Thursday 20 February 2014

సామాన్యులమైన మనం విడిపోయిన దు:ఖం నుంచి తేరుకొని మన రాష్ట్రం అభివృద్ది చెందాలి అనే సంకల్పం తో ఉన్నాము.అణుబాంబు దెబ్బతిన్న జపాన్ లాగా వేగంగా, బలంగా మన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి అనే భావనతో ఉన్నాము.  బాగానే ఉంది. కానీ, మనకు  అంత సంకల్పం, చిత్తశుద్ది ఉన్న నాయకులు ఏరీ? మనము సామాన్య ప్రజలము. మనంత మనం ఏమి చేయలేము. అందుకే మన తరఫున ప్రతినిధులను ఎన్నుకొంటాము. మన నాయకులకు మన రాష్ట్రాన్ని బలంగా పునర్నిర్మించాలి అనే దీక్ష ఉన్నదా? అపుడే విభజన బిల్లు కు ముద్ర పడి14 గంటలు అయ్యింది. ఇంతవరకు మన నాయకులు నోరు విప్పారా? ఈ విభజన మనకు నచ్చింది, లేదు అని ఎవరైనా కామెంట్ చేసారా?సవరణల గురించి కానీ, ఆర్ధిక package గురించి కానీ, కనీసం రాజధాని గురించి కానీ ఎవరైనా వివరణ ఇచ్చారా ? కనీసం అసంతృప్తి వేలిబుచ్చారా?కాస్త నోరు ఉన్న నాయకుడు అస్త్ర సన్యాసం చేసాడు. సమైక్య నాయకుడు అనుకున్నవాడు అద్భుత నటుడుగా ఆవిష్కృతం అయ్యాడు. మిగిలిన వాళ్ళు ఎక్కడ రాష్ట్రపతి పాలనా వస్తే తమకు సిఎమ్ పదవి రాదో అని అక్కడ కేంద్ర నాయకుల కాళ్ళు పట్టుకునే పనిలో ఉన్నారు. కొంతమంది  నిందితుల బెయిల్ కోసం తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు అన్ని పార్టీలు చేతులు కలియి ప్రజలను మోసం చేసాయి.

ఈక్షణాన మన రాష్ట్రం చుక్కాని లేని నావే అయింది. మనం చరిత్ర పాఠాలలో చదువుకున్నట్టు మన నాయకుల లేకి తనమే పొరుగు వారికీ బలం అయింది. మన నాయకులు ఎవరి స్వార్ధం వారు చూసుకోవడం వల్ల కేంద్రం లోని పెద్దలకి డ్రామాలు ఆడటం, బేరసారాలు కుదుర్చుకోవడం సాధ్యం అయింది. హైదరాబాద్ అభివృద్ధి లో మన వంతు ఉన్నప్పటికీ, కనీసం హైదరాబాద్ లో కొంత భాగాన్ని మనం తెచ్చుకోలేక పోయాం.

పాలకులు భ్రష్టులయితే ప్రజల గతి ఇంతే.

No comments:

Post a Comment