టుకోవడానికే కదా అని సాగతీతలు. డబ్బు ఉన్నవారు ఖర్చు పెట్టుకొంటున్నారు సరే, లేనివాళ్ళ మీద కూడా ఈ ప్రభావం పడుతోందిగా...ఇప్పుడు పెళ్ళికూతురే, అలా చేయకపోతె బాగుండదు, నా ఫ్రెండ్స్ నవ్వుతారు అంటే ఎం చేయాలి? అలాగే జరుగుతోంది కూడా.  మనం మనలాగా, మన కుటుంబ పధ్ధతి ప్రకారం, సంప్రదాయం ప్రకారం  జీవించడం మర్చిపోయాము. మన జీవితం పక్కవాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి నడుస్తోంది. మనకు ఉన్న డబ్బు, సంపద హోదా మీద ఆధారపడి నడుస్తోంది.

No comments:

Post a Comment