* హయగ్రీవ
శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమయే ‘హయగ్రీవ జయంతి’. హయగ్రీవుడనగానే సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించి, గుఱ్ఱపు మోముగల ఒక వేదాపహారియైన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని మనకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువుయొక్క అవతారాలలో పది అవతారాలు మాత్రం దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ, మహాభాగవతంలో ఇరవైకి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయ. ఆ అవతారాలలో ‘హయగ్రీవావతారం’ విశిష్టమైనది. ‘హయం’ అనగా గుఱ్ఱం, ‘గ్రీవం’ అనగా కంఠం. అశ్వ ముఖంతో మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి గురురూపమే హయగ్రీవ స్వరూపం.
రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది. శ్రావణపూర్ణిమ రోజున హయగ్రీవుని విశేషంగా అర్చించాలి. ఈ స్వామిని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. భూవివాదాలు పరిష్కరించబడతాయి. న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ప్రతిరోజు హయగ్రీవుని స్తుతి చేస్తే లక్ష్మీనారాయణుల శుభాశీస్సులతోపాటు సకల దేవతలు సంపూర్ణ శుభాశీస్సులు కూడా సంప్రాప్తమవుతాయి. ఈ క్రింది సోత్త్రాన్ని హయగ్రీవ జయంతి రోజున ఎన్నిసార్లు వీలయితే అన్నిసార్లు పఠించడం వల్ల శుభాలు కలుగుతాయ.
" జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే "
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే "
జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము. దేవీ పురాణం, స్కాంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాస్త్రాల్లో హయగ్రీవుడి ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతినాడే ప్రారంభిస్తారు. విద్యార్థులందరూ ఈ రోజున హయగ్రీవుని అర్చించాలి. లౌకిక, పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన శీఘ్ఫ్రలకరం.
హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి. హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను తయారుచేసి నివేదించాలి. మరియు తెల్లపూవులతో పూజించాలి. మరీ ఎక్కువ వాసన కలిగించే పుష్పాలతో పూజించకూడదు. ఇలా శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది. సకలైశ్వర్యాలను కలిగించే హయగ్రీవ పూజ చేయడానికి స్ర్తి పురుష తారతమ్యం లేదు. కానీ ఈ రోజు ఉప్పులేని ఆహారాన్ని మాత్రం స్వీకరించాలి. సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. అందుకే శుద్ధ పూర్ణిమనాడు హయగ్రీవారాధన విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని, స్తోత్ర ప్రాశస్త్యాన్ని అగస్త్య మహామునికి హయగ్రీవుడే బోధించాడని బ్రహ్మపురాణ విదితం.
ఆదిశంకరాచార్యులు, శ్రీరామానుజాచార్యులు వంటి మహనీయులు కూడా హయగ్రీవుని పూజించి తరించారు. విశ్వశ్రేయోదాకమైన వేదాలను రాక్షసుల చేతిలో పడనీయక హరియే హయగ్రీవునిగా అవతరించిన ఈ రోజు మనం కూడా హయగ్రీవుని పూజిద్దాం.
విద్యావంతులుగా మారి ధర్మ సంస్థాపనం చేద్దాం.
courtesy: soma Sekhar
No comments:
Post a Comment