Wednesday, 29 July 2015

భావుక

 మా తరం వాళ్ళం చాల అదృష్టవంతులం. (అంటే ఇప్పుడు 40 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నవాళ్ళు ) ఎందుకంటే, మేము ప్రయాణాలకు పాసెంజర్ రైళ్ళు, బొగ్గు రైళ్ళు, ఎక్స్ప్రెస్స్ రైళ్ళు, సూపర్ ఫాస్ట్ రైళ్ళు అన్నీ ఉపయోగించాము. అలాగే చిన్నతనాల్లో జనరల్ కంపార్ట్మెంట్ లు, తరువాత రిజర్వేషన్ , ఫస్ట్ క్లాసు కోచ్ లు, ఇప్పుడు AC కూడా ఎక్కుతున్నాం. ఇప్పటి వాళ్ళకి బొగ్గు రైళ్ళు తెలియదు, రాక్షసి బొగ్గు కాలుతుంటే వచ్చే ఆ కమ్మటి వాసనా తెలియదు. అలాగే మేము సమాచారం తెలియడం కోసం, ఉత్తరాలు, ఫోన్ అయితే, ట్రంక్ బుకింగ్, STD , ఇప్పుడు మొబైల్ ఫోన్, ఆండ్రాయిడ్, whatsapp అన్నీ వాడాము. ఇప్పటి వాళ్ళకు ఉత్తరాలు వ్రాసి మనసులో భావాలూ తెలియపరుచుకోవడం, మళ్లీ తిరుగు టపాలో జవాబు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడడం, అసలు postman అంటేనే ఒక చుట్టం లాగా ఫీల్ అవ్వడం తెలియదు. అలాగే పుట్టినరోజు పేరంటాలు, శ్రావణ మాసం పేరంటాలు, వినాయక చవితి కి పత్రీ స్వయంగా కోసుకుని రావటం, ఒక కాలనీ పిల్లలు అందరూ కలిసి ఆషాఢమాసం లో గోరింటాకు కోసం, ఉగాది ముందు రోజు వేపపువ్వు కోసం గుంపులు గుంపులు గా వెళ్లి స్వయంగా కోసుకునే ముచ్చట్లు ఏవి ఈ తరం వాళ్ళకు తెలియవు. ఏదో బజారుకు వెళ్లి 10 రూపాయలు పెట్టి కొనుక్కురావడమే కానీ, గుంపులుగా వెళ్తూ అల్లరి చేస్తూ వెళ్ళే మజా వీళ్ళకు తెలియదు.
ఈ తరం పిల్లలకు సూర్యోదయం, సూర్యాస్తమయం స్వయంగా చూసి అనుభవించడం తెలియదు. ఆరుబయట వెన్నెల్లో కథలు వింటూ పడుకోవడం, డాబా మిద వెన్నెల్లో భోజనం చేయడం, వేసవి సెలవులలో ఆరుబయట ఆడుకోవడం, సూర్యోదయం తో పాటు ఆహార వేటకు వెళ్ళే పక్షుల గుంపులు చూడడం, వీటిలోని అందాలు ఏ మాత్రం తెలియవు.
పక్కింటి వాళ్ళ జామ చెట్టునో, మామిడి చెట్టునో రాళ్ళతో కొట్టి కాయలు తినడం (ఎందుకో అలా తింటే చాలా రుచిగా ఉండేవి ), స్కూల్ కు నడిచి వెళ్తూ ఇల్లు కట్టుకోవడానికి ఎవరో తెప్పించుకున్న ఇసుక గుట్టలు, కంకర గుట్టలు ఎక్కుతూ, దిగుతూ వెళ్ళడం, ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఈరోజుల్లో వాళ్ళకు తెలియదు.
ఇంకో విషయం ఏమిటంటే, మా తరం వాళ్ళకు ఉద్యోగాలు చిన్నవే, జీతాలు చిన్నవే. అయినా మాకు అసంతృప్తి లేదు. ఒక్కో రూపాయి దాచుకొని కొనుక్కున్న వస్తువులు మాకెంతో అపురూపం. పాత టీవీ అమ్మేసి, రిమోట్ కంట్రోల్ ఉన్న టీవీ కొనుక్కున్నపుడు పాత టీవీ ఎవరికో ఇచ్చేస్తుంటే ఎంతో విలవిల లాడిపోయాం. మా వస్తువులతో మాకు అంత attachment . సంవత్సరాల తరబడి ఉన్న ఇల్లు మారాలన్నా, transfer అయి, ఊరు మారాలన్నా, ఏదో ఎమోషన్. ఇపుడు ఉద్యోగాలు పెద్దవి, జీతాలు పెద్దవి. పాతిక సంవత్సరాలు రాకుండానే సొంత స్థలాలు, ఇల్లు కొనుక్కున్నా మీకు సంతృప్తి లేదు, వేటి మీదా మమకారం లేదు, ఇంకా ఏదో లేదు అనే వెలితి భావనే.
ఒకప్పుడు ఇంట్లో పెద్ద కొడుక్కు ఉద్యోగం, సంపాదన వస్తే, ఇంటి సమస్యలు అన్నీ తీరినట్టే అని భావించే వారు. తన కన్నా చిన్నవాళ్ళను పెద్ద కొడుకే చదివించేవాడు. తల్లితండ్రులు కూడా నిశ్చింతగా ఉండేవారు. ఇప్పుడు అన్నదమ్ముల సంగతి సరే,భార్యా భర్తల మధ్యనే నీది, నాది అనే బేధాలు. ఎవరి జీతం వారిది, ఎవరి లోన్లు వాళ్ళవి, ఎవరి ఖర్చు వారిది, ఎవరి బ్రతుకు వాళ్ళది. మనది అనే భావన లేదు ఇప్పుడు. ఇక ఇలాంటివాళ్ళు తల్లితండ్రులను, అన్న దమ్ములను, అక్క చెల్లెళ్ళను ఏమి చూస్తారు? నీ చుట్టాలు వస్తే నీ ఖర్చు. నా చుట్టాలు వస్తే నా ఖర్చు. ఇదీ ఇవాల్టి పోకడ.
మొత్తం మీద మేము కష్టపడినా జీవితం లో ఉండే ఆనందాన్ని అనుభవించాము. కష్టం వెనకాల ఉండే సుఖాన్ని చూసాము. అత్తమామలతో గొడవలు ఉన్నా, వారి నీడన ఉండే సౌఖ్యం చూసాము. గొడవలు వస్తాయి అని వాళ్ళను వద్దు అనుకోలేదు. ఆడపడుచులు, మరుదులు బాధ్యతలు తీర్చాము, ఇపుడు వాళ్ళ నుంచి గౌరవమూ పొందుతున్నాము. ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది, ఈ బాధ్యతలు నావి అని అనుకోని నిర్వర్తిన్చాము.
ఇపుడు పుట్టుక తోనే అన్ని సౌఖ్యాలు అమరిపోతున్నాయి కాబట్టి ఈ తరం వాళ్ళకు కష్టం అంటే తెలియడం లేదు, దాని ద్వారా సుఖం యొక్క విలువా తెలియడం లేదు. అందుకే మీకు ఎన్ని ఉన్నా తృప్తి లేదు. మీరు డబ్బు విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. దానిని ఖర్చు పెట్టడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకు. కానీ ఆ డబ్బు మీకు ఆనందాన్ని , తృప్తిని ఇవ్వడం లేదు. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ అయింది కాబట్టి. తల్లి తండ్రుల ప్రేమ కూడా మీకు ఎక్కువ దొరుకుతోంది కాబట్టి మీకు ఆ మమకారం యొక్క విలువ కూడా తెలియడం లేదు. మీకు పెద్ద పెద్ద సమస్యలు లేవు, బాధ్యతలు లేవు అందుకనే మీకు చిన్న చిన్న సమస్యలు చాలా పెద్దవిగా కనబడతాయి. అవి మీరు పరిష్కరిచుకో లేకపొతున్నారు. అందుకే ఈరోజుల్లో, ఆత్మహత్యలు, విడాకులు ఎక్కువ అయినాయి. ఈ విషయం మీద ఇంకోసారి చర్చించుకుందాం.
సెలవు.

1 comment:

  1. "ఇపుడు పుట్టుక తోనే అన్ని సౌఖ్యాలు అమరిపోతున్నాయి కాబట్టి ఈ తరం వాళ్ళకు కష్టం అంటే తెలియడం లేదు, దాని ద్వారా సుఖం యొక్క విలువా తెలియడం లేదు. అందుకే మీకు ఎన్ని ఉన్నా తృప్తి లేదు."

    నేనొప్పుకోను. వారికి మనం తెలియనివ్వడం లేదు అని వ్రాయండి. నేనొప్పుకుంటాను.

    ReplyDelete