Wednesday, 29 July 2015

మాకు మా అమ్మమ్మ ఎంతో స్పూర్తి. ఆవిడ ఎంతో తెలివైనవారు. జివితంలో ఎన్నో కష్టనష్టాలు చూసినవారు. మా అమ్మగారికన్నా ఒక విధంగా ఆవిడ దగ్గర్నుంచే ఎక్కువ నేర్చుకున్నామేమో! ఆవిడ మాట్లాదే ప్రతి మాటా ఒక పాఠం. ఒడియాలు పెట్టేటప్పుడు అన్నీ ఒక లైన్ లో ఉండాలి అనేవారు. కొబ్బరి పీచును ఒక చివర బాగా నలగ్గొట్టి, దానితో చెక్క బల్లలకు, కుర్చీలకు గాస్ స్టవ్ కి రంగులు వేసేసేవారు. బ్రష్ కొనుక్కుని వస్తాను కదా అంటే, నువ్వు తెచ్చేవరకు పని ఆగిపోవడంలేదా అని దెబ్బలాడేవారు. చేసిన పని పూర్తి అయినాకనే కాకుండా, చేసేటప్పుడు కూడా చూడడానికి బాగుండాలి అంటూ ఉండేవారు. ఎంత పెద్ద వయసు వచ్చినా, ఎవరి ఇంటికి వచ్చినా, ఖాళీగా ఉండేవారు కాదు. ఆవిడ కు ఎన్నో కుట్లు, అల్లికలు వచ్చు. అవి చేస్తూ ఉండేవారు. ఇంకా ఖాలీ దొరికితే, పిల్లలకు నీతిపద్యాలు చెప్పడమో, కథలు చెప్పడమో చేసేవారు. ఇప్పుడు "ఆల్మనాక్" అని మనం అనుకునేదాన్ని ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఆవిడ మైంటెయిన్ చేసారు. అందులో, ప్రతి కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు, మళ్ళీ, వాళ్ళ పిల్లలు, ---ఇలా మొథ్థం ఓ 70 మందికి సంబంధించిన పుట్టినరోజు తేదీలు, పెళ్ళిరోజు తేదీలు, వారి వారి జన్మనక్షత్రాలు, పుట్టిన టైము, ఇవన్నీ ఒక పుస్తకం లో వ్రాసుకునేవారు. ఆవిడ సంతానం లో ఎవరికైనా దూర ప్రాంతాలు ట్రాన్స్ఫర్ అయితే, వాళ్ళు కలిసినపుడు, ఆవిడ అడిగె మొదటి ప్రశ్న, అక్కడా కొత్త కొత్త కూరలు ఏమి దొరుకుతాయి, అక్కడ వాటిని ఎలా వండుకుంటారు? కొత్త కొత్త కుట్లు ఏమి ఉంటాయి? అవి ఎలా చేస్తారు? ఈసారి నువ్వు నేర్చుకుని, వచ్చి నాకు నేర్పించు. ఆరోజుల్లో, మార్కెటింగ్ విషయాలు తెలియక గానీ, లేకపోతే, ఆవిడకున్న ఆర్ట్ కి పెద్ద బిజినెస్ చేసేదేమో ఆవిడ. పెద్దవారి మాట చద్ది అన్నం మూట అనే నానుడిని చక్కగా నిరూపించింది మా అమ్మమ్మ. మరి మీకు కూడా ఇలాంటి పెద్దవాళ్ళతో ఏమైనా జ్ఞాపకాల్లు ఉంటే పంచుకోండి.

No comments:

Post a Comment