Wednesday, 29 July 2015

ఇంట్లో ఉండే పెద్దవాళ్ళను వృద్ధాశ్రమాలాలో చేర్పిస్తున్న కొడుకుల గురించి పత్రికలలో, టీవీల్లో, సామాజిక మాధ్యమాలలో వేలకొద్దీ వ్యాసాలు, కథనాలు వచ్చాయి. సమాజంలో కూడా ఎవరి తల్లితండ్రులనైనా ఆశ్రమాలలో ఉంచుతున్నారు అని వినగానే, వారికి సలహాలు ఇచ్చే పెద్దమన్షులు వేలాదిమంది. వారికి వచ్చే సలహాలు లెక్కలేనన్ని. కావాలని తల్లితండ్రులను ఆశ్రమాలకు పంపించే పిల్లలు చాలా తక్కువమంది ఉంటారు. ఏకారణం లేకుండా కేవలం, వాళ్ళ సౌఖ్యం, సౌకర్యంకోసం, తల్లితండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తిపాస్తులు అనుభవించడం కోసం అందరూ ఆశ్రమాలలో పెద్దవాళ్ళని వదిలేస్తారు అనుకోవడం చాలా తప్పు. అలా ఎవరైనా వదిలేశారు అంటే, బయటి ప్రపంచానికి తెలియని ఏవొ బాధలు, కష్టాలు వాళ్ళు పెద్దవాళ్ళతో అనుభవిస్తున్నారు అని అందరూ తెలుసుకోవాలి. పెద్దవాళ్ళని ముసలి వయసులో చూడడం ధర్మం, పెద్దవాళ్ళకి చేసిన సేవ మనలను, వంశాన్ని కాపాడుతుంది--కన్నవాళ్ళకే కదా సేవ చేస్తున్నది---ఇటువంటి మాటలు చెప్పడం చాలా తేలిక. ఇవి అందరికీ తెలిసినవే. కాని అన్నీ తెలిసి కూడా ఆ నిర్ణయం తీసుకున్నారంటే, వారు ఆ నిర్ణయం తీసుకోవడంలో ఎంత సంఘర్షణ పడి ఉంటారు అనేది అందరూ గుర్తించాలి. కొన్నిచోట్ల, ఇటువంటి సందర్భాలలో కేవలం ఇంటిలోని కోడలిదే తప్పు అన్నట్టు, కొడుకు ఎంతో ఉత్తముడైనట్టు మాట్లాడతారు. పెద్ద పెద్ద నిర్ణయాలు అనేవి భార్యభర్త కలిసి తీసుకునేవె అయి ఉంటాయి సాధారణంగా. ఈ పోస్ట్ వ్రాసినందుకు ఈ సమూహం లోని సభ్యులు అందరూ ముక్కున వేలు వేసుకుని, అఔరా, ఎంతకు తెగించింది అని నామీద విమర్శల సుదర్శన చక్రాలు సంధిస్తారు అని నాకు తెలుసు. కొంతమంది పెద్దలు ఇంట్లో, వాళ్ళకు ఏమీ పట్టనట్టు, ఇంట్లో వాళ్ళు పనితో ఎంత సతమతమవుతున్నా, ఏదో లాడ్జ్ రూం లో ఉన్నట్టు ఉంటారు. కోడలో, కూతురో ఎవరైనా కానీ, పనితో అలసిపోతున్నా, పట్టనట్టు ఉంటారు. వారికి అన్నివేళలా, అన్నీ అందిస్తూ ఉండాలి. మంచం పట్టిన వాళ్ళైతే చేయడం లో అర్ధం ఉంది. కానీ, చేయించుకోవడం మా జన్మహక్కు అన్నట్టు ఉండేవారితోనే అవస్థలు. కొంతమంది అన్ని విషయాలలోనూ తల దూరుస్తూ ఉంటారు. అవసరమైనంత వరకే సలహాలు ఇవాలి కానీ, అయిన వాటికీ, కాని వాటికీ జోక్యం కలుగచెసుకోకూడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వారికి ఎంత చెప్పినా అర్ధం కావు. కొంతమంది పెద్దలకు వారి డబ్బు అంటే ఎంత ప్రాణమో! ఇవతల వారి సంతానం ఎంత ఖర్చుల్లో ఉన్నా , కొంచెం కూడా చేయూత అందివ్వరు. కొంతమంది అయినవారికి ఆకుల్లోనూ, కానివారికి కంచాల్లోనూ అన్నట్టు ఉంటారు. కొంతమంది వయసులో ఉన్నన్నాళ్ళూ ఆస్తిపాస్తులు అర్ధం లేని విషయాలకి తగలేసి, అంతా అయిపోయినతర్వాత వారసుల ఇళ్ళకి వస్తారు. అక్కడ కూడా రాజసం వదలకుండా ప్రవర్తిస్తారు. మరికొంతమందికి అల్లుడు/కోడలు వైపు బంధువులు వస్తే సుతరామూ ఇష్టం ఉండదు. వారిని ముప్పుతిప్పలు పెట్టాలి అని చూస్తారు. కొంతమంది వారికి కేటాయించిన గదులు, బాత్రూంలు ఎంత అసహ్యంగా ఉంచుకుంటారో! వాటిని శుభ్రం చేయడానికి పనిమనుషులు కూడా ఒప్పుకోరు. ఇద్దరు ముగ్గురు వారసులు ఉన్నవాళ్ళు, ఒకరి దగ్గర ఉన్నప్పుడు మరొకరిని, లేదా మరొకరి వారసులని పొగుడుతూ ఉంటారు. వారు చెప్పేవి నిజాలే అయినప్పటికీ, పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి. కొంతమంది అల్లుడు/కోడలు చేసే పనులను, ప్రతినిముషం విమర్శిస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఆరోగ్య రీత్యా కొంచెం కూడా జాగ్రత్తలు తీసుకోరు. ఇక ఏకైక సంతానం కలవారికి పెద్దవాళ్ళను ఇంట్లో ఉంచి ఏ ఫంక్షన్ కైనా, ఊరైనా వెళ్ళాలంటే ఎంతో కష్టం. ఇవన్నీ వినడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ అనుభవించేవాళ్ళకు తెలుస్తుంది అందులో బాధ. ఇవన్నీ కూడా భార్యా భర్త మధ్య రోజూ పోట్లాటలు పెంచేవే. రోజూ పడే నరకయాతన కన్నా ఎవరో ఒకరు దూరంగా ఉంటే సమస్య తీరుతుంది అనుకున్న నిమిషాన పెద్దవాళ్ళను ఆశ్రమాలలో ఉంచాలి అనే నిర్ణయం జరుగుతుంది. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా ఉండరు అని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళకు ఒక మనవి---మీరు అదృష్టవంతులు కాబట్టి, మీ తల్లితండ్రులు మీ మనసు ఎరిగి ప్రవర్తిస్తున్నారు. మీరు మీ పెద్దవాళ్ళని ఆశ్రమంలో పెట్టలేదు అంటే, అది వారి సర్దుబాటుతనం, మంచితనం. సర్దుబాటుగా ఉండే పెద్దవాళ్ళను దూరం చేసుకోవాలి అని ఎవరూ అనుకోరు. అందరం కలిసే కలో, గంజో తాగుదాం అనే అనుకుంటారు. ఇంకా పిల్లలకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు వచ్చి పెద్దలను ఎవరూ చూసే అవకాశం లేకపోతే, కూడా ఆశ్రమాలు ఆదుకుంటాయి. అంతమాత్రాన, పిల్లలను అనాగరికులుగా, సంస్కారం లేనివాళ్ళుగా, పాలు తాగిన రొమ్మునే గుద్దేవాళ్ళుగా ముద్రవేయకండి. పెద్దవాళ్ళు కూడా కొంచెం సర్దుబాటుగా ఉంటే, ఏ సమస్యలూ ఉండవు. పెద్దవాళ్ళు అన్ని విషయాలలోను, చిన్నవాళ్ళకు ఆసరాగా ఉండాలి అంతే కాని ఎందుకీ లంపటం నాకు అని మీ పిల్లలు అనుకునే విధంగా ఉండకూడదు.

1 comment:

  1. నా భావాలతో ఏకీభవించే వ్యాసమిది. తెలిసీ తెలియని అయోమయం లో ఇలాంటి విషయాల్లో చాలా మంది జోక్యం చేసుకుంటారు. అది వారి అజ్ఞానానికి పరాకాష్ఠ. బాగుంది వ్యాసం. వ్యాస కర్తకు వందనాలు.

    ReplyDelete