Friday, 27 June 2014

అనగనగా ఒక చెత్త ఛానల్. అది దాని రేటింగ్స్ పెంచుకోవడానికి ఏ గడ్డైనా తింటుంది. ఆ నిర్వాహకులకు రేటింగ్ పెంచుకోవడం తప్ప వేరే పని లేదు. ఆ ఛానల్ ట్యాగ్ లైన్స్ మాత్రం కోటలు దాటుతాయి. మెరుగైన సమాజం కోసం అని చెప్పుకునే ఆ ఛానల్, మెరుగుగా ఉన్న సమాజాన్ని ముంచేసేందుకే పుట్టినట్టుంది.

అయన ఒక పీఠాదిపతి. అయన పని హిందుత్వాన్ని, దశదిశలా వ్యాపింపచేయడం. ఆయనను అంతటి స్థానం ఇచ్చి గౌరవించారు అంటే ఆయనకు సమాజం పట్ల అంతో ఇంతో బాధ్యత ఉంది కదా. అది పాపం అయన మర్చిపోయారు. ఒక పీఠానికి అధిపతి అయి ఉంది, కాషాయం ఎప్పుడైతే కట్టాడో, అయన అరిషడ్వర్గాలను జయించి ఉండాలి. పాపం అది అయన చేతకాలేదు.ఆయనకు ఇష్టం లేని ప్రశ్నలు వేస్తె వారి చెంప చెల్లుమనిపిస్తాడు.  అటువంటి వారికీ వాక్సుద్ధి  ఉండాలి. నోరు, మాట మన్నించ దగినవిగా ఉండాలి. కానీ అయన నోరు విప్పితే కాంట్రవర్సీ లే. అన్నిట్లోనూ వివాదమే. పీఠాధిపతి గా అయన పొందలేని గుర్తింపు వివాదాల ద్వార పొందుతున్నాడు.

ఈ బుర్ర లేని ఛానల్, ఆ పని లేని పెద్దమనిషిని చర్చా కార్యక్రమానికి పిలిచింది. ఒక పక్క, రాష్ట్రం అడ్డుగోలు విభజన, ఒకరికి లోటు బడ్జెట్, ఒకరికి మిగులు బడ్జెట్, కరంటు, నీళ్ళు, అన్నీ వివాదాస్పదం, రెండు రాష్ట్రాల వాళ్ళు సతమతం అవుతున్నారు, మాటల ఈటెలు విసురుకుంటున్నారు. ఇంకో పక్క పసిఫిక్ సముద్రం లో ఎల్ నినో, ఋతుపవనాలు ఆలస్యం, రైతన్నకు నీరు లేదు, పంటలు పండవు, ఎక్కడ మళ్ళీ కరువు కాలం వస్తుందో అనే భయం, మరో ప్రక్క జాతి ఉపయోగానికి అంటూ, రైలు చార్జీల మోత, గ్యాస్ బండ గుదిబండై మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అనే భయం, --- ఇవన్ని ఇలా ఉంచి, ఆ బుర్ర లేని ఛానల్ కి ఆ చర్చకు టాపిక్ ఎవరు ఇచ్చారో తెలియదు, ఆ చర్చ వల్ల సమాజానికి ఏమి ఉపయోగమో తెలియదు కానీ, ఇప్పటికి సమాజం లో ఉన్న సంఘర్షణలు చాలవు అన్నట్లు, "శ్రీ షిరిడి సాయి బాబా దేవుడా ? కాదా?" అనే అంశం మీద ఆ సదరు పీఠాధిపతి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

1. అన్ని మతాలూ దేవుని చేరే వివిధ మార్గాలు అని అన్ని మతాలూ ఘోషిస్తున్నాయి. అందులోను,  హిందూ ధర్మం ఎంతో విశాల హృదయం తో అన్ని మతాలను ఆదరించింది. ఈనాడు, హిందూ ధర్మం, వారిని పూజించద్దు వీరిని పూజించద్దు, వీరినే పూజించాలి, ఈయనే దేవుడు అనే ఆంక్షలు పెట్టలేదు. అటువంటి హిందూ ధర్మానికి చెందిన ఒక పీఠాధిపతి, బాబా ముస్లిం, ఆయనను పూజించే వారు రాముని పూజించవద్దు అని అనటం ఎంతవరకు సబబు?

2. ప్రతి గ్రామం లోను, బాబాను పూజించే వారు ఎక్కువ అవడం వలన, షిర్డీ కి భక్తుల తాకిడి ఎక్కువ అవడం వలన, ఇదివరకు రాముని పూజించే వాళ్ళు కూడా ఇప్పుడు బాబాను పూజించడం వలన , రామునికి రావలసిన ఆదాయం అంతా బాబాకి వెళ్ళిపోతోంది అని అయన ఆక్రోశం. ఒక సన్యాసి కి డబ్బు గురించిన చింత ఎందుకండీ? రాముడి డబ్బు తగ్గిపోతే రాముడు చూసుకుంటాడు, ఆ ఆ దేవాలయాలు కట్టించిన ధర్మకర్తలు చూసుకుంటారు కదా?

3. ఒకవేళ ఈయన పూజించద్దు అని చెప్పినంత మాత్రాన బాబాను తమ దైవంగా, తండ్రిగా భావించే భక్తులు మానరు కదా? ఎవరిని పూజించాలి, ఎవరిని నమ్మాలి అనేది భక్తుల వ్యక్తిగత విషయం. దీనిని పబ్లిక్ చేయడం ఎంతవరకు సమంజసం.?

4. వేరే మతం వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు హిందూ సమాజం లో అంతర్గత కలహాలు తేవడానికి ఇదంతా చేస్తున్నారు అని ఆ స్వామిజి సెలవిచ్చారు. ఇందులో అర్ధం ఏమిటో ఆయనకే తెలియాలి.

5. ఈ చర్చ చూసిన/విన్న  సోదరులు కొందరు, సాయి భగవంతుడే కాదు, అయన ఒక గురువు మాత్రమే, ఆయనను దైవం తో సమానంగా చూడకండి, దైవం అనే హోదా ఇవ్వకండి అని మొత్తుకున్నారు. మరి చెట్టుకొకరు, పుట్టకొకరు పుట్టుకొస్తున్న స్వమీజిల గురించి ఎవరూ ఏమి మాట్లాడరే? వాళ్ళందరూ ఇంతంత బంగారాలు దిగేసుకుని, పట్టు పరుపుల మిద బంగారు సింహాసనాల మిద కుర్చుని, పడపూజకు లక్షలు లక్షలు రుసుము వసూలు చేస్తుంటే మాట్లాడరే?

6. కలియుగం లో బాబానే కాకుండా, రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి, ఇటువంటి మహానుభావులు ఎందఱో ఉన్నారు. ఎంతో మందికి మార్గ నిర్దేశం చేసారు. వాళ్ళందరి విషయం లో లేని దుగ్ధ బాబా విషయం లోనే ఎందుకు?

7. కొందరి ఉవాచ ఏమిటంటే, బాబా గురించి వేదాలలో లేదు కాబట్టి ఆయనను ప్రామాణికంగా తీసుకోలేము. బాబా నిన్న మొన్నటి వరకు మన మధ్యలో తిరిగిన వారు. కొన్ని యుగాల క్రితం పుట్టిన వేదాలలో అయన ప్రసక్తి ఎలా ఉంటుంది?

8. బాబా ను దైవంగా కొలిచినా, కొల్వక పోయినా, అయన నేర్పిన భక్తీ, క్రమశిక్షణ బాబా భక్తులందరికీ అలవాటు అయిపోయాయి. ఏ బాబా మందిరం లోను, ఏ పండగ నాడు కనీ, విశేష దినాలలో కనీ, ఎంత రద్దీ ఉన్నా, తొక్కిసలాట జరుగదు. భక్తులు ఎంతో నిదానంగా క్యు పాటిస్తూ నిశ్శబ్దం గా లైనులో కదులుతుంటారు.

9. అసలు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబా తనను తానూ ఎప్పుడూ దేవుడిని అని చెప్పుకోలేదు. దేవుని బానిసను మాత్రమే అని చెప్పారు. నేను దక్షిణగా తీసుకునే ప్రతి పైసాకి నేను భగవంతునికి లెక్క చెప్పాలి అని చెప్పారు. నన్నే పూజించండి అని చెప్పలేదు. ఎవరు ఏ దేవుని పూజిస్తే వారికీ ఆ రూపం లో దర్శనం ఇచ్చారు. నాకు ఈ విధంగా పూజ చేయండి అని చెప్పలేదు. ఎవరి ఇష్టం అయినట్టు వారిని పూజించుకోమని చెప్పారు.

10. సదరు పీఠాధిపతి గారు ఇంకో విషయం సెలవిచ్చారు. బాబా ముస్లిం అయితే, ముస్లిములు ఎక్కువ బాబాను ఎందుకు పూజించడం లేదు అని? ముస్లిములకు నిర్గుణమైన ఆరాధన తప్ప, సగుణారాదన లేదు. ముస్లిములే కాదు, మార్వాడీలు, సిక్కులు ఎంతో మంది బాబాను పూజిస్తున్నారు. సామాన్య భక్తులు కేవలం భక్తీ తప్ప , బాబా మతాన్ని పట్టించుకోవటం లేదు. అందరికీ ఆదర్శం గా ఉండవలసిన ఆ స్వామి బాబా యొక్క మతం కులం అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు.

అసలు సమాజానికి ఒక్క పైసా మేలు చేయని ఇటువంటి చర్చలను ప్రోత్సహించే చానల్స్ ను బాన్ చెయ్యండి. అక్కర్లేని విషయాలకు ధర్నాలు, స్త్రైకులు చేసే వాళ్ళు, ఇటువంటి చర్చలు బాన్ చ్యడానికి ధర్నాలు చేయండి.

No comments:

Post a Comment