Thursday, 26 June 2014

ఈరోజు ఒక గ్రూప్ లో ఒక మహిళా సభ్యురాలు నన్ను ఒక ప్రశ్న అడిగారు. వాళ్ళ పిల్లలు అసలు పనిలో సహాయం చేయడం లేదు అని, ఉద్యోగిని అయిన ఆవిడా అన్ని పనులు చేయటం కష్టం గా ఉంది అని, ఏదైనా సలహా చెప్పండిఅని.
పిల్లలకు ఇంట్లో పని చేయడం చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. బాటిల్స్ లో నీరు నింపడం, భోజనాల సమయం లో టేబుల్ సర్దడం, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టి ఇల్లు నీట్ గా ఉంచడం, ఉతికిన బట్టలు మడత పెట్టి ఎవరివి వారికీ సర్దడం, ఇంకా తల్లులు ఉద్యోగస్తులు అయితే, కూరలు కడిగి పెట్టడం, కొంచెం పెద్ద వయసు పిల్లలు అయితే, కూరలు తరిగి ఇవ్వడం, బియ్యం కడిగి పెట్టడం, వారి టిఫిన్ బాక్స్ లు వారు సర్దుకోవడం, ఏదైనా టూర్ వెళ్ళినపుడు వారి సూట్ కేసులు వారు సర్దుకోవడం, ఇటువంటి పనులు పిల్లల చేత చేయించవచ్చు. కానీ అత్యధికంగా తల్లులు చేసే పొరపాటు ఏమిటంటే, తమ పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అని, వారికీ ఏమి తెలియదు అని అనుకోవటం. పిల్లలు ఏ వయసు వారైనా చాల తెలివిగా ఉంటారు. వాళ్ళకు చెప్పే విధంగా చెప్తే చిటికెలో అర్ధం చేసుకుంటారు.ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది. మనం వాళ్ళకి చెప్పే పనులు, మనం చేస్తున్నావే అయి ఉండాలి. ఉదాహరణకు, మనం బట్టలు మడత పెట్టేటప్పుడు వారి చేత కూడా చిన్న బట్టలు కానీ, వాళ్ళ బట్టలు కానీ మడత వేయమని చెప్పాలి. మనం వంట గదిలో పని చేసేటప్పుడు, మనం కూరలు తరిగేటప్పుడు ఆ కూరలు ఒక్కొక్కటీ కడిగి ఇవ్వమని చెప్పాలి. మనం బాటిల్స్ లో నీరు నిమ్పినపుడు, రెండు మనం నింపి, మిగతావి వారిని నింపమని చెప్పాలి. ఈ పనులు చేస్తూ ఉన్నంతసేపు మనం వారిని కబుర్లతో, కథలతో , జోక్స్ తో ఎంగేజ్ చేయాలి. ఒకవేళ ఉద్యోగినులు అయితే, మీరు ఎంత బిజీ గా ఉన్నారో, వాళ్ళు చేసే చిన్న చిన్న సహాయాల వల్ల ఎంత సమయం మీకు అదా అవుతోందో చెప్పాలి. వాళ్ళు సహాయం చేసిన ప్రతిసారి వాళ్ళకు థాంక్స్ చెప్పాలి. చిన్నతనం లోనే వాళ్ళకు మీ వెనకాలే పని చేయటం, మీకు సహాయం చేయటం అలవాటు చేస్తే ఆ అలవాటు వాళ్ళు పెరిగిన తరువాత కూడా మర్చిపోరు.
ఇక్కడ చాల మంది ఒక ప్రశ్న అడుగుతారు. ఇలా ఇంటి పనులలో పడి తిరిగితే వాళ్ల చదువు ఏమి కాను? అని,1. ఈ చిన్న చిన్న పనులకు ఎంతో టైం పట్టదు. 2. చదువు మధ్యలో వాళ్ళకు రిలాక్స్ కావడానికి ఇవి తోడ్పడతాయి. 3. ఇల్లు, ఉద్యోగం రెంటినీ అమ్మ ఎంత శ్రమ తీసుకుని నిర్వహిస్తోంది వారికీ అర్ధం అవుతుంది. కనుక వాళ్ళు మర్నాటి నుంచి స్వచ్చందంగా ఇంటి పనులు చేస్తారు. ఆ సమయానికి తగ్గట్టు వారి చదువుల వేళల్లో మార్పు చేసుకుంటారు. ఇందాకే చెప్పా కదా పిల్లలు తెలివైన వారు అని. 4. కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ పనులు చేసుకోవటం వలన మీకు, మీ పిల్లలకు మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుంది. ఇది భవిష్యత్ లో మీ అనుబంధాలు గట్టిపడడానికి చాల ఉపయోగపడుతుంది. 5. ఇలా చిన్న చిన్న పనులు పెంచుకోవటం వలన వాళ్ళకు బాధ్యత తెలిసివస్తుంది.
కాబట్టి, ఇలా చేసి చుడండి. పది రోజుల్లో మార్పు మీరే గమనిస్తారు.

No comments:

Post a Comment