Friday 31 July 2015

శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 
అందమైన శరీరం, అంతే అందమైన జీవితభాగస్వామి, పిల్లలు, మంచి కీర్తి, శుభలక్షణాలు కలిగిన ఆలోచనా విధానం, మేరువంతా ధనం ఉన్నా, గురువు పాదాలయందు మనస్సు లగ్నం కాకపోతే, అవన్నీ ఉంటే ఎంత? లేకపోతే ఎంతా? అన్ని ఉన్నా, వ్యర్ధమే అంటారు గుర్వష్టకంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. 
గురు శిష్యుల నుంచి ధనం కోరడు. అసలు గురువు డబ్బవసరమే లేదు. ఆయన అఖండ వైరాగ్య సామ్రాజ్యానికి అధిపతి. మరి గురువుకు దక్షిణంగా మనమేం ఇవ్వగలం? సహనం, శ్రద్ధలే మీరు నాకు దక్షిణగా సమర్పించండి అన్నారి సమర్ధ సద్గురు శ్రీ షిరిడీ సాయినాధుడు. గురువు అన్నీ ఇవ్వగలిగినా, శిష్యుడి పవిత్రతను చూస్తాడు. అతడి స్థాయి పెరగాలని భావన చేస్తాడు. అడ్డగ్గానే ఇవ్వకుండా అతనికి అనేక వ్యతిరేక పరిస్థితులు కల్పించి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాడు. అవలక్షణాలు తొలగిస్తాడు. ఇవన్నీ తట్టుకోవాలంటే ముందు గురువు యెడల నమ్మకం ఉండాలి. దాంతో పాటు సహనం కూడా ఉండాలి. ఏం జరిగినా ఓర్పు వహించాలి. గురువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఉన్నదని తెలియడానికే సమయం పడుతుంది. దానికి సహనం అవసరం.
గురువు చెప్పినది సత్యము, అదే ఆచరణీయమని, మనసులో స్థిరంగా భావన కలిగి ఉండటం, గురువు చెప్పినదాన్ని ఆచరించడం, నిత్య జీవితంలో అనుష్టించడాన్నే శ్రద్ధ అంటారు. గురువు ఏదో తన పూట గడుపుకోవడం కోసం మాటలు చెప్పడు. ప్రేమ, కరుణా, దయా పొంగి ప్రవహించగా, శిష్యులను ఉద్ధరించడం కోసం, తాను ఉత్కృష్టమైన సమాధి స్థితి నుంచి క్రిందకు దిగి వచ్చి, బోధ చేస్తాడు. శిష్యులు తనను పూజించాలని గురువు భావించడు, తన బోధను ఆచరించాలని మాత్రమే కోరుకుంటాడు. గురుబోధను ఆచరించకుండా ఎన్ని పూజలు చేసినా, గురువు మెచ్చుకోడు. అందువల్ల గురువు చెప్పిన విషయాన్ని ఆచరించడమే శ్రద్ధ. అదే గురుదక్షిణ.
గురుపూర్ణిమ వేదవ్యాసమహర్షి జయంతి సందర్భంగా చేస్తారు. వ్యాసభగవానుని కారణంగానే మనకు ఇంక వాఙ్గ్మయం వచ్చింది. ఎవరు చెప్పినా, ఆయన చెప్పినదే చెప్పాలి కానీ కొత్తగా ఏమీ చెప్పలేరు. చెప్పడానికి ఏమీ లేదు కూడా. అందుకే ఈ రోజున తమ తమ గురువులలో వ్యాసమహర్షిని చూసుకుని పూజించాలి.

No comments:

Post a Comment