Tuesday, 28 April 2015

ఉమ్మడి కుటుంబాలు--కుటుంబాలలో, సమాజం లో ఒక్కరి కోసం అందరు-అందరి కోసం ఒక్కరు అనే కట్టుబాట్లు మనవి. . చెట్టు-పుట్ట, పశువు-పిట్ట, నీరు-నిప్పు, గాలి-భూమి --ఇలా ప్రకృతి లోని ప్రతి అణువునూ ప్రేమించి పూజించే పవిత్రమైన భావన మనది. పరోపకారార్ధం ఇదం శరీరం అనే ఉపనిషద్ వాక్యాన్ని రోమరోమానా ఇముడ్చుకున్నాం. అంతరిక్షం లోకి, సముద్ర గర్భం లోకి వెళ్ళగలిగిన ప్రగతిని సాధించిన మనం మరి సాటివాడి మనసును ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఇంత వేగంగా పురోభివృద్ధిని సాధించిన మనం ఎందుకు మానవ సంబంధాల విషయం లో తిరోగమనం సాగిస్తున్నాం? కుటుంబాలలో, బాధ్యతలు పంచుకోవటమే తప్ప, హక్కుల కోసం పోరాడడంతెలియని మన జీవితాలలో డబ్బు అనేది ఎలా ప్రవేశించింది? పెద్దల పట్ల గౌరవం, మమకారం, మానవత్వంచిన్నతనం నుంచి పిల్లలకు ఉగ్గుపాలతో నేర్పేమన సంస్కృతీ లో అవన్నీ ఏ కాలం లో చచ్చిపోయాయి? కాలానుగత మార్పుల్లో, ఏ మలుపులో మనం ఇంత స్వార్ధంగా మారిపోయాం? మనుషుల కన్నా, మనీ ముఖ్యం అయింది.. ప్రకృతి నుంచి పరోపకారం నేర్చుకున్న మనం ఈరోజున పొరుగువాడిని పలకరించడానికి కూడా ఎందుకు భయపడుతున్నాం? మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక సంబంధాలే అని అంగీకరిస్తున్నామా?

No comments:

Post a Comment