Friday 7 August 2015

ఆషాఢమాసం దాదాపుగా అయిపోవస్తోంది. వచ్చేది శ్రావణ మాసం. మహిళలకు ప్రత్యేకమైన మాసం..ఆ వివరాలు మీ కోసం...
తెలుగు సంవత్సరములో 5వ మాసముగా వచ్చేది శ్రావణమాసం. ఈ మాసం లో సౌభాగ్యం కోసం మంగళ గౌరిని, సిరిసంపదల కోసం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. ఈ మాసం సందడి అంతా మహిళలదే... కొత్తగా పెండ్లి అయిన ఆడపిల్లలు ఈ మాసంలో మంగళ గౌరి నోములు పడతారు. ఈనోము 5 సంవత్సరాల పాటు సాగే నోము. భర్త యొక్క అఖండ ఆయుష్షు కోసం సుమంగళి స్త్రీలు ఆచరించిఏ నోము ఇది. శ్రావణ మాసంలో వచ్చే మంగళ వారం నాడు తెల్లారే లేచి, తలంటు స్నానం చేసి, పీఠం ఏర్పాటు చేసి, పసుపు తొ గౌరి దేవిని చేసి, షోడశోపచార విధులతో పూజ చేసుకొంటారు. ముందురోజు నానబెట్టిన శనగలు, ఆరోజు ఉదయమే, బియ్యం నానబెట్టి, పిండి కొట్టి, బెల్లం కలిపి చేసిన చలిమిడి, తాంబూలం, పసుపు కుంకుమలతో సహా ముత్తైదువలకు వాయనం ఇస్తారు. పూజ చేసేటప్పుడు మొదటి సంవత్సరం 5, రెండవ సంవత్సరం 10, మూడవ సంవత్సరం 15, నాలుగవ సంవత్సరం 20, ఐదవ సంవత్సరం 25 చొప్పున చలిమిడి పిండి తోనే ప్రమిదలలాగా చేసి, అందులో ఆవునెయ్యి వేసి, వత్తులు వెలిగించి, ఆ వత్తులపై ఒక ఇత్తడి గరిటెను పట్టుకొని, మసిబారేలా చేస్తారు. ఆ నుసిని, కర్పూరం, ఆవునెయ్యి కలిపి ముద్దలా చేసి, ఆడపిల్లలు కంటికి కాటుకలా పెట్టుకుంటారు. ఇది కంటికి ఎంతో మంచిది. మంగళ గౌరి వ్రతం చేసుకున్న వారికి వైధవ్యం రాదు అని నమ్ముతారు.
పెండ్లి అయిన వారే కాకుండా, పెండ్లి కాని, రజస్వల కాని ఆడపిల్లలు కూడా 5 సంవత్సరముల పాటు కన్నెగౌరి వ్రతం పేరిట మంగళ గౌరి నోమును ఆచరిస్తారు. అలా చేసిన వారికి మంచి భర్త దొరికి, చక్కటి భవిష్యత్తు లభిస్తుందని తెలుగు ప్రజలు నమ్ముతారు.
శ్రావణ మాసం శనగలు, తడి బియ్యం, బెల్లం కలిపి చేసిన చలిమిడిని, ముత్తైదువలకు వాయనంగా ఇవ్వడంలో గొప్ప ఆరోగ్య విశేషం ఉంది. నానబెట్టిన శనగలలో ప్రోటీన్లు ఎక్కువ శాతంలో ఉంటాయి. బెల్లం లొ ఐరన్ శక్తి ఉంటుంది. బెల్లం ను, ఆవునెయ్యితో వేడిచేసి తీసుకున్నప్పుడు శరీరం ధృఢంగా తయారవుతుంది. మన పెద్దలు వాయనాల రూపం లో ఈ వస్తువులను అందరికీ పంచిపెట్టాలి అని చెప్పటంలో అంతరార్ధం, ఈ శనగలు, చలిమిది వలన కలిగే ఆరోగ్య లాభాలు, మహిళల ద్వారా ఆ యా కుటుంబాలకన్నింటికీ చేరాలనే.....
ఇక శ్రావణ శుక్రవారము నాడు శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తారు. ఇంటిలొ ఒకచోట, పీఠాన్ని ఏర్పరచి, దానిపై బియ్యం, దానిపై ఒక కొత్త గుడ్డ పరిచి, కలశం స్థాపించి, అందు శ్రీ వరలక్ష్మి దేవిని ఆవాహన చేసి షోడసోపచారాలతో పూజ చేస్తారు. తొమ్మిది పిండివంటలు చేసి దేవికి నైవెద్యం పెడతారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు మహాలక్ష్మీ దేవిని, కోరిన వరాలనిచ్చే వరలక్ష్మీ దేవి రూపంలో కొలుస్తారు. పూజ చేసుకునేవారు, తమ శక్తి కొలది వెండి, బంగారాలు కొనుక్కుని, పూజలో పెట్టుకుని, వాటిని కూడా పూజిస్తారు.
కొంతమంది ఉత్తి కలశమే కాకుండా అమ్మవారి రూపాన్ని కూడా తయారు చేస్తారు. అమ్మవరి రూపానికి పట్టుచీర అలంకరించి, జడ వేసి, నగలతో అలంకరించి, సాక్షాత్తూ ఆ అమ్మవారు ఇంట్లోనే కొలువై ఉన్నదా అనిపించేటట్లు అమ్మవారిని తీర్చిదిద్దుతారు. మహిళల కల్పనా శక్తికి ఈ రూపాలు ఒక తార్కాణంగా నిలుస్తాయి.
శ్రావణ శనివారం శ్రీ వేంకటేస్వరునికి ప్రీతికరమైన రోజు. ఆరోజు శ్రీవారి అనుగ్రహం కోసం వేంకటేస్వరునికి దీపారాధన చేయటం ఎంతో మంచిది.
ఇవే కాకుండా, శ్రావణ మాసంలో ఇంకా ఎన్నో ప్రశస్తమైన రోజులు, పూజలు ఉన్నాయి.
శ్రావణ పంచమి; ఈరోజును నాగపంచమి అని కూడా అంటారు. ఈరోజు ఉత్తరభారత దేశంలోనూ, దక్షిణ భారతం లో కొన్నిచోట్ల నాగదేవతలకు పూజలు చేసి, పాలు నైవేద్యంగా సమర్పిస్తారు. జైన పురాణాలలో కూడా నాగపంచమి ప్రసక్తి ఉంది.
రాఖీ పౌర్ణిమ: తమ రక్షణ కోరుతూ, సోదరీమణులు వారి అన్నదమ్ములకు రక్షాబంధనం చేసేది ఈ రోజే. ఉపనయనం చేసుకున్న ప్రతివారూ ఈరోజు పాత జంధ్యములు తీసివేసి, కొత్తవి ధరిస్తారు. ఈ పూర్ణిమను జంధ్యాలపూర్నిమ అని కూడా అంతారు.
శ్రీకృష్ణాష్తమి: వెన్న దొంగ, నల్లనయ్య అయిన కృష్ణుడు జన్మించిన ఈ రోజును దేశ ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పాలు, పెరుగు, అటుకులు, మిఠాయిలు నైవేద్యం గ సమర్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ మందిరాలలో అర్చనలు చేస్తారు. సాయంత్రం వేళల్లో, ఆ దేవదేవుని స్మరించుకుంటూ, ఉట్లు కొడతారు.
పోలాల అమావాస్య:
శ్రావణ అమావాస్య ను పోలాల అమావాస్యగా చెప్తారు. పోల అంటే ఎద్దు. కాబట్టి ఈ పండుగ పశువులకు సంబంధించిన పండుగగా చెప్పబడుతోంది. ఎక్కువగా రైతులు దీన్ని ఆచరిస్తారు. ఈ రోజున ఆవులను, ఎద్దులను పూజించాలని శాస్త్ర వచనం. రైతులు తమ వద్ద పనిచేసే కూలీలకు ఈ రోజుననే కూలి కొలిచేవారు. అంటే, ముందటి పోలాల అమావాస్య నుండి ఈరోజు వరకు కూలి లెక్క వేసేవారు. అంటే, రైతులకు ఇది నూతన సంవత్సరంతో సమానం. రాను రాను పోలేరమ్మ అనే గ్రామదేవత పూజగా కూదా జరుపుకోవడం ప్రారంభించారు. ఈ అమావాస్య నాడు పోలాంబ (పోలేరమ్మ)ను ప్రత్యేకంగా కొలుస్తారు. కొన్ని చోత్ల కందమొక్కను పూజిస్తారు. కందమొక్కకు ఎంత త్వరగా పిలకలు వచ్చి మొక్కలు వస్తాయొ, అంత త్వరగా ఇంద్లలో పసిపాపలు పారాడాలి అని, పుట్టిన పిల్లలు ఏ అరిష్టాలు లేకుండా చల్లగా పెరగాలి అని ఈ పూజను చేస్తారు.
ఈ శ్రావణ మాసం మీ అందరికీ ఆ శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు నిడుగా ఉండాలని కోరుకుంటున్నాను.


No comments:

Post a Comment