Tuesday 28 April 2015

మాసాలలో ప్రశస్తమైన మాసం వైశాఖ మాసం. ఈ మాసం లో వచ్చే అక్షయ తృతీయ కు మంచి ప్రాధాన్యం ఉంది. ఈ రోజును పరశురామ జయంతి గాను, లక్ష్మి దేవి అనుగ్రహం సంపూర్ణంగా పొందగలిగే రోజు గాను పెద్దలు చెప్తారు. ఈరోజుననే విశాఖ జిల్లా సింహాచలం లో శ్రీ లక్ష్మీ వరాహ నృసింహ స్వామివారికి రోజూ పూసే చందనం ఒలిచి నిజ రూప సందర్శనానికి అనుమతిస్తారు. ఈరోజున విష్ణు మూర్తికి చందన లేపనం చేసిన వారికి మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు, శ్రీ మహావిష్ణువును కృష్ణ తులసి దళాలతొ అర్చించడం విష్ణువుకు మహా ప్రీతిదాయకం. అక్షయ తృతియ రోజున మహావిష్ణు ప్రీతిగా విష్ణు అర్చన, సహస్ర నామ పారాయణ చేసి, వడపప్పు, పానకం దానం చెయ్యడం మంచిది. వేసవి ముదురుతూ ఉంటుంది కాబట్టి, నీరు, పలుచని మజ్జిగ, చెప్పులు, వస్త్రము, గొడుగు, బెల్లం, మొదలైనవి కూడా దానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది అని పెద్దల ఉవాచ. కొంథమంది ఈ మాసం లో వచ్చే మామిడి పళ్ళను, ఒక విసనకర్రతో పాటు, దక్షిణ తాంబూల సహితంగా బ్రాహ్మణులకు దానం చేస్తారు. ఈ మాసం లో చేసిన గంగా స్నానం విశేష ఫలాలను ఇస్తుంది.
ఈ మాసం లో మొదట వచ్చే తదియ రోజు చేసిన పుణ్య కార్యాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి, ఈ రోజును అక్షయ తృతీయ అని అంటారు. ఈరోజు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం, తమ ఇండ్లలొ ఆ దేవి స్థిర నివాసం ఏర్పరచుకోవడం కోసం మహిళలు ఈరోజున లక్ష్మీదేవిని బంగారం, వెండి తదితర రూపాలలో కొనుగోలు చేస్తారు. ఈరోజున చేసే పితృకార్యాలు కూడా అక్షయమైన ఫలితాలను ఇస్తాయి.
శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ప్రసరించాలి అంటే, ప్రతి ఒక్కరూ చేయవలసిన మరికొన్ని పనులు:
1. ఉదయం, సాయంత్రం పూజా మందిరం లోను, తులసి కోట వద్ద దీపారాధన చేయతం.
2. ప్రతి శుక్రవారం ఇంటి గడపను, తులసి కోటను, పసుపు, కుంకుమ లతో అలంకరించడం,
3. మృదుభాషణ కలిగి, ఇతరులపై అసూయ, ద్వేషం, చులకన భావం, లేకుండా ఉండడం,
4. పువ్వులు, గోవు, దీపములు మొదలైన వాటిలొ లక్ష్మీదేవి అంశ ఉంటుంది కాబట్టి వాటిని అనాదరించరాదు.
5. లక్ష్మీదేవి సత్యప్రియ కాబట్టి అసత్యము పలకని వారి యందు, దైవభక్తి కలవారి యందు, ప్రియముగా మాట్లాడేవారియందు, పెద్దలను ఆదరించే వారియందు, ఇతరుల పట్ల దయ, కరుణ చూపు వారియందు, లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది అని శాస్త్ర ప్రమాణం.
ధూర్తులైన క్షత్రియులను సంహరించి, ధర్మ సంస్థాపన చేసిన పరశురామ జయంతి ఈరోజే. తండ్రి కిచ్చిన మాట కోసం, తల్లినె వధించి, మరల ఆ తండ్రి దీవెనలతో తల్లిని బ్రతికించుకున్న మాతాపిత భక్త పరాయణుడు పరశురాముడు. పరశురాముడు విష్ణువు అవతారం కాబట్టి, ఈ రోజున విష్ణు అర్చన, చేయడం రివాజు.
.
అందరికీ అక్షయ తృతియ శుభాకాంక్షలు.

No comments:

Post a Comment