Thursday, 26 June 2014

దేశం లో ఎన్నో సమస్యలు, చర్చకు రాదగిన విషయాలు ఎన్నో ఉండగా, సాయి బాబా దేవుడా, కాదా అని ఒక ప్రైవేటు ఛానల్ లో చర్చ. దానికి ఒక వక్త ఒక పీఠాధిపతి. ఈ చర్చ వల్ల ఎవరికైనా ఒక పైసా ఉపయోగం ఉందా, ఆ ఛానల్ కి తప్ప. ఏదో ఒక గంట కాలక్షేపం. పోనీ ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల కొంచెం అయినా నాలెడ్జ్ వస్తుందా, అక్కర్లేని గొడవలు, తప్ప. ఇటువంటి దిక్కుమాలిన చర్చలు ఎందుకు పెడతారో తెలియదు. ఇదివరకు రోజుల్లో ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు ప్రైవేటు చానల్స్ ప్రోగ్రామ్స్ నియంత్రిన్చినపుడే బాగుండేది. ఇపుడు 24 గంటలు ప్రోగ్రామ్స్ అనేసరికి ఏ ప్రోగ్రామ్స్ చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు.
అయన ఒక పీఠాధిపతి. మతాలూ అన్ని దేవుని వద్దకు చేర్చే వివిధమైన మార్గాలు అని ఆయనకు తెలియదా? భారతదేశం ముఖ్యంగా హిందూ దేశం అయినప్పటికీ, కొన్ని శతాబ్దాలుగా అనేక మతాలూ ఈ భక్తీ ప్రవాహం లో కలిసాయి. అన్ని మతాల వాళ్ళు కలిసి మెలిసి ఎన్నో శతాబ్దాలుగా ఈ దేశం లో ఉంటున్నారు. రాజ్యాంగం కూడా అందరూ సమానం అని చెప్పింది. బాబా కూడా సమాధి చెంది 100 సంవత్సరాలు కావొస్తోంది. ఇపుడు కొత్తగా బాబా దేవుడా, కాదా అనే పాయింట్ ఎందుకు వచ్చింది? అసలు ఈ ప్రశ్న ఎవడి బుర్రలో పుట్టింది?
షిరిడి బాబా ఏనాడూ నాకు బంగారం, వెండి, కానుకలు ఇవ్వండి అని చెప్పలేదు. కనీసం నాకు ఈ నైవేద్యం పెట్టండి అని కూడా చెప్పలేదు. ఇంకా తన దగ్గరకు వచ్చిన అసహాయులకు అయన ఎదురు సహాయం చేసారు. నివేదనకు కూడా ఒకసారి నివేదన చేసిన దైనా పర్వాలేదు, ఇంట్లో ఏది ఉంటె అదే అని కూడా చెప్పారు. అప్పు చేసి, షిర్డీ రావద్దని, నన్ను మనస్పూర్తిగా తలచుకుంటే ఎక్కడ అయినా ప్రత్యక్షం అవుతానని కూడా అయన జీవించి ఉన్నపుడే భక్తులతో చెప్పారు. ఆయన జీవించి ఉన్నపుడు, సమాధి చెందినా తరువాత కూడా ఎన్నో నిదర్శనాలు భక్తులకు చూపించారు. కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇటువంటి చర్చలు ప్రజలకు అవసరమా?
ఎంతసేపు, రకరకాల సంస్థల వాళ్ళు టీవీల్లో హిందువుల ఆచార వ్యవహారాలు, నమ్మకాల మీదనే ఆధారపడి చర్చలు సాగిస్తారు కాని, ఇతర మతాల జోలికి పోరెందుకు? ఎందుకంటే వాళ్ళంటే భయం. వాళ్ల మతాలలో మాత్రం నమ్మకాలు, మూఢ నమ్మకాలూ లేవా? ఇంకా మన నమ్మకాలూ శాస్త్రీయంగా కూడా రుజువు అయ్యాయి కూడా. అయినా హిందువులే అన్ని చర్చలకి టార్గెట్. ఎందుకంటే ఎవరి పాపాన వాళ్లే పోతారు అని నిమ్మకు నీరెత్తినట్టు ఉండే జాతి ఇది అని.
బాబా దేవుడు కాదు అని సదరు స్వామి వారు చెప్పినపుడు, పుట్టకొకరు, చెట్టుకొకరు అని పుట్టుకొస్తున్న స్వామిజిల మాటేంటి మరి? ఇది ఎవరూ అడగరు? వాళ్ళకు భక్తులు బంగారం, వెండి కానుకలు ఇవ్వడం లేదా? వాళ్ళకు పెద్ద పెద్ద మహాల్స్ ఉండటం లేదా? వాళ్ళు AC కారుల్లో తిరగడం లేదా?
ఏది ఏమైనా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి దిక్కుమాలిన చర్చా కార్యక్రమాలను ప్రేక్షకులు ఖండించాలి. ప్రజలకు పనికి వచ్చే కార్యక్రమాలు చానల్స్ రూపొందించాలి. వాళ్ల రేటింగ్ పెంచుకోవడానికి అక్కర్లేని చచ్చు, పుచ్చు ప్రోగ్రామ్స్ చేయొద్దని టీవీ చానల్స్ వాళ్ళకు నా మనవి. ప్రపంచం లో ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రజలను educate చేయడానికి. అవి చేయండి. అందరు సంతోషిస్తారు.

No comments:

Post a Comment