సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని పాడుకున్న సంస్కృతి మనది. రాజ్యం అంటే రామ రాజ్యం, కొడుకు అంటే రాముడిలా ఉండాలి, ప్రభువు అంటే రాముడిలా ఉండాలి, అని నమ్మే సంప్రదాయం. ఆఖరికి ఎవరి మంచితనాన్నైనా చెప్పవలసి వచ్చినప్పుడు, రాముడు మంచి బాలుడు అనే చెప్తాము. ప్రతి భారత యువతీ రాముని లాంటి భర్తనే కోరుకుంటుంది. విష్ణువు యొక్క ఎన్నో అవతారాలు ఉన్నా, కష్టం వచ్చినప్పుడు " రామా! ఎక్కడున్నావయ్యా ? " అనో, " రామచంద్ర ప్రభూ" అనో రాముణ్ణే స్మరిస్తాము. ఇక సీతమ్మవారి విషయానికి వస్తే, సహనానికి మారుపేరు సీతమ్మ, భర్తను ప్రేమించడానికి, భర్త అడుగుజాడల్లో నడవడానికి, భర్త కోసం, రాజ్యాన్ని, సంపదనూ తృణప్రాయంగా వదిలేసిన మహాసాధ్వి ఆమె. భారత స్త్రీలందరకూ ఆమె ఆదర్శం. మరి ఈరోజున ఈ తరం వారందరూ "రాముడు సీతమ్మకు ఏమి చేసాడు? కడుపుతో ఉన్న భార్యని అడవులకు పంపడమేనా? శీలపరీక్ష కోసం అగ్నిలో ప్రవేశపెట్టడమేనా? మహాసాధ్విని అనుమానించడమేనా ఆయన గొప్పతనం? ఒక చాకలి వాని మాట పట్టుకుని భార్యను అనుమానించాడే?" ఇటువంటి మాటలు క్రిందటి తరం నుంచి వినబడబట్టి కదా, నేడు ఈ తరంలో భారతీయ వివాహ వ్యవస్థ ముక్కలైపోతోంది!
రాముడు శ్రీ మహావిష్ణు అవతారం అని అందరికీ తెలిసినదే...అవతారం అనగా లోకంలో చెడు పెచ్చుమీరినప్పుడు, భగవంతుడు ఆయా కాలాలకు అనుగుణంగా రూపం ధరించి, ఆ చెడును అంతమొందించడానికి పూనుకుంటాడు. ఇక్కడ రావణుడు, మహాశివభక్తుడు. అత్యంత ధైర్యశాలి. ప్రజలు ఆరాధించే ప్రభువు. శక్తిసంపన్నుడు. అటువంటివాడి దగ్గర పరస్త్రీ వ్యామోహం అనే ఒక దుర్గుణం ఉంది. పైగా, నరులు, వానరులు తప్ప మరెవ్వరి వలన చావు రాకూడదు అని వరం పొందినవాడు. అందువలన భగవానుడు నరుని అవతారం ఎత్తాలి. అన్ని నీతినియమాలు ఉన్న రావణునితో యుద్ధం రావాలి అంటే, అతను ఏదో ఒక తప్పు చేయ్యాలి. అది అతని బలహీనత కారణంగా సీతమ్మవారిని ఎత్తుకెళ్ళాలి. వానరుల వలన కూడా చావు రాకుండా కోరుకున్నాడు కాబట్టి ఈ క్రతువులో వానరులు కూడా భాగం పంచుకోవాలి. రావణుడు సీతాసాధ్విని ఎత్తుకెళ్ళాలంటే రాజభవనం లో ఉంటే కుదరదు. ఆవిడ ఏకాంతంగా ఉండాలి. అందుకే వనవాసం. అందుకు కైకమ్మ వరాల ప్రహసనం. మామూలుగా దశరథుడు అనుకున్నట్టు రాజ్యాభిషేకం జరిగిపోతే, ఇవన్నీ జరగవు. రాజ్యాభిషేకం తెల్లారి అనగా కైక భర్తను వరాలు అడుగుతుంది. ఇంకా ముందు అడిగి ఉంటే, సమయం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి, రాజ్యాభిషేకం ఎలాగో అలాగ జరిగిపోయి ఉండేది. లేదా, రాముణ్ణి చిన్నతనం నుంచి పెంచిన ప్రేమ కారణంగా తన మనసే మారిపోయి ఉండేది. అలా జరిగినప్పుడు అవతార లక్ష్యం నెరవేరదు. అయోధ్యా ప్రభువైన దశరథునికి ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా కైక సమయం మించిపోయిన తరువాత దశరథుణ్ణి వరం అడిగి మారుమాట్లాడకుండా దిగ్బంధనం చేసింది. పాపం ఈ అవతార లీలలో తన వంతు పాత్ర పోషించినప్పటికీ, మొత్తం రామాయణంలో చెడ్డపేరు మిగిలినది కైకమ్మకే. రాముడు సీతమ్మను శీలపరీక్ష కోరినది కూడా ఒక భర్తగా కాదు. ఒక ప్రభువుగా. ఈరోజు తాను ధర్మ ప్రకారం నడుచుకుంటే, రేపు ప్రజలకు తీర్పు చెప్పగలడు. శిక్షలు విధించగలడు. ఈరోజు ధర్మం తప్పితే, రేపు ప్రజలే ప్రశ్నిస్తారు. ఆ అవకాసం ప్రభువన్నవాడు ప్రజలకు ఇవ్వకూడదు. ప్రభువు ఎట్టి పరిస్థితులలోనూ ధర్మం వీడకూడదు. తన భార్య, సహధర్మచారిణి, ఎటువంటి తప్పు చేయదని ఆయనకు తెలుసు. ఆ మాట అగ్నిహోత్రుడంతటివాడు చెప్తే ఆ మాటకు విలువ ఎక్కువ. అందుకనే ఆమె మీద ఉన్న నమ్మకం కారణంగానే, అగ్ని ప్రవేశం చేసినప్పటికీ ఆమె సురక్షితంగా ఇవతలికి రాగలదు అన్న నమ్మకంతోనే రాముడు కేవలం ప్రజల తృప్తి కోసం, తన ధర్మాచరణ కోసం సీతను అగ్ని పరీక్షను కోరాడు. తన భర్త తన శీలపరీక్షను కోరినప్పుడు కాని, గర్భిణిగా ఉన్న సమయములో అడవులకు పంపినప్పుడు కానీ, సీతమ్మ మారుమాట్లాడలేదు. గంగా నది ఒడ్డున సీతారోదనం విన్న భూదేవి రాముడిని శపించబోతే, నన్నేమైనా అను కానీ రాముడిని మాట్రం ఏదైనా అంటే సహించను అని సమాధానం ఇస్తుంది. ఆమెకు లేని అభ్యంతరం మనకెందుకండీ? ఏదో వితండవాదం చేయటం తప్ప. మన ఇతిహాసాలు, గ్రంధాలు, ఎప్పుడూ మన మంచిని కోరే వ్రాయబడినాయి. వాటిని నమ్మి ఆచరించిన రోజున మన ధర్మం నిలుస్తుంది. "ధర్మో రక్షతి రక్షిత:" అనే వాక్యానికి అర్ధం ఇదే..ధర్మాచరణ తప్పిననాడు మానవుడు అధోగతి పాలవుతాడు. అటువంటి వ్యక్తులతో కూడిన సమాజం కూడా నాశనమైపోతుంది.
No comments:
Post a Comment