Tuesday, 6 October 2015

విదురనీతి 47

చిత్తప్రసన్నత

మానసిక ఒత్తిళ్ళనుంచి దూరంగా ఉండాలంటే మనసును ప్రసన్నంగా, శాంతంగా ఆరోగ్యంగా ఉంచడం నేర్చుకోవాలి. మనిషి మరణ ధర్మానికి ఎదురీదలేడు. అందుకే కర్తవ్యమనే జ్యోతినందుకొని ముందుకు సాగిపోవాలి. సృష్టి ధర్మాన్ననుసరించి కాలధర్మముంటుంది. ఎవరికోసం ఏదీ ఆగదు. కాలచక్రం తిరిగిపోతూ ఉంటుంది. ఈ కాలగతిలో మనం సుఖంగా బ్రతుకుతూ, ఇతరులకు  ప్రశాంతంగా బ్రతకనివ్వాలి.

ముళ్ళ మధ్యలో ఉండి కూడా పువ్వు వికసిస్తుంది. అలాగే మనం కూడా కష్టసమయంలో కూడా చిరునవ్వును విడవకూడదు. సంతోషం లేకపోతే, ప్రశానతతలేదు. ప్త్రశాంతత లేకపోతే మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేకపోతే సరియైన జీవనయాత్ర లేదు. అందుకే ముళ్ళ మధ్య పుష్పాన్ని వేదం ప్రమాణంగా చూపిస్తుంది. ఈ సంసారమనే యాత్రలో మనకు సుఖదు:ఖాలతో మిళితమైన ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. వాటిని మనసులోనికి రానీయకుండా ఆత్మధైర్యంతో ఎదుర్కొని ప్రసన్నంగా జీవించే అలవాటు చేసుకోవాలి. మానసికంగా మనిషి నలిగిపోతే, దానికి వైద్యశాస్త్రంలో కూడా మందు లేదు.


దీనులైనవారికి మాత్రమే ధనాన్ని దానం చెయ్యాలి. యౌవనాన్ని భార్యకు మాత్రమే అంకితం చెయ్యాలి. యజమాని కోసం పనిచెయ్యడంలో ప్రాణాన్ని సైతం త్యాగం చెయ్యాలి. ఎవరైనా సరే, భగవంతుని సన్నిధిలో ఒక పని చేస్తానని నిశ్చయించుకుని ఆ పనికి కట్టుబడి ఉండాలి. అలా నిశ్చయించుకోవలసిన కర్తవ్యాలలో కొన్ని:

ఎవరికి పడితే వారికి డబ్బుని దానం చెయ్యకూడదు. అర్హులు, పాత్రులైనవారికే దానం చెయ్యాలి. కొందరు విలాసాలకై యాచన చేస్తారు. దొరికిన డబ్బుతో జూదగృహాలకూ, పానశాలలకూ వేశ్యావాటికలకూ వెళ్తారు. అటువంటివారికి కాకుండా నిజంగా దీనస్థితిలో ఉన్నవారికి దానమిచ్చిన ధనం సద్వినియోగమవుతుంది అంటుంది శాస్త్రం.

ప్రతి పురుషుడూ భార్యకు ద్రోహం చెయ్యనని ప్రతిజ్ఞ చెయ్యాలి. చేసిన ప్రతిజ్ఞను నిలుపుకోవాలి. యౌవనం భార్యకే అంకితం చెయ్యాలి తప్ప పరస్త్రీలతో, వేశ్యలతో గడపరాదు. అలా చెయ్యడం వలన ధర్మం, అర్ధం కామ కూడా నశిస్తాయి. విధినిర్వహణలో యజమానికి హితకరమైన పనే చేయ్యలి, ప్రాణాన్ని సైతం లెక్కచేయక విధిని నిర్వర్తించాలి తప్ప యజమాని చెప్పిన పనిని ఎల ఎగ్గొడదామా అని ఆలోచించకూడదు. విధి నిర్వహణలో కష్టాలు ఎదురైతే వెనుకంజ వెయ్యకూడదు. ఈ నిర్ణయాలను తీసుకోవడం అందరికీ శ్రేయోదాయకం.

No comments:

Post a Comment