Wednesday 29 July 2015

whatsapp లో నాకు అందిన ఒక గజల్ కి అనువాదం. ఉర్దూ సాహితీ ప్రక్రియ లో "నజ్మ్" అంటారు. "నజ్మ్ " అంటే అందులో విషయం ఒక కథ రూపంలో చెప్పబడుతుంది. గీత రచయిత "జఫర్ గోరఖ్పురి ". మానవ జీవన పరిస్థితులు తర తరానికీ ఎలా మారుతున్నాయో, హృద్యంగా వర్ణించారు.. ప్రముఖ గజల్ గాయకుడు శ్రీ పంకజ్ ఉధాస్ గారి గళం నుంచి వెలువడిన గీతం ఇది. నాకు తెలిసినంత వరకు అనువాదం చేశాను.
ఏ కాలం అయినా, సుఖ దుఖాలు, కష్ట నష్టాలు మనవారికైనా, పరాయి వారికైనా ఒకటే. కాని ఇప్పటి కాలం కన్నా ఆ కాలం బాగుందేమో!
అప్పటి ఇళ్ళు మట్టివైనా, పూరిల్లైనా గాలి ధారాళంగా వచ్చేది. దొంగలు, బందిపోట్ల భయం ఉండేది కాదు, నాలుగు వేళ్ళు నోట్లోకి పోకపోయినా ( కడుపు నిండా తిండి లేకపోయినా) సుఖమైన నిద్ర పట్టేది. మధ్యాహ్నాలు ప్రశాంతంగా, సాయంకాలాలు సందడి సందడిగా గడిచేవి. అందరి హృదయాలు సంతోషం తో నిండి ఉండేవి. మనస్సుల్లో కల్మషం లేదు, కళ్ళల్లో కపటం లేదు. ప్రజలు అమాయకంగా, మనసులలో ప్రేమతో ఉండేవారు. కానీ, వారందరూ ఈ ప్రపంచాన్ని త్వరగా వీడి పోయారు. ( ఆ తరం త్వరగా కనుమరుగైంది.)
మా నాన్నగారి కాలం వచ్చింది. ( కొంచెం తర్వాతి కాలం) కొత్త చదువులు వచ్చాయి. కొత్త చదువులతో పాటు కొత్త ఆలోచనలు వచ్చాయి. మట్టి ఇళ్ళు పోయి, పక్కా ఇళ్ళు వచ్చాయి. ఆఫీసు ఉద్యోగాలు మొదలై, జీతమే ఆధారం అయింది. భగవంతుని నమ్ముకుని జీవితం సాగించారు. సరిపడేంత డబ్బు లేకపోయినా, జీవితం సుఖం గానే ఉంది. పేదింటి భోజనం అయినా ( విందు భోజనం కాకపోయినా ) సంపూర్ణం గానే ఉంది.
ఇప్పుడు నా తరం వచ్చింది. ఇక్కడ ఎవరికీ ఎవరూ కారు. ప్రతివారు ఒంటరి వారే.ప్రతి ముఖమూ అపరిచితమే. కన్నీళ్ళూ లేవు, చిరునవ్వులూ లేవు. (మనసులు భావ రహితం అయిపోయాయి ) మన వాళ్ళ సంగతే పట్టించుకోని ఒక మాయ కమ్మేసింది. ఆస్తులు, భూములు, బంగళాలు, కార్లు, నౌకర్లు, చాకర్లు, పదవులు, పరువు, ప్రతిష్ట, అన్నీ ఉన్నాయి. కానీ మనశ్శాంతి లేదు. ఇంకా ఏదో సంపాదించాలి అనే భ్రమలో, ఉన్నది ఏమి పోగొట్టుకుంటున్నామో గ్రహించుకోవడం లేదు.
రాబోయే తరం వాళ్ళందరికీ ఒక వినతి. మేము ఏ ఏ కష్టాలు అనుభవించామో, ఏ ఏ దుఖాలు సహించామొ అవి మీ దగ్గరకు కూడా రాకూడదు. మేము ఏ ఏ కష్టనష్టాలు పడ్డామో అవి మీరు పడకూడదు. అందరిలో గుమిగూడి ఉన్నా, మేము అనుభవించిన ఒంటరి తనం మీకు వద్దు. మీరు వెళ్ళే దారిలో వెలుగులు పూయాలి. 21 వ శతాబ్దపు ( ఆధునిక కాలపు ) ఫలాలు మీకు అంది రావాలి. మా తరం వారం, మనశ్శాంతిని కోసం పరితపించాం. మీకు ఆ పరిస్థితి రాకూడదు. మీ మనస్సులలో ఆనందం వేల్లివిరియాలి. జీవితం సుఖమయం కావాలి.

No comments:

Post a Comment