Wednesday, 29 July 2015

చిన్నప్పుడు, మా అత్తా వాళ్ళింట్లో, వక్కపొడి స్వయంగా తయారు చేసుకునేవారు. వక్కలు తెచ్చి, నేతిలో వేయించి, ఏలకులు, పచ్చకర్పూరం, జాజికాయ, ఇవన్ని మెత్తగా పొడి చేసి కలిపేవారు. అందులొ సారపప్పు, దోస గింజలు, వెయించి వేసేవారు. ఆ వక్కలను కత్తిరించడానికి "అడకత్తెర" అని ఒక పనిముట్టు ఉండేది. దాన్ని చాలా జగ్రత్తగా వాడాల్లి. లేకపోతే వేళ్ళు తెగుతాయి. ఇప్పటిలాగా దోస గింజలు సూపర్ మార్కెట్లొ దొరికేవి కాదు. 
ఓపికగా ఆ గింజలు ఎండబెట్టి, తొక్కతీసి, వేయించి, వక్కపొడిలో కలిపేవారు. వాళ్ళ అత్తగారికి పళ్ళు లేవు. అయినా ఆవిడకు ప్రాణం వక్కపొడి అంటే. అందుకని ముక్క చెక్క లా కాకుండా, గోధుమ రవ్వ మాదిరి మెత్తగా కొట్టుకునే వారు. ఆ వక్కపొడి ఎంత ఫ్రెష్ గా ఉండేదంటే, వాళ్ళ 10 గదుల ఇంట్లో, ఏ గదిలో డబ్బా మూత తీసినా, అన్ని గదుల్లోకీ ఆ సువాసన విరజిమ్మేది. ఇంతకీ వక్కపొడితో ఆరొగ్యపరంగా లాభాలు ఏవైనా ఉన్నాయా? అనేది నాకు చిన్నతనం నుంచి సందేహం. తాంబూలం అయితే అరోగ్యానికి మంచిది అని విన్నాను. ఇవాళ ఒక గుడిలో మారేడు వృక్షాన్ని చూసాను. ఆ మారేడు కాయలు చూడగానే, ఇదివరకు బ్రాహ్మలు సొంతంగా తయారు చేసుకునే ముక్కుపొడెం డబ్బా గుర్తొచ్చి, దాన్నుంచి మా అత్తా వాళ్ళ వక్కపొడి తయారీ విధానం కూడా గుర్తొచ్చింది. అన్నట్టు వాళ్ళ ఇంట్లో వక్కపొడి పెట్టుకోడానికి చక్కటి నగిషీలు కల రంగురంగుల చెక్క డబ్బా, ఒక అద్భుతమైన పనితనం కల వెండి డబ్బా కూడా ఉండేవి. ఆ వెండి డబ్బాకి మూతపైన ఒక పెద్ద కెంపు, మూతకు, డబ్బాకు కలిపి ఒక గొలుసు ఉండేవి, ఎంత సొగసుగా ఉండేదో అది....ఆ పనితనం ఇప్పుడు ఉందో లేదో మరి. మరి ముక్కుపొడి,(నశ్యం) ఏవిధంగా నైనా ఆరొగ్యానికి ఉపయోగపడుతుందా? నా సందేహాలు తీర్చండి. కేవలం అలవాటుగా తీసుకోవడమేనా? వక్కపొడి, ముక్కుపొడి (నశ్యం) అలవాట్లు ఇప్పుడు ఎవరికీ లేవనుకుంటాను.

No comments:

Post a Comment