Thursday, 26 June 2014

దాదాపు 20 సంవత్సరాల క్రితం నుంచి అంటే దాదాపుగా ఈ కార్పొరేట్ కాలేజీ లు మొదలు ఐన నాటి నుండి కేవలం రాంకులు, మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు, అందుకోసం సైన్స్ సబ్జక్ట్స్ తప్పఇంగ్లీషు, తెలుగు భాషలకు విలువ, ప్రాధాన్యం ఇవ్వక పోవడం మూలాన ఇప్పుడు వాటి పరిస్తితి అధ్వాన్నంగా తయారయింది. మా తరం అంటే తెలుగు మీడియం లో చదువు కున్నం కాబట్టి ఇంగ్లీషు grammer మాకు సరిగా రాలేదంటే అర్ధం ఉంది. కానీ అంతంత డబ్బులు పోసి ఇంగ్లీషు మీడియం లలో చదివించినా కుడా ఒక పేరా వ్రాస్తే అందులో పది గ్రామర్ తప్పులు. దానికి తోడు ఇప్పుడు వచ్చిన ఈ దిక్కుమాలిన sms భాష ఒకటి. అన్ని పదాలు సగం సగం వ్రాయటమే. abt ,hw , u , r , thnx , ఇలా. పరీక్ష పేపర్లు దిద్దుతుంటే ప్రాణం పోతోందండి అని వాపోయింది ఒక ఇంగ్లీషు లెక్చరర్ ఆ మధ్య.
ఇక తెలుగు గురించి ఏమి చెప్పాలి? 20 ఏళ్ళ క్రితం నుంచి సరి అయిన బోధనా లేకపోవడం మూలంగా ఇపుడు ఏ signboard చూసినా, ఏ షాప్ ముందు నేమ్ బోర్డు చూసినా, అందులో సవాలక్ష తప్పులు. ఇంక టీవీ లో స్క్రీన్ అడుగు భాగం లో వచ్చే స్క్రోలింగ్ చుస్తే ప్రతి వాక్యానికి ఒక తప్పు తప్పనిసరి. ఇంక వార్తలు చదివే వాళ్ళు, ఎంకర్స్ సంగతి ..... అందరికి తెలిసినదే. మొన్న మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం నాడు ఒక ప్రముఖ ఛానల్ లో రాత్రి ప్రైమ్ టైం న్యూస్ చదువుతున్న అయన "భాద్యతలు" అంటుంటే "బాధితులు" అని వినపడింది. మొదట నేను తప్పు వింటున్నానా అని అనుకొన్నా. శ్రద్ధగా విన్నా అదే పరిస్థితి. పంటి కింద రాయిలా. anchors లో చాల మందికి "ళ", "ణ" పలకదు. వెల్లి. పెల్లి, గననీయం అని చదువుతుంటే వినడానికి చాలా బాధగా ఉంటుంది. దానికి తోడూ, కొత్తదనం పేరిట అన్ని భాషలు కలిపేసి ఏదో వెర్రి మొర్రి పదాలు, సంకర భాషాను.
ఇప్పటికీ డిడి నేషనల్ లో శుద్ధమైన హిందీ, డిడి సప్తగిరి లో శుద్ధమైన తెలుగు మాట్లాడతారు. ఇదివరకు ప్రైవేటు చానల్స్ లో కూడా ఇంగ్లీష్ మాటలు పరిమితంగా వాడేవారు. ఇప్పుడు తెలుగు పొదుపుగా వాడుతున్నారు అనిపిస్తుంది. ఈ ప్రైవేటు చానల్స్ లో తెలుగు తనం ఉట్టిపడే కార్యక్రమాలే ఉండవు. ఏదో సంక్రాంతి పండుగకో, ఉగాది పండుగకో మనం తెలుగు వాళ్ళం అనే సంగతి గుర్తు వస్తుంది వాళ్ళకు.
మా పిల్లలు చదువుకునే కాలంలో తెలుగు లో ఇచ్చిన అన్ని పద్యాలూ భావార్ధలతో సహా నేర్పించేవాళ్ళం. ఇపుడు తెలుగు, ఇంగ్లీషు సబ్జక్ట్స్ లో కేవలం పరీక్షకు వచ్చే పాఠాలు మాత్రమే చెప్పి, అందులో ప్రశ్నలు మాత్రమే చెప్పి మిగతావి వదిలేస్తున్నారు. ఇక పిల్లలకు తెలుగు గురించి ఏమి తెలుస్తుంది?
ఇపుడైనా మించిపోయింది లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ తీసుకొని పిల్లలకు తెలుగు గురించి, చెప్పండి. సామెతలు, పొడుపు కథలు , నీతి కథల ద్వారా తెలుగును పరిచయం చేయండి. నాకు తెలిసి తెలుగు ను మొదటి నుంచి నేర్చుకోవడానికి గొల్లపూడి వారి పెద్ద బాల శిక్ష బాగా పని చేస్తుంది. ముందు మీరు నేర్చుకొని, పిల్లలకు ఇంట్లో ఆడుతూ పడుతూ చెప్పండి. పద్యాలూ, చమత్కారాలు తెలుగులో చాల ఉన్నాయి. అవి చెప్పండి. లేదంటే, కొన్నాళ్ళకు ఈ భాష లోని అందమైన పదాలన్ని మనం మర్చిపోతాం. ఆఖరికి కొన్నేళ్ళకు తెలుగు మృత భాషల జాబితాలో చేరిపోతుంది.

No comments:

Post a Comment