Monday, 12 October 2015

విదుర నీతి 48
మాట-మౌనం
సమయం చూసి మాట్లాడాలి. నొరుంది కదా అని అనవసర, అసందర్హ ప్రసంగాలెప్పుడు చెయ్యకూడదు.
మౌనం వచించడంవల్ల భద్రత, శుభం కలుగుతాయి. వర్షాకాలంలో కప్పలు బెకబెకమని అరుస్తున్నప్పుడు కోకిలలు మౌనంగా ఉండడమే మంచిది. కోకిల వసంతకాలంలో కమ్మగ పాడుతుంది. వర్షాకాలం రాగానే కప్పల సంఖ్య పెరుగుతుంది. అవి బెకబెకమని కర్ణ కఠోరంగా అరుస్త్యాఇ. ఆ సమయంలో కోకిల కమ్మగా పాడినా ఎవరికీ వినిపించదు. అందుకని వానాకాలంలో కోకిల మౌనంగా ఉండటమే మంచిది. మనుష్యులకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.
కొందరు మూర్ఖులు తాము చెప్పేది తప్పైనా ఒప్పుకోక అడ్డదిడ్డంగా వాదిస్తుంటారు. అటువంటి వారికి ఎంత చెప్పినా ఏది మంచో, ఏది చెడో అర్ధంకాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. అటువంటి సమయంలో మౌనం వల్లనే భద్రత, రక్షణ, శుభం కలుగుతాయని విజ్ఞులు గమనించాలి.
మనం మన కర్మేంద్రియముల ద్వారా మన కర్మలు నిర్వర్తించుతున్నాము. ఏమీ మాట్లాడకుండా ఉండటమే కాదు. ఏమీ ఆలోచించకుండా ఉండటం కూడా మౌనమే. ఎటువంటి ఆలోచనలు లేకపోవడంతో మెదడుకు కూడా కాస్త విశ్రాంతి దొరికి కొత్త శక్తిని సంపాదించుకుంటుంది. దాని చురుకుదనం పెరుగుతుంది. మౌనం కూడా ఒకరకంగా ధ్యానమే...కాబట్టి కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఏకాగ్రత సాధించడానికి కావలసిన నైపుణ్యం దొరుకుతుంది. ఆలోచనల పట్ల నియంత్రణ సాధించగలుగుతాము. ఒక స్పష్టత ఏర్పడుతుంది. జరుగుతున్న విషయాల పట్ల సదవగాహన కలుగుతుంది. పరిణతి కలిగిన ఆలోచలనకు ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి మౌనం రాచమార్గమని గ్రహించాలి.
మౌనం ఆత్మశక్తిని పెంచుతుంది. మౌనధారణ సంస్కారవంతమైన భూషణం. పరిణతి చెందిన మనస్తత్వానికి ఆలోచనాపరిధికి అది నిదర్శనం. చలించే భావసముదాయం వాచకంగా పెదవులు ద్వారా బహిరంగమౌతుంది. సంభాషణ, లేదా చర్చ గాడి తప్పే గడ్డు సమస్యలు ఎదురైనప్పుడు మౌనం కవచంలా కాపాడుతుంది.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment