Wednesday, 16 July 2014

గత ఆదివారం సాక్షి దినపత్రిక అనుబంధం పుస్తకం లో ఒక కధ చదివాను. చాల మంది మిత్రులు చదివే ఉంటారు. ఆ కధ సారాంశం క్లుప్తంగా....పేదరికంతో రోజు గడవక, పిల్లల చదువు మాట అలా ఉంచి, అన్నం కూడా పెట్టలేని పరిస్థితులలో, వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఒక తల్లి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి కూలి పని కోసం సౌది వెళ్తుంది. అక్కడ చాకిరీ చేయగా వచ్చిన జీతంలో తను కొద్దిగా ఖర్చు పెట్టుకొని, మిగతా అంతా భర్తకు పంపుతుంది, అప్పులు తీర్చడం కోసం, ఉన్న పొలం సాగు చేయడం కోసం, పిల్లల ప్రస్తుత చదువుల కోసం, వారి భవిష్యత్ కోసం దాచమని భర్తకు చెప్తుంది. తీరా కొన్నేళ్ళు కష్టపడిన తర్వాత, అక్కడి రూల్స్ మారటం వల్ల ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి ఇండియా కి వెళ్ళిపోవలసిన పరిస్థితులు వస్తాయి. అపుడు టికెట్ కొనుకోవడానికి కూడా డబ్బు లేక, భర్తకు డబ్బు పంపమని ఉత్తరం రాస్తుంది. దానికి భర్త ఏమి చెప్తాడు అంటే====నువ్ పంపిన డబ్బు నేను ఏదో కొద్దిగానే అప్పులు తీర్చాను. పొలం సాగులో లేదు. పిల్లల భవిష్యత్ గురించి కూడా ఏమి దాచలేదు, అంత డబ్బు ఒక్కసారిగా చూసేసరికి నాకు జల్సాలు ఎక్కువ అయినాయి, వ్యసనాలకు అలవాటు పడ్డాను, ఫలితంగా రోగాల బారిన పడ్డాను, నీకు పంపడానికి నా దగ్గర ఏమి లేదు అని....
ఈ కధ నేను ఇక్కడ వ్రాయటానికి సందర్భం ఏమిటంటే, ఇది వట్టి కధ కాదు. నిజ జీవితం లో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. భార్య సంపాదించడానికి వెళ్తే, భర్తలకు లేనిపోని వ్యసనాలు అంటుకుంటున్నాయి. ఒక ఇంటిలో మగవాడు సంపాదించడానికి విదేశాలకు వెళ్తే, ఆ ఇంటిలోని పిల్లలకు చెడు అలవాట్లు అవుతున్నాయి. అక్కడ సంపాదించే వాడికి కష్టం తెలుస్తుంది కాని, ఆ డబ్బు అనుభవించే వాడికి కష్టం తెలియదు. ఇక్కడ పిల్లలు మాత్రం (అందరు కాదు, చాల మంది) బైకులు, పార్టీలు, ఖరీదైన ఫోనులు, ఇలా బాధ్యత తెలియకుండా జల్సా చేస్తున్నారు. కొంత మంది ఆడవాళ్లు కూడా మితి లేకుండా , బాధ్యత లేకుండా ఖర్చు పెడుతున్నారు.
ఊరికే వచ్చే డబ్బు, కష్టం తెలియనీయని డబ్బు ఎప్పుడూ అనర్ధాలకే దారి తీస్తుంది. మీ జీవిత భాగస్వాములు విదేశాలకు వెళ్లి సంపాదిస్తున్నారు అంటే, ఇక్కడ వచ్చేది చాలదు, ఇక్కడి కన్నా మీకు మెరుగైన , సౌకర్య వంతమైన జీవితం ఇవ్వాలి అనేది వాళ్ల ఉద్దేశ్యం. రుచికరమైన భోజనం లేక, తినీ తినక, సరియైన వాతావరణ పరిస్థితులు లేక, అయిన వాళ్ళు దగ్గర లేక, కేవలం డబ్బు కోసం దూరాన ఉండి, వారు జీవిస్తున్నారు. పేస్ బుక్ లు, చాటింగ్ లు, స్కైపులు, మనసులను దగ్గర చేయలేవు. మనసులోని ఒంటరితనాన్ని దూరం చేయలేవు. వారి కష్టాన్ని గమనించుకోండి.
వారు పంపే డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి.
చివరగా ఒక విషయం. "డబ్బును మన గుప్పెట్లో పెట్టుకున్నంత వరకే అది మన మాట వింటుంది. మన గుప్పిట దాటిందో, మనలను ఆడిస్తుంది.".
కధ వ్రాసిన రచయిత కు ధన్యవాదములు. శతకోటి నమస్సులు.

No comments:

Post a Comment