Wednesday 16 July 2014

పిల్లలు సాధారణంగా పెద్దలను అనుకరిస్తూనే పెరుగుతారు. ఇంట్లో పెద్దలు ఏమి చేస్తున్నారో, అది వాళ్ళు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. తాత మూకుడు తరతరాల అనే సామెత లో లాగా, మన ఏ పని చేసినా, అది వారి మనసు మీద ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అందుకే అంటారు...భార్యా భర్తలుగా తప్పు చేయవచ్చు కానీ, తల్లి తండ్రులు అయ్యాక మాత్రం మన ప్రవర్తన ను మనం ఎప్పుడూ పరీక్షించు కుంటూ ఉండాలి. మన, మాటలు, చేతలు, ప్రవర్తన చూసే పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలకు మంచి మాటతీరు నేర్పాలి అంటే ఈ క్రింది విషయాలు తల్లితండ్రులు గుర్తుపెట్టుకోవాలి.
1. మాట్లాడేటప్పుడు స్వరం అదుపులో ఉండాలి. గట్టిగా అరుస్తున్నట్టు మాట్లాడకూడదు.
2. మనం చెప్పే విషయం పట్ల మనకు పూర్తీ అవగాహనా ఉండాలి. మనం మాట్లాడే విషయం మీద పిల్లలు ప్రశ్నలు వేస్తె, జవాబు చెప్పగలిగే పరిజ్ఞానం మనకు ఉండాలి.
3. ఇతరులు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మనం మాట్లాడడం మొదలు పెట్టాలి.
4. కొంత మంది తమ వాదన సరి అయినది అని నిరూపించు కోవడానికి ఒకళ్ళు మాట్లాడు తుండగానే పెద్దగా స్వరం పెంచి మాట్లాడుతుంటారు. అది సరిఅయిన పధ్ధతి కాదు.
5. పదాల ఉచ్చారణ బాగుండాలి.
6. మాటిమాటికి ఊతపదాలు ఉపయోగించ కూడదు.
7. ప్రతి మాటకి తిట్టు, అశ్లీలమైన పదాలు ఉపయోగించ కూడదు.
8. ప్రక్కనున్న వాళ్ళను చరుస్తూ మాట్లాడడం, అనవసరమైన హావభావాలు పనికిరావు.
9. సమయం, సందర్భం గుర్తుంచుకోవాలి, గుడి, ఆసుపత్రి, వంటి చోట పెద్దగా స్వరం పెంచి మాట్లాడకూడదు.
10. మరీ నింపాదిగా, సాగదీస్తున్నట్టు, అలా అని, మరీ వేగంగా మాట్లాడకూడదు.
11. ఇద్దరు మాట్లాడుతున్నపుడు మధ్యలో కల్పించుకొని మాట్లాడకూడదు.
12. పనివారితో పిల్లల ఎదురుగా గద్దిస్తున్నట్లు మాట్లాడకూడదు. పనివారిని చిన్న చూపు చూడకూడదు.
13. పెద్దలతో, ఉపాధ్యాయులతో నమ్రతగా మాట్లాడాలి.
14.మన తప్పును సమర్ధించు కొనేందుకు గట్టిగా అరిచి ఒప్పించాలని ప్రయత్నించ కూడదు.
15. పిల్లల ఎదురుగా ఇతరులకు, ఇరుగు పొరుగు వారికీ నిక్ నేమ్స్ తో వ్యవహరించా వద్దు. చాల మంది చేసే పెద్ద పొరపాటు ఇది.
16. ఇతరుల వస్త్ర ధారణా, వ్యక్తిగత విషయాల గురించి పిల్లల ఎదురుగా చర్చ జరపకండి.
17. ఒకరి మాటలు ఒకరికి చెప్పడం, ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పడం, పిల్లలకు అలవాటు చెయ్యవద్దు. ఒకవేళ పెద్దలకు ఉంటె మీ పిల్లల సంక్షేమం కోసం ఆ అలవాటు మానుకోండి.
18. ఫోనులో మాట్లాడేటప్పుడు, సౌమ్యంగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి.
19. మన గౌరవం, ఎదుటివారి గౌరవం దృష్టి లో పెట్టుకొని మాట్లాడడం పిల్లలకు చిన్నతనం నుంచీ నేర్పాలి.
20. ఒకవేళ మీ పిల్లల మాట తీరు లో ఏదైనా తేడా గమనిస్తే, వారికీ మెల్లగా అర్ధం అయ్యేలా చెప్పండి. వారి తప్పు ముందు చెప్పి, దానిని సరిచేసుకొనే పధ్ధతి కూడా చెప్పండి. ఊరికే వారి మిద అరవటం వల్ల వాళ్ళు విసిగిపోయి, కొన్నాళ్ళకు మన అరుపులకు భయ పడడం మానేస్తారు.

No comments:

Post a Comment