Tuesday 28 April 2015

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8. ఈ ఒక్కరోజే అందరికీ మహిళల గురించి గుర్తొస్తుంది. మహిళా సంక్షేమం గురించి, బాలికా సంరక్షణ గురించి, మహిళలు అన్ని రంగాల్లో పడుతున్న కష్ట నష్టాల గురించి గుర్తొస్తుంది. ఊరూరా, వాడవాడలా మీటింగ్స్ జరుగుతాయి. ప్రముఖ మహిళలు అతిథులుగా వస్తారు. ఉపన్యాసాలు ఇస్తారు. ఒక్కోచోట లంచ్ కూడా నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు. స్త్రీల మిద జరుగుతున్న అత్యాచారాలు,లైంగిక హింసలు గురించి అందరూ మాట్లాడతారు. టీవీ ఛానల్స్ కూడా ఇవాళ మహిళల గురించిన సినిమాలు, మహిళల ఇంటర్వ్యూ లు, ప్రసారం చేస్తాయి. న్యూస్ పేపర్స్ ఇవాళ మహిళల కోసం ప్రత్యేకం గా ఒక పేజి కేటాయిస్తాయి. ప్రతి ఇంట్లో మహిళలకు విషెస్ అందజేస్తారు. ఇవాళ గడుస్తుంది. తెల్లవారుతుంది. రేపట్నించి అన్ని మామూలే. లైంగిక హింసలు, అత్యాచారాలు, అన్ని మాములే. రేపటి నించి మహిళల కోసం ఒక్క గొంతు పైకి లేవదు. రేప్ కేసులు విచారణ పూర్తీ కాదు. పైగా నిందితులు టీవీ లలో కనబడి ఇంటర్వ్యూ ఇస్తారు. ప్రభుత్వం చూడద్దు అని ఆంక్షలు పెడుతుంది. మూసిన గుప్పిటపై కుతూహలం ఎక్కువ అన్నట్టు, ప్రజలందరూ వెతికి వెతికి మరీ చూస్తారు. అదో రకం ప్రచారం జరిగి కూర్చుంటుంది.
ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం, బాలిక సంరక్షణ కోసం కొన్ని కోట్లు విడుదల చేస్తుంది ఈ రోజు, అయితే, రేపట్నించి అవి అమలు లోకి వస్తున్నదా లేదా అనే విషయం ప్రభుత్వం పట్టించుకోదు'
ఈ సదస్సులు వేటిల్లోను మగవాళ్ళు పాల్గోరు. సదస్సులో కనీసం మగ ప్రేక్షకులు ఉండరు. మహిళల సమస్యలకు కారణం ఒక వైపు నుంచి మగవారు కారణం అని అనుకున్నపుడు, ఆ సదస్సులలో మగవారిని భాగస్వాములను చేయకపోతే, మన గొంతు మనం ఎవరికీ వినిపిస్తాం? సమస్యలు మహిళలవే, వాటిని వినేవాళ్ళు మహిళలే అయితే, సమస్యలు తీరుతాయా?
మహిళల ఆత్మా గౌరవం గురించి మాట్లాడే పెద్దలు సినిమాలలో మహిళలను ఎలా చూపిస్తున్నారో గమనించరు. వాటిపై నిషేధం ఉండదు. మరీ మన నట్టింట్లోకి వచ్చేసిన టీవీ లలో సీరియల్స్ లో మహిళలు ఎలాంటి భావజాలం తో ఉన్నారో, ఆ పాత్రల ప్రభావం చిన్న, పెద్ద అందరి మీద ఎలా ఉందొ ఎవరికీ అక్కర్లేదు. సినిమాలలో, ఇంట, బయట స్త్రీల వస్త్రధారణ ఎలా ఉందొ ఎవరికీ పట్టదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తమ పిల్లవాడు, ఎవరితో స్నేహం చేస్తున్నారో, బయట ఎలా behave చేస్తున్నారో తల్లితండ్రులే పట్టించుకోరు.
ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు వాటి మూలాల నుంచి పరిష్కరించ గలిగితేనే తొందరగా మార్పు వస్తుంది. మార్పు ముందు మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇంట్లో మగపిల్లలను పెంచడం లో తల్లి తండ్రులు ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంట్లో తండ్రి , తన భార్యను గౌరవంగా చుస్తే, పిల్లలకు స్త్రీలను గౌరవించడం అలవాటు అవుతుంది. మగపిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఆడపిల్లలను తక్కువ చూడటం చాల తప్పు. ఒకవేళ ఇంట్లో మగవాళ్ళు ఇతర స్త్రీల గురించి, తక్కువగా మాట్లాడితే, వెంటనే గట్టిగా ఖండించాలి. ఇంటా, బయటా స్త్రీలు ఎంత కష్టపడుతున్నారో మగపిల్లలకు గమనించుకోవడం నేర్పాలి. పిల్లల ఎదురుగా మరొకరిని విమర్శించుకునే అలవాటు తల్లితండ్రులు మానుకోవాలి. తల్లి తండ్రులు చేసే ఏ చిన్న పనైనా పిల్లల మీద ప్రభావం చూపుతుంది అని మరువకూడదు.
కూతురి తప్పులను సమర్ధించిన తల్లి కోడలి తప్పులను సమర్ధించదు. కోడలి వైపు నుంచి కంప్లైంట్ వచ్చినపుడు అందుకు తన కొడుకు కాని, ఇతర కుటుంబ సభ్యులు కాని, ఎంత వరకు బాధ్యులు అనే విషయం అత్తగార్లు ఆలోచించాలి. అటువంటి విశాల హృదయం అలవరచుకోవాలి.
ఆడపిల్లలకు కూడా (మనం ఏనాడో వదిలేసిన) సంస్కృతీ సంప్రదాయాల గురించి కొంచెం నేర్పించాలి. ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కాని, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండే విధంగా మంచి చెడులు నేర్పాలి. ఆడపిల్లల్ని చదివించండి. మన ఇంటి పిల్ల్లల్నే కాదు, పేద బాలికలకు చదువుకునేందుకు సహాయం చేయండి. అందరికీ ఆత్మస్థైర్యం నేర్పండి. ( అది స్రుతి మించి విచ్చల విడి తనం కాకూడదు.) వారి భయాలను, సందేహాలను ఓపికగా తీర్చండి. వారికీ అండదండగా ఉన్నాము అనే భరోసా కల్పించండి. మహిళలను కించపరిచే సినిమాలు, టీవీ సీరియల్స్, ప్రకటనలను ఖండించండి.
మహిళల కు జరిగే అన్యాయాలకు మగవారే ఎక్కువ బాధ్యులు కాబట్టి, ముందు మార్పు మగవారి నుంచే రావాలి. స్త్రీలను గౌరవించాలి అనే విజ్ఞత వారికీ ఉండాలి. ఆ మగవారిని పెంచేది తల్లులే కాబట్టి, తల్లులే మగవారిలో మార్పు తేవాలి. మనం ఎన్నో గ్రంధాలూ చదువుతున్నం, ఎన్నో సినిమాలు చూస్తున్నాం, అన్ని విని, చదివి వదిలేస్తున్నాం. ఆ సూక్తులు అన్నీ ఆచరణలో పెట్టినపుడే మార్పు సాధ్యం. అంతవరకు ఈ దినోత్సవాల వల్ల మహిళలకు ఒరిగేది ఏమి లేదు.

No comments:

Post a Comment