Wednesday 29 July 2015

అందరికీ తిక్క కుదిరింది....ఇన్నాళ్ళూ ఎంతమంది ఫాస్ట్ ఫుడ్స్ తినద్దు మొర్రో అని చెవికి ఇల్లు కట్టుకుని పోరినా వినని వాళ్ళు ఇప్పుడు మ్యాగీ మీద నిషేధం వచ్చాక నాలుక కొరుక్కుంటున్నారు. మ్యాగీ ఒక్కటే కాకుండా రెడీమేడ్ గా దొరికే ఏ ఆహారపదార్థం లో అయినా ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు తప్పనిసరిగా ఉంటాయి అని అందరూ గమనించు కోవాలి. పిల్లల శారీరిక మానసిక ఆరోగ్యాలు కుటుంబం లో తల్లి మీదనే ఆధారపడి ఉంటాయి. శారీరికంగా ఆరోగ్యంగా లేని పిల్లలు చదువు మీద, ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టలేరు. ఇక ఆటలు, వ్యాయామం సంగతి సరే సరి. పిల్లలు ఆరోగ్యకర వాతావరణం లో పెరగకపోతే, ఒక తరం నిర్వీర్యం అయిపోతుంది. ఇది దేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. దేశం వరకూ ఎందుకు? కుటుంబం లోనే, ఒక్కరు అనారోగ్యం పాలైనా కూడా ఆ కుటుంబం యొక్క ఆర్ధిక వ్యవస్త మీద ఎంతో ప్రభావం ఉంటుంది. అందుకె మాతౄమూర్తులు అందరూ పిల్లల ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. బయట దొరికే రెడీమేడ్ ఫుడ్ మీద ఆధారపడకుండా, మన తరతరాల సంప్రదాయ వంటలు అయిన సున్నుండలు, నువ్వుల ఉండలు, వేరుశెనగ చిక్కీలు వంటివి పిల్లలకు తినిపించాలి. వీటన్నిటిలో పిల్లల ఎదుగుదలకు పనికి వచ్చే ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. మీకు చేయడం రాకపోయినా, చేసేందుకు సమయం లేకపోయినా, ఇవి కూడా బయట దొరుకుతాయి కాబట్టి అవి కొని పెట్టచ్చు. బయట కొన్నవి అయినప్పటికీ, వీటిలో ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు ఉండవు. ప్రతి ప్రాంతం యొక్క ఆహారపు అలవాట్లు ఆ ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. విదేశీ తిండి అయిన ఈ నూడుల్స్, అలూ చిప్స్, కుర్‌కురే వంటివి మన ప్రాంత ఆహారపదార్థాలు కానేకావు. తినడానికి పనికి వచ్చే పదార్థాలు ఎప్పుడైతే నిలువ ఉండేలా ప్యాకెట్స్ లో వస్తాయో, నిలువ ఉండేందుకు అందులో ఏవో కొన్ని రసాయనాలు కలుపుతారు, అటువంటి రసాయనాలు అన్నీ ఆరొగ్యానికి తప్పకుండా హాని చేస్తాయి అనే ఆలోచన ఎవ్వరికీ రాదు ఎందుకని? మన పిల్లల ఆరోగ్యం గురించి మనం ఆలోచించడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి, ఎవరో కోర్టుల్లో దావాలు వేసి, కోర్టు నిషేధిస్తేనే కానీ, మనకు స్పృహ రాదన్నమాట. ఎవరో చెప్తేనే వింటాము, మనకు సొంత ఆలోచన ఉండదన్నమాట. మళ్ళీ అందరూ చదువుకున్నవాళ్ళే....ఇకనైనా కళ్ళు తెరిచి, ప్యాకింగ్ లో వచ్చే ఆహారాన్ని పిల్లలకు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇవాళ మ్యాగీ....కొన్నీళ్ళ తరువాత ఇంకోటి....తీరా నిషేధించిన తరువాత, అప్పటివరకు జరిగిన హానిని మనం తీసివెయ్యలేము. తల్లులందరూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి.

No comments:

Post a Comment