Tuesday, 6 October 2015

విదురనీతి 46

కోరికలు మనిషిని మానవత్వం నుంచి దానవత్వానికి దిగజారుస్తాయి. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి సంతృప్తి ఓ చక్కని మార్గం.

ఈలోకంలో త్వరగా అంతరించిపోతున్న అంశం 'తృప్తి". మానవుడికి తృప్తి అనేది లేకపోవడం వల్లనే లోకంలో శాంతి సుఖాలు కరువవుతున్నాయి. కోరికలు అనంతం. కోరుకున్నవి ఎన్ని ఇచ్చినా ఇంకా ఏదో కావాలంటారు. ఒక కోరిక తీరగానే మరో కొత్తకొరిక పుట్టుకొస్తుంది. ఈ కోరికలకు అదుపు లేకపోతే జీవితం నాశనమవుతుంది. పురాణేతిహాసాలలో ప్రతినాయకుల ద్వారా మనకు అందించిన సందేశం అదే. ఎందరెందరో మహామహులు సైతం తృప్తిలో ఉండే ఆనందాన్ని తెలుసుకోలేక పతనం చెందారు. ఆధ్యాత్మిక జీవన విధానంలో తృప్తిగురించి  పదేపదే ప్రస్తావించడానికి కారణం అదే.సుఖాల సంపదలమీదే మోజు పెంచుకుని వాటి కోసమే జీవిస్తే చివరికి అసంతృప్తి మిగులుతుంది. తృప్తిలేని మనుషులకు ఈ లోకమంతా అందించినా ఇంకా ఏదో లోటు కంపిస్తుంది. అందిన దానితో తృప్తిపడటం అలవాటు చేసుకోవాలి.

జీవహింస, దొంగతనము, పరదారాగమనము, పిసినారితనము, పరుషవచనము, అసత్యవచనము, అసందర్భ ప్రేలాపనము, జీవద్రోహచింత, ఇతరుల మేలుకు సహకరింపకుండుట, శాస్త్రముల యందు ద్వేషము అను ఈ పది పాపకార్యములు త్రికరణశుధ్ధిగా విడిచిపెట్టేయాలి. దర్మార్ధ కార్యక్రమముల కొరకు నిరంతరము ప్రయత్నము జరుగుతున్న చోట నివాసముండాలి. వాస్తు లోప భూయిష్టమైన ఇంటిలో నివాసముండకూడదు. ఇతరులకు అపకారము కలిగించి ధనమును సంపాదించరాదు. ధర్మపధ్ధతిలో సంపాదించిన ధనమే మనదగ్గర నిలుస్తుంది. అట్లు సంపాదించిన ధనమును తాను అనుభవించుచు, పాత్రత నెరిగి దానము చేసినవాడు ఇహపరములందు సుఖములను పొందును.

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment