Wednesday, 6 July 2016

"అమ్మోయ్" ! నాన్న పిలుస్తున్నారు....చిన్నవాడి గావుకేక....
"ఆయనకేం! పిలుస్తూనే ఉంటారు...ఇక్కడ ఖాళీ ఉండద్దూ రావడానికి"
"అప్పుడే పిలవకురా!" వచ్చిందంటే ఇద్దరికీ కలిపి పెడుతుంది....." మా ఆయన ఉవాచ...
"నన్ను ఇన్వాల్వ్ చేయకు నాన్నా.." చిన్నవాడి చెణుకు..
అప్పుడే ఏదో కనబడడం లేదు అని అర్ధం అయింది నాకు...నేను గాక ముగ్గురు..అందరూ ఎదిగిన వాళ్ళే....మూడు జతల ఆరు కళ్ళు...అందులో ఇద్దరికి "ఉప"నయనాలు....వెరసి 10 కళ్ళు...కానీ ఎదురుగా ఉన్న వస్తువు కనబడదు ఎవ్వరికీ...ఈ "ప్రత్యేకమైన " చూపు భగవంతుడు మా ఇంట్లో వాళ్ళకే ఎందుకిచ్చాడో అర్ధం కాదు...చిన్న పిల్లలు లేరు కాబట్టి, ఉన్న పిల్లలు ఇంట్లో ఉండడం లేదు కాబట్టి పెట్టిన వస్తువు పెట్టినచోటే ఉంటుంది...ఉండాలి కూడా...అలా ఉన్నా కూడా మా వాళ్ళెవరికీ నేను వస్తేనే కానీ అది కనబడదు...నేను వచ్చేవరకు అది అదృశ్య రూపంలో ఉంటుందో ఏమిటో జానపద సినిమాల్లో హీరో లాగా..
ఇంతా చేసి అది స్టేప్లరో, కత్తెరో, సెల్లొఫిన్ టేపో ....ఈ బాపతు వస్తువన్న మాట...మా ఇంట్లో ఇంకో విడ్డూరం....పక్కవాళ్ళు ఎవరైనా వచ్చి ఖర్మం జాలక థర్మామీటరు లాంటివి అడిగితే,
"మా ఇంట్లో ఉందో లేదో ఆవిణ్ణి అడగాలండి" ....ఇదీ వెధవ జవాబు మా ఆయన వాళ్ళకిచ్చేది...వాళ్ళకు ఆ జవాబు చేరిన తర్వాత నేను ఓ వెర్రి నవ్వు నవ్వి వాళ్ళకి కావల్సింది ఇవ్వడం జరుగుతుంది..
అక్కడికీ సూపర్ మార్కెట్ లో లాగా అడిగినవన్నీ వెంటనే తీసి ఇస్తూనే ఉంటాను ...ఇలాంటి అత్యవసరమైనవి అయితే, ఒకటికి రెండు కొని పడేస్తాను...మా వాళ్ళ కంటిచూపు గురించి క్షుణ్ణంగా తెలిసినదాన్ని కాబట్టి...
వాషింగ్ మెషీన్ లాంటి పెద్ద వస్తువులు కొన్నప్పుడు, బిల్లు, గ్యారంటీ కార్డు లాంటి వన్నీ ఒక ఫోల్డర్ లో పెట్టి ఒక బ్రీఫ్ కేస్ లో పెడతాను...ఇంట్లో నన్ను కప్పెట్టినన్ని వస్తువులు, ఫోల్డర్ లో వాటిని మించిన కాగితాలు, ఓ సోమవారం మధ్యాహ్నం కూచుని, వేటికవి విడదీసి చక్కగా సర్దితే, మంగళవారమే ఆయనకేదో కాగితం అవసరం అవుతుంది....మళ్ళీ...పద్మా.....పిలుపు...
"అన్నీ అందులోనే ఉన్నాయి మహానుభావా! వెతుక్కుని తీసుకోండి" వంటింట్లోంచి నా కేక....
"ఫలానాది ఇందులోనే పెట్టాను..ఇప్పుడు కనబడడంలేదు...." కంప్లైంట్...
తీరా పొయ్యి ఆర్పి వచ్చి చూస్తే ఏముంది, గదినిండా కాగితాలు...మధ్యలో ఈయన...చుక్కల్లో చంద్రుడిలాగా....(నన్ను కిర్రెక్కించడానికి ఆయన్ని ఆయన అలా పోల్చుకుంటారులెండి ) అన్ని ఫోల్డర్స్ లో కాగితాలు కలగలిపేసి....మరి మండిందంటే మండదూ...హతవిధీ అనుకుంటూ వెతికి ఇవ్వడమే....సో, మంగళవారం మధ్యానం కూడా సర్దుళ్ళు తప్పవు నాకు...
"ఈ సంసారం, ఈ మనుషులతో నేను వేగలేను, సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళ్లిపోతాను ఎప్పుడో"....నా నిట్టూర్పు....
"అమ్మా! సన్యాసం తీసుకుంటే కాఫీ తాగడానికి ఉండదేమోనే...ఆలోచించి మరీ నిర్ణయించుకో...." నా కాఫీ పిచ్చి తెలిసిన పెద్దవాడి విసురు..
"సన్యాసం లేకుండా ఉట్టినే హిమాలయాలకు వెళ్ళే ఆఫర్ ఏదీ లేదా"? చిన్నవాడి అతి తెలివి..
"నువ్వెళ్ళిపోతే ఇక్కడ వంట ఎలాగా? ఇంట్లో నీలా మాట్లాడేవాళ్ళు ఉండకపోతే మాకు తోచద్దూ...." వంట కోసమే నేను పుట్టినట్టు మా వారి భావం...
"వంటమనిషిని ట్రై చేద్దాం నాన్నా...అమ్మని వెళ్ళనీ...అమ్మ కోరిక మాత్రం ఎప్పుడు తీరుతుందీ" ..ఇవో రకం సన్నాయి నొక్కులు..
"వంటమనిషి ఉన్నా సరే...బెండకాయ వేపుడు మాత్రం అమ్మే చేయాలి...చెన్నై లో నాకు దొరకదు..."
" ఆలూ ఫ్రై కూడా"..
"అప్పడాల పిండి మాత్రం అమ్మే కలపాలి నాన్నోయ్...ముందే చెప్పేస్తున్నా.....అన్నీ ఆలోచించుకుని పంపు అమ్మని...."
ఇంకా నాకు సన్యాసం తీసుకునే తీరికెక్కడా, హిమాలయాలకు పోయే భాగ్యమెక్కడా?
"అసలు హిమాలయాల్లో మిర్చి బజ్జీ చేసుకుని తింటే ఎలా ఉంటుందంటావ్? చల్లని మంచు కొండలు..వేడి వేడిగా అమ్మ చేసిన బజ్జీలు...ఒక్కసారి ఊహించుకోండర్రా పిల్లలూ...." మావారి బజ్జీ బులబాటం
భగవంతుడా! అయిపోయింది...నేను ఏ టాపిక్ రాకూడదని అనుకున్నానో అదే వచ్చింది..ఇంక నన్ను ఆ బ్రహ్మ కూడా రక్షించలేడు...మా ఇంట్లో వాళ్ళకి పై నుంచి కింద తరం దాకా మిర్చి బజ్జీలు అంటే ఓ రకంగా విటమిన్ ట్యాబ్లెట్లు....మార్కెట్ లో బజ్జి మిరపకాయల్ని చూసినప్పుడు మా వాళ్ళ కళ్ళు "మాస్క్" సినిమాలో హీరో కళ్ళల్లాగా గుండ్రంగా తిరుగుతూ, రెండుసార్లు బయటికొచ్చి, అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తాయి....నెలకో ఆదివారం మాకు బజ్జీల ఆదివారం పోలియో ఆదివారం లాగా... ఇంటికి చుట్టాలు ఎవరొచ్చినా అవి చేయడం తప్పనిసరి...పెళ్ళయ్యి పాతికేళ్ళయినా, బజ్జీలకి మిరపకాయల్లో వాము పెట్టాలని చెప్తూనే ఉంటారు మావారు...చాదస్తం అనుకోవాలో, జాగ్రత్త అనుకోవాలో తెలియక బుర్ర పగలకొట్టుకుంటాను నేను...
ఆదివారం అందరికీ సెలవు అంటారు...మా లాంటి ఇళ్ళల్లో ఆదివారం ఎక్స్ట్రా పని, ఎక్స్ట్రా వంట...హు...ఏంటో ఇంటింటి రామాయణం..

No comments:

Post a Comment