Friday, 6 June 2014

పార్టీల్లో లేదా ఫంక్షన్స్ లో ఎంతమంది ఉన్నా, అందరి దృష్టి ఇద్దరు ముగ్గురి మిద ఉంటుంది. వాళ్ళే ఆ పార్టీ కి కేంద్ర బిందువులా ఉంటారు. వారి చుట్టూ ఒక విధమైన చైతన్యం, ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంటాయి. వారిలో ఏదో ఒక ప్రత్యెక ఆకర్షణ ఉంటుంది. అది ఖచ్చితంగా ఏమిటో చెప్పలేము. వారి ప్రభావం మాత్రం ఖచ్చితంగా అందరి మిద ఉంటుంది.

ఇలా ఒక గుంపులో అందరి మీద ప్రభావం చూపించే వ్యక్తులలో అందం, ఆకర్షణ, మాటతీరు, హుందాతనం, ప్రవర్తన, ప్రతిభా పాటవాలు ఇవన్ని లేదా కొన్ని లక్షణాలు ఉండవచ్చు.

  కొంతమంది నలుగురినీ ఆకర్షించే అందం, ముఖ సౌందర్యం కలిగి ఉన్నా, అదొక్కటే ప్రభావితం చేయడానికి సరిపోదు. నిటారుగా , ఆత్మవిశ్వాసం తో నడవడం, ఖరీదైన వస్త్రాలు ధరించక పోయినా, చక్కగా శరీరానికి నప్పే దుస్తులు ధరించడం, ( అన్ని ఫేషన్లు అందరికీ నప్పవు. అది గమనించుకొని మన వస్త్ర ధారణా ఉండాలి. ) శరీర నిర్మాణానికీ, దుస్తులకూ నప్పే విధంగా నగలు అలంకరించు కోవటం, చక్కటి హెయిర్ స్టైల్, తగినంతగా అలంకరణ ఇవన్ని అందాన్ని, ఆకర్షణను ఇనుమడింప చేసేవే.  అందరికీ శరీర నిర్మాణం, ముఖ సౌందర్యం చక్కగా లేకపోయినా, బయటకు కనిపించే తీరు, మన స్వభావం, మాటతీరు చక్కగా ఉంటె గుర్తింపు అధికంగా ఉంటుంది.

 ఇతరుల వద్ద మనం గుర్తింపు పొందడానికి ముఖ్యమైన కారణం మన మాట తీరు. చక్కని చిరునవ్వు, చక్కగా చిన్న, పెద్ద అందరిని పలకరించడం, వయసులో పెద్ద వారికి నమస్కరించడం, వారి పట్ల గౌరవ భావం తో ఉండడం, ఇటువంటివి మనకు వెంటనే గుర్తింపు తెస్తాయి. పార్టీ కి పిలిచినా వారితోనే కాకుండా, వచ్చిన మిగతా అతిధులను కూడా చక్కగా పలకరించడం, వారి యోగ క్షేమాలు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు కనుక్కోవడం ఎంతో బాగుంటుంది. అతిథులలో ఎవరితో అయినా మనకు బేధాభిప్రాయాలు ఉన్నా , అవి బయట పడనీయకుండా వారితో కూడా అవసరానికి నవ్వుతూ మాట్లాడాలి. వారి గురించి ప్రక్క వారితో చులకనగా మాట్లాడడం, వ్యంగ్యమైన మాటలు విసరడం ఇటువంటివి మన ప్రవర్తనను దిగజారుస్తాయి. ఏదైనా విషయం మీద మాట్లాడేటప్పుడు సూటిగా స్పష్టంగా, వినేవారికి చక్కగా అర్ధం అయ్యేలా, స్పుటమైన గొంతుతో మాట్లాడాలి. నలుగురిలో మాట్లాడడానికి భయంగా ఉన్నపుడు మనకు బాగా తెలిసిన వాళ్లతో కొంచెం సేపు మాట్లాడి అపుడు కొత్త వారితో మాట్లాడాలి. మాటల్లో, అతిశయం, పిల్లల చదువుల గురించో, కొత్తగా కొన్న ఆస్తి గురించో గర్వం ఉండకూడదు.అన్నీ నాకే తెలుసు అన్నట్లు మాట్లాడడం, నా మాటే చెల్లాలి అన్నట్టు మాట్లాడడం తగదు. మనం మాట్లాడేటప్పుడు వినేవాళ్ళకు వినసొంపుగా ఉండాలి. అలాగే ఇతరులు మాట్లాడేటప్పుడు మనం కూడా శ్రద్ధగా వినాలి. ఏదో చెప్పావులే,  నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి అన్నట్టు వినకూడదు. మన హావభావాలు కూడా సంస్కారంతో ఉండాలి. అలాగే దూరంగా ఉన్నవారి గురించి చాడీలు చెప్పడం, నెగటివ్ గా మాట్లాడడం మన సంస్కార లేమిని తెలియజేస్తాయి.

 గోళ్ళు కొరకడం, తల గోక్కోవడం, మాటిమాటికీ ఊత పదాలు వాడడం, పక్క వాళ్లకు చిరాకు తెప్పిస్తాయి. ఆహారం తీసుకునే విషయం లో కూడా, మొదట్లోనే ఎక్కువ వడ్డించు కోకుండా అన్నిటినీ కొంచెం కొంచెం రుచి చూసి బాగా నచ్చినది మరి కొంచెం వడ్డించుకోవాలి. ముందే ఎక్కువ తీసుకుని పళ్ళెం లో వృధా చేయడం సరికాదు. అలాగే తినేటప్పుడు శబ్దం చేస్తూ తినడం, ప్రతి పదార్ధానికీ వ్యాఖ్యలు చేస్తూ తినడం సరికాదు.

మనకు గానం, నృత్యం ఇటువంటి వాటిల్లో ప్రవేశం ఉన్నపుడు ఎవరైనా అడిగిన వెంటనే పాడాలి. మొహమాటం ఉంటె సున్నితంగా తిరస్కరించాలి. అంతే కానీ, ఎక్కువ సేపు బ్రతిమాలించు కోవడం, ఆఖరికి పాడడం, ఇలా చేయకూడదు. మరోసారి మీ మీద వారు దృష్టి పెట్టరు.

చిన్న పిల్లలను పార్టీలకు, ఫంక్షన్లకు తీసుకేల్లినపుడు వారు కూడా అందరితో కలుపు గోలుగా, స్నేహంగా ఉండేటట్టు ఇంటివద్దనే అలవాటు చేయాలి. వారికీ కూడా అందరినీ పలకరించడం నేర్పాలి. ఏదో ఒక విషయం గురించి, మొండి పట్టు పట్టడం, మిగిలిన పిల్లలతో పోట్లాడడం,  ఇటువంటివి జరిగినపుడు పెద్దలు సున్నితంగా వ్యవహరించాల్లి. పిల్లల్లో ఎవరిదో ఒకరిదే తప్పు అని నిర్ణయిన్చాకుండా అందరికీ సర్ది చెప్పాలి.

ఈ విధంగా చేస్తే, పార్టీల్లో, మీరు అందరికీ కేంద్ర బిందువై, అందరి మన్ననలు పొందుతారు. ఏమంటారు?


No comments:

Post a Comment