Thursday 20 August 2015

మానవతా దినోత్సవం అనేది ఒకటి జరుపుకోవడమే మానవుల దౌర్భాగ్యం. నాగరికత తెలియని రాతియుగం లో మానవులు తిండి కోసం కొట్టుకునేవాళ్ళు.  ఇప్పుడు కావలసినంత తిండి ఉంది. అయినా కొట్టుకోవడం మానలేదు. ఇప్పుడు నాగరికత పెరిగింది కాబట్టి ఏకంగా చంపుకోవడమే. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లి, తండ్రి, స్నేహితులు ఇలా ఏ బంధాలు, మమకారాలు లేవు. అందరూ అన్నింటికీ ఘర్షణ పడటమే. ఒకరినొకరు చంపుకోవడమే. ముఖ్యంగా ఆస్తి, డబ్బు వీటి గురించే కొట్లాటలు. మానవత్వాన్ని మర్చిపోయేలా చేసేది ఈ డబ్బే. డబ్బు బ్రతకడానికి అవసరమే, కానీ డబ్బే జీవితం కాకూడదు. పేదవాడు తన పక్కన ఉన్న ఇంకొకడికి తనకు కలిగినంతలో పెడుతున్నాడు. కలిగినవాడు పక్కవాడిది కూడా లాక్కుంటున్నాడు. లేనివాడు తిండి కోసం తాపత్రయ పడితే, ఉన్నవాడు ఇంకా డబ్బు, ఆస్తి, సంపాదించాలని ఆట్ర పడతాదు. ఇంకా అధికారం, పలుకుబడి ఉన్నవాడు  రాజ్యాలనే మింగేయాలని చూస్తాడు.  మనుషులు తాము మనుషులమని మర్చిపోతూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం అందరిలో పేరుకుపోయిన మితిమీరిన స్వార్ధం. అన్నీ నాకే కావాలి, అంతా నాకే సొంతం కావాలి అనే తపన. అసలు అరిషడ్వర్గాలకన్నిటికీ మూలం ఈ స్వార్ధమేనేమో. ఈ స్వార్ధానికి మూలం, విలువలు లేని చదువులు, నియమం లేని బ్రతుకులు. మనుషుల ప్రాధాన్యతలు మారాయి. కోరికలు పెరిగాయి. కోరికలే దు:ఖానికి మూలం అనే మాట అక్షర సత్యం అయింది. ఎన్ని పరుగులు పెడుతున్నా, ఎంత సంపాదిస్తున్నా, మనిషుల్లో తృప్తి అనేది కనిపించడం లేదు. ఆ అసంతృప్తి పర్యవసానమే స్వార్ధం, దానినుంచి మొదలౌతున్న మానసిక సంఘర్షణ. ఫలితం....మానవతను, విలువలను కోల్పోవడం. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరూ అనే మాట మర్చిపోతున్నాం. ప్రతిదానికీ పక్కవాడితో పోటీ. పోటీ ఆరోగ్యకరమైనది అయితే, సమాజానికి, వ్యక్తికి ప్రయోజనం. లేనినాడు అది సృష్టించే అనర్ధాలు ఎన్నో.  ఈ పోటీలో పడి, పక్కవాడి దు:ఖానికి, సుఖానికి, బాధకు, భయానికి స్పందించే గుణం పోగుట్టుకున్నాం. రాతి మనుషులం అయిపోతున్నాం. హృదయంలో ఆర్తి లేదు, గుండెల్లో తడి లేదు, మాటల్లో మమకారం లేదు. వెరసి, చెట్టూ , చేమా, కొండా, బండా, వాటితో పాటు  మనం...పెద్దగా తేడా ఏమీ లేదు. అవసరమైన వాళ్ళకు ఒక చిన్న సాయం, కొంచెం సహానుభూతి, నేనున్నాననే భరోసా, ఇవన్నీ ఇప్పుడైనా మనం నేర్చుకుందాం. మన పిల్లలకూ నేర్పుదాం. మన కాలం సగం గడిచిపోయింది. పిల్లలకు మానవత్వాన్ని, మనిషి తత్వాన్ని నేర్పలేకపోతే, ముందు తరాలని మనమే పాడుచేసిన వాళ్ళం అవుతాము. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు మనమే బాధ్యులం అవుతాం.

No comments:

Post a Comment