Friday, 27 June 2014

అనగనగా ఒక మహానగరం లోని ఒక రద్దీ అయిన వీధిలో ఆకాశాన్ని అంటే అపార్టుమెంట్. అందులో ఒక ఇంట్లో 2,3 సంవత్సరాల ఒక పాప. పేరు మున్ని. మున్ని వాళ్ల అమ్మ ఇవాళ చాల హడావిడిగా ఉంది. ఆమె చాల అవసరంగా ఇవాళ బ్యాంకు కు వెళ్లి ఎక్కడో చదువుకుంటున్న మరిది కి డబ్బు పంపాలి. భర్తకు తీరిక లేదు. తనే తప్పనిసరిగా వెళ్ళాలి. అందుకే తనతో పాటు తీసుకెళ్ళడానికి మున్ని ని తయారు చేసి కిటికీలో కూర్చోపెట్టింది. ఇంతలో కింద నుంచి హాహాకారాలు, గొడవలు, గగ్గోలు, మత విద్వేషాలు, గృహ దహనాలు, లూటీలు, పోలీసులు, లాఠి చార్జీలు. షరా మామూలుగా నగరం లో కర్ఫ్యూ విధించారు. 3 రోజులు గడిచిపోయాయి. బ్యాంకు పని అవ్వలేదు. మతకలహలకు కారణం మొదట తెలియలేదు. తరువాత ఎవరో హిందూ కాలనీ లో నడచి వెళ్తున్న ఒక ముస్లిం మిద చెప్పు విసిరారు. అది ఇంత మరణ హోమానికి దారి తీసింది. పరిస్థితులు ఎలాగో సద్దు మణిగాయి.  ప్రశాంతత వచ్చింది. నగరం నివురు కప్పిన నిప్పులా ఉంది. మున్ని వాళ్ల అమ్మ మళ్లీ బ్యాంకు పనికి బయలుదేరింది. మున్ని ని తయారు చేసింది. చెప్పులు వేద్దామంటే కనబడలా... ఏమైనట్టు, ఈ నాలుగు రోజుల నుంచి ఎక్కడికీ వెళ్ళలేదే? అనుకుంటూ అంతా వెతికింది. ఎక్కడా లేదు. కోపం తో అసహనం తో మున్ని కి నాలుగు అంటించింది. మున్ని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ ఏడుపు లోనే ఏదో చెప్తోంది. వెక్కిళ్ళ మధ్యలో తల్లికి ఏమి అర్ధం కాలేదు. కానీ కొట్టినందుకు తనే మళ్లీ బాధపడుతోంది. మున్ని ని దగ్గరకు తీసుకొని మళ్లీ చెప్పమ్మా అని అడిగింది, మున్ని చెప్పింది--" ఆరోజు నా చెప్పు కిటికీలోంచి బయటకు పడిపోయింది" -- అని.

No comments:

Post a Comment