Tuesday, 28 April 2015

నా తోటి మహిళలు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...
అయినా ఏదో మొహమాటానికి చెప్పుకోవడమే కానీ, మనకి ఈ ఒక్కరోజు కేటాయించినది ఎవరండి అసలు? అన్ని రోజులు మనవే అయితే! ఆకాశం లో సగం అంటూనే, భూమి మిద దాదాపు అన్ని రంగాలలో అడుగుపెట్టి ఆక్రమించేసిన మనకి మహిళా దినోత్సవం అంటూ సంవత్సరం లో ఒక్కరోజు కేటాయించడం ఎంత అసమంజసం? నవమాసాలు మోసి బిడ్డలకు జన్మనిచ్చేది మనం.... రోజంతా ఇంట్లో ఉంటూ, వాళ్ళ పెరుగుదలను, వారి ఆటపాటలను చూసి ఆనందించేది మనం......( మగవాళ్ళు రోజంతా ఇంట్లో ఉండరుగా!) వాళ్ళకు విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పేది మనం. పెరిగి పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు అయ్యేదాకా వారి బాధ్యత తీసుకునేది మనం... అటు మన తరం లో అత్తగారితో, మన మగపిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక, మన ఇంటికి వచ్చిన కోడళ్ళతో సర్దిపెట్టుకునేది మనం.....(మహిళలు)....ఇంటికి వచ్చిన అతిధి అభ్యాగతులకు స్వయంగా వండి పెట్టేది మనం.... ( ఇంట్లో మగవారి పని సరుకులు తీసుకురావటమే కాని వారి చేతులతో వండి పెట్టలేరు కదా).. ఇంట్లో ఎవరు అనారోగ్యం పాలైనప్పటికీ కనిపెట్టుకుని సేవలు చేసేది మనం..( అదే ఒక్క 10 రోజులు మనకు అనారోగ్యం వస్తే, ఇక చూడాలి ఆ ఇంటి సొగసు...) పోనీ, ఇవన్ని పాత తరం వాళ్ళ మాటలు అనుకున్నా, ఎంత మంది మహిళలు ఎంతో ప్రయాసతో కూడుకున్న రక్షణ రంగంలో పనిచేస్తున్నారు! ఆఖరికి అమెరికా అధ్యక్షుడికి గౌరవ వందనం చేసినది కూడా మన ఆడకూతురేగా! ఎంత మంది లోకో డ్రైవర్స్ గా, పైలట్ లు గా, కష్టపడుతున్నారు!ఎంతమంది మహిళలు వ్యాపార రంగం లో కూడా తమదైన ముద్ర వేస్తూ ముందుకు పోతున్నారు... ఇంతా చేస్తున్నా కూడా కుటుంబ బాధ్యతలను విస్మరించకుండా అటు ఇటు సమ న్యాయం చేస్తున్నారే! ఎవరండీ మహిళలను అబలలు అన్నది ? అసలు మనకు ఉన్నంత మానసిక బలం పురుషులకు ఉన్నదా అని డౌట్. ఖచ్చితం గా ఉండదు.మనలో మన మాట. ... అసలు, ఇంటికి, మగవాడికి మనమే కదండీ ఆధారం.... ( ఆడదే ఆధారం అని పాటలే వ్రాసారుగా) మహిళలు మల్టీ టాస్కింగ్ ( ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడం) లో నిపుణులు అని పెద్ద పెద్ద సర్వే లలోనే ఒప్పుకున్నారు. ఎన్ని రకాలుగా చూసినా పురుషుల కన్నా మహిళలు నిజాయితీ, ధైర్యం, నిబ్బరం, మానసిక స్థైర్యం కలవారు అని ఒప్పుకుని తీరవలసినదే. మన ప్రజ్ఞా పాటవాలకి ఇలా ఒక్కరోజు, రెండు రోజులు ఉత్సవాలు జరుపుకోవటం అవమానం. ఎందుకంటే సంవత్సరం లోని అన్ని రోజులూ మనవే. ఏమంటారు ఫ్రెండ్స్?

No comments:

Post a Comment