ఎక్కడ చూసినా మన సంస్కృతి,సంప్రదాయాలు, అడుగంటిపోతున్నాయి, బ్రాహ్మణ్యం మంటకలిసిపోయింది అని అందరం మొత్తుకుంటున్నాము. కాలం మారింది. మనుషులూ మారుతున్నారు. ఫేషన్స్ మారాయి. పిల్లలూ వాటినే పాటిస్తున్నారు. అనేక కారణాలవల్ల ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళక తప్పని పరిస్థితి. ఈకారణంగా సమాజం లో, పధ్ధతులలో చాలా మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు అంతరించాయి. ఇంట్లో మంచి, చెడూ చెప్పే నాథులు కరువైనారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వీలు వాళ్ళది. ఒకప్పుడు ఇంట్లో తల్లితండ్రులు ఏదైనా చెప్తే, ఇష్టమున్నా లేకపోయినా, పెద్దవాళ్ళు చెప్పారు కదా అని పిల్లలు విని పాటించేవారు. ఇప్పుడు ఆ ముచ్చట లేదు. పెద్దలు ఏమి చెప్పినా పిల్లలు వారికిష్టమైనవే వింటున్నారు. తల్లితండ్రులు కూడా పోన్లే, వాళ్ళకు ఎలా ఇష్టమైతే అలాగే ఉండని అనుకుని వదిలేస్తున్నారు. దీనివలన, పిల్లలకు అసలు పధ్ధతులు అంటూ తెలియడం లేదు. నలకంత బొట్లు పెట్టుకోవడం, జుట్టు గాలికి వదిలేసి తిరగడం ఇవన్నీ కూడా పెద్దలు అడ్డుకోలేకపోతున్నారు. మన పధ్ధతి కాదు అని చెప్పలేక పోతున్నారు. ఇతర మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతులు మరీ ఇంతగా నాశనం చేసుకోవటం లేదు. పిల్లలు మన మాట వినేటట్టు, మనం చెప్పిన పధ్ధతులలో నమ్మకం ఉంచి, మన ధర్మం పట్ల, ఆసక్తిని, విశ్వాసాన్ని ఉంచి, చక్కటి పధ్ధతులు పాటించేటట్లు మనమే వారికి అలవాటు చెయ్యాలి. ఏమి చెప్పినా అబ్బ! మళ్ళీ మొదలెట్టారురా బాబూ అని అనుకోకుండా కొంచెం సేపు నిలబడి మన మాటల మీద శ్రధ్ధ చూపేటట్టు మనం చిన్నతనం నుంచి అలవాటు చెయ్యాలి. ఇందుకు మనం చిన్నతనం నుంచి వారితో కొంతసేపు గడపడం అలవాటు చేసుకోవాలి. ఈరోజుల్లో ఎంతమంది తల్లులు వారి పిల్లలకు ఒక్క అరగంట సమయం వెచ్చించి, కథలో, చిన్న చిన్న శ్లోకాలో అలవాటు చేస్తున్నారు? ఎంతమంది తండ్రులు పిల్లలతో కలిసి వారానికి ఒక్కసారైనా ఆడుకుంటున్నారు? ఎంతమంది భోజనాల దగ్గర టీవీ చూడకుండా సరదాగా కుటుంబం అంతా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు? (కనీసం ఆదివారం నాడైనా).. ఇవన్నీ మన పిల్లలకు అలవాటు చేసినప్పుడు పధ్ధతులు వాటంతట అవే అలవాటు అవుతాయి. ఇంట్లో వయసు మళ్ళిన పెద్దవాళ్ళు ఉంటే, ఆ పెద్దలనూ, పిల్లలనూ కొంతసేపు కలిపి వదిలెయ్యాలి. వారేమి చెప్పినా, వీరేమి వినినా మనం పట్టించుకోకూడదు. చాలా మంది తల్లితండ్రులు చేసే మరో తప్పు, ఇంట్లో ముసలి వళ్ళని (అత్తామామల్ని) బంధువులని పిల్లల ఎదురుగానే విమర్శించడం. దీనివల్ల, వారికి ఎవరిమీదా గౌరవం, ప్రేమ కలుగదు. చివరికి అది అలాగే కొనసాగితే మనమీద కూడా నమ్మకం కోల్పోతారు. ఇవన్నీ చిన్న చిన్న సూత్రాలు. మన జీవితాలను, మన పిల్లల జీవితాలను క్రమశిక్షణలొ ఉంచేవి.
No comments:
Post a Comment