Monday 13 January 2014

భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని మానవుడు సంపూర్ణంగా, సంతృప్తిగా ,ఆదర్శప్రాయంగా జీవించడానికి మన పూర్వులు మనకు ఆశ్రమ ధర్మాలను బోధించారు. ఇక్కడ ఆశ్రమములు అంటే జీవితంలోని stages అంటే స్థాయులు. ఆశ్రమములు 4. అవి, బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థ, మరియు సన్యాస ఆశ్రమములు.

శిశువు పుట్టిన దగ్గర్నుంచి 5 సంవత్సరాలవరకు ఇంట్లో తల్లితండ్రుల దగ్గర పెరిగి తరువాత గురుకులమునకు వెళ్తాడు. అక్కడ వివిధ శాస్త్ర అధ్యనం చేస్తాడు. 24 సంవత్సరముల వరకు బ్రహ్మచర్యం పాటిస్తూ ఒక శిష్యుడిగా గురువుకు సేవ చేస్తూ విద్య అభ్యసిస్తాడు. ఇది బ్రహ్మచర్య ఆశ్రమం.

తరువాత యోగ్యురలైన కన్యను వివాహమాడి, సంతానమును కని, వారిని పెంచి పెద్ద చేస్తాడు. తన బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇది గృహస్తాశ్రమం.

పిల్లల బాధ్యతలు పూర్తీ అయిన తరువాత ఇక సంసారం లంపటము నుండి మనసును వేరుచేసుకొని, బాధ్యతలు పిల్లలకు అప్పగించి తను విశ్రాంతి తీసుకుంటాడు. ఇది వానప్రస్థ ఆశ్రమము.

చివరిది సన్యాస ఆశ్రమము. సన్యాసము అంటే కాషాయ వస్త్రాలు ధరించి అడవులకు వెళ్లి తపస్సు ఆచరించ నవసరం లేదు. బంధాల నుండి దూరం అయ్యి, దైవ స్మరణలో మరణించేవరకు కాలం గడపడం సన్యాస ఆశ్రమం.

అయితే ఈ అన్ని ఆశ్రమ ధర్మలలోను గృహస్తాశ్రమం ఉత్తమమైనది అని శాస్త్రోక్తి. ఎందుకంటే, గృహస్తు ద్వారానే ఇతర ఆశ్రమస్తులకు ఆహారం లభిస్తోంది. గృహస్తాశ్రమం వల్లనే వంశాభివృద్ది జరుగుతుంది. అతిథి అభ్యగతులు గృహస్తు ద్వారానే ఆదరింప బడతారు, యజ్ఞ యాగాదులు, హోమాలు, పూజలు, వీటన్నిటిని చేయడం వల్ల ధర్మం నిలబడుతుంది. ధర్మం ఉన్నచోట కరువు కాటకాలు ఉండవు. దేశం సంమృద్ధిగా ఉంటుంది. ఈ కార్యలన్నిటికి గృహస్తే ఆధారం.

గృహస్తు లక్షణాలు... 1.సహనం, 2.విశాలభావం,3. ఇంద్రియ నిగ్రహం,4. చిత్తశుద్ది, 5.మనోనిగ్రహం, 6.లౌకిక జ్ఞానం,7. తాత్విక ఆలోచన, 8.సత్యమైన జీవితం,9. కోపం లేకపోవడం, 10.అపరిగ్రహం (ఇతరుల నుండి ఉచితంగా ఏమి స్వీకరించక పోవటం )... ఈ పది లక్షణాలు ఉన్నవాడు ఉత్తమమైన గృహస్తు.

గృహస్తు నిత్యజీవితంలో పవిత్ర హృదయంతో, ధర్మాచరణ చేయాలి. ఇలా చేస్తే భగవంతుని అందుకోన్నట్లే. సమాజానికి, దేశానికి, అతని సేవలు ఎంతో ముఖ్యం.

No comments:

Post a Comment