Wednesday 10 August 2016

విదురనీతి 59

ఏకృషీ చెయ్యకుండా సంపదలు వాంచించేవాడూ, స్వీయకార్యాలు విడిచి పరాచారాలు పాటించేవాడూ, మిత్రులతో అసంబధ్ధంగా చరించేవాడూ, అయోగ్యులను వాంచించేవాడూ, మిత్రులను తిరస్కరించేవాడూ, బలవంతులతో వైరం పెంచుకునేవాడూ, శత్రువులతో మైత్రి సాగించి మిత్రకోటితో శతృత్వం నెరపే వాడూ, సందేహచిత్తుడై సర్వకార్యాలనూ సకాలంలో నిర్వర్తించంది వాడూ, అనాహూతుడై ఆగమించేవాడూ, పృచ్చలేకుండా భాషించేవాడూ, కృతఘ్నులను విశ్వసించేవాడూ, దోషాచారపరాయణుడూ, పరదోషగ్రహణ చిత్తుడూ, వ్యర్ధక్రోధీ, అనధికారులకు ఉపదేశాలిచ్చేవాడూ, శూన్యాన్ని ఉపాసించేవాడూ, కృపణులను ఆశ్రయించేవాడూ వీరందరూ మూర్ఖులే..



విద్యాధనాలు విరివిగా ఉన్నా, గర్వంలేకుండా చరించేవాడు పండితుడు. తనవల్ల పోషింపబడే వారికి భోజన భాజనాదులు సమకూర్చకుండా తన సుఖసంతోషాలు చూసుకొనేవాడు మహామూర్ఖుడు. మానవుడు ఒక్కడు చేసిన పాపం ఎందరినో వేధిస్తుంది. పాపఫలానుభవంతో అది వారిని విడిచిపెడుతుంది. కాని కర్త మాత్రం దోషిగానే ఉంటాడు. మాహావీరుని హస్తంలోని ధనుస్సునుండి వెలువడిన బాణం ప్రతిపక్ష వీరులలోని ఎవరినీ వేధింపక పోవచ్చును..కాని విద్వాంసుని వాక్కు సర్వప్రజాసమూహంతో రాష్ట్రాన్ని కూడా నశింపచేయగలదు. ఆత్మబుధ్ధితో కర్వ్యాకర్తవ్యాలను నిశ్చయించుకొని శత్రుమిత్ర ఉదాసీనులను సామ దాన బేధ దండోపాయాలతో వశపరచుకొని పంచేంద్రియలను జయించి, సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ సమాశ్రయ గుణాలను గ్రహించి స్త్రీ, ద్యూత, మృగయావినోద, మద్యపాన, కటువచన , కఠినదండన స్వభావ కర్కశప్రవర్తనాది అన్యాయాలను విడిచి సుఖించాలి.

త్రాగినవానినే విషం చంపుతుంది. బాణం గుచ్చుకొన్నవానినే యమసదనం చేరుస్తుంది. ప్రజలతో రాజును నసింపచెయవచ్చు. "ప్రభూ! ఏకాకిగా ఆహారం భుజింపకూడదు. తనకు తానై విషమ సమస్యలలొ నిశ్చయాలు చేసుకోకూడదు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకూడదు. అందరూ నిద్రిస్తూండగా ఒక్కడు మేల్కొని ఉండాకూడదు. ఇది విద్వాంసుల మార్గము. సాగర తరణానికి నౌక ఏకైక సాధనమైనట్లే స్వర్గం చేరడానికి సత్యమే ఏకైక సాధనం. ఈ విషయాన్ని మీరు గుర్తించడం లేదు. క్షమకంటే బలమైనది లేదు. సమర్ధునికి అది ఒక భూషణం వంటిది. ఈ జగత్తులో క్షమను మించిన వశీకరణశక్తి లేదు.
శాంతి అనే ఖడ్గం ధరించిన వానిని ఏ దుష్టుడూ ఏమీ చెయ్యలేడు. క్షమాహీనుడు తనతోపాటు ఇతరులను కూడా బాధకు గురిచేస్తాడు. ధర్మమే కళ్యాన పథము. ఓరిమియే శాంతిమార్గం. విద్యయే ఆనంద హేతువు..

(ఇంకా ఉంది )  

No comments:

Post a Comment