హేవిటో ! ఆడవాళ్ళు నిముషానికి 19 సార్లు కనురెప్పలు ఆడిస్తే, మగవాళ్ళు 11 సార్లే ఆడిస్తారుట. ఇందులో కూడా పిసినారి తనమే..... మాట్లాడడం తక్కువ, నవ్వటం తక్కువ.... కనురెప్పలు ఆడించటానికి నొప్పి ఏమిటండీ విడ్డురం కాకపోతే, ఏదైనా అంటే ఆడవాళ్ళను హేళనగా మాట్లాడడం, లోడలోడా వాగుతారు అని. అసలు ఆడవాళ్లు మాట్లాడకపోతే, ఎంత నష్టం ఉందొ మగవాళ్ళకు ఏమి తెలుసు? ఆశమ్మ, పోశమ్మ కబుర్లు అని మనను ఆడిపోసుకుంటారు కానీ, మన వాళ్ళ ఎంత బ్రాండెడ్ బిజినెస్ జరుగుతోందో? ఫలానా షాప్ లో నెక్లెస్ ల డిజైన్లు బాగున్నై, ఈ సారి అక్కడ ట్రై చేయండి, ఫలానా షాప్ లో కొన్న కాటన్ చిర రంగు పోతోంది, అక్కడ కొనకండి, ఫలానా హోటల్ లో భోజనం బాగుంది, ఫలానా షాప్ లో పప్పులు బాగు చేసుకోక్కర లేకుండానే వందేసుకోవచ్చుట అనే పబ్లిసిటీ ఎన్ని కోట్లు ఖర్చు పెడితే వస్తుంది? ఇది నా మాట కాదండోయ్. ఒక సర్వే లోనే చెప్పారు. ఆడవాళ్ళ మౌత్ పబ్లిసిటీ బ్రాండెడ్ పబ్లిసిటీ కన్నా ఎక్కువ పని చేస్తుంది అని. అందుకే హోటల్స్ కు ఎక్కువ ప్రచారం చేయరు చూసారా! ఒక ఫంక్షన్ కి వెళ్లి ఆడవాళ్ళ మాటలు వింటే, వికెపెడియా ఎందుకు పనికొస్తుంది? చిన్న పిల్లల దగ్గర కూర్చుంటే ఆనందం, వయసులో ఉన్న ఆడపిల్లల వద్ద కూర్చుంటే ఫాషన్ ప్రపంచం మన కళ్ళ ముందు ఉండదూ... అలాగే, వయసయిన వాళ్ళ దగ్గర కూర్చుంటే, వాళ్ళు చెప్పే కబుర్లలో పుణ్యానికి పుణ్యం, జ్ఞానానికి జ్ఞానం వచ్చేయ్యవూ... అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కన్నా మంచి కౌన్సిలర్లు ఎన్ని డిగ్రీలు చదివినా ఉంటారా? ఇప్పుడంటే ఈ దిక్కుమాలిన టీవీ సేరియల్లు వచ్చి, ఎవరికీ వారు తలుపులు వేసుకుని కూర్చుంటున్నారు కానీ, ఇదివరకు ఇరుగమ్మలు పొరుగమ్మలు కలిసి ఎంత కాలక్షేపం చేసేవారు? అసలు ఆ గంటా రెండుగంటలు వారు మాట్లాడుకునే మాటలు విజ్ఞాన భాండాగారాలు కదూ....మగవాళ్ళూ ఉన్నారు ఎందుకూ... నలుగురు కలిస్తే, చతుర్ముఖ పారాయణం, ఒక ఫంక్షన్ కి వెళ్ళినా అదే ఏడుపు. కూడా వచ్చినా పెళ్ళాం, పిల్లలు ఏ గంగలో కలిసారో అక్కర్లేదు. బుగ్గన కిళ్ళీ బిగించి, పేక ముక్కలు పంచడం మొదలెడితే, ఇహ కాఫీలు, టిఫిన్ లు అక్కడికే, ఇడ్లియే తింటున్నారో, పచ్చడే తింటున్నారో కూడా తెలియకుండా వెధవ ఆటా వీళ్ళూను. కొంత వరకు నయం, అక్షితలు వేయడానికైనా లేచి వస్తారు, వాళ్ళనే లేచి ఆట దగ్గరకు రమ్మనకుండా.... హవ్వ.... ఇక భోజనాల దగ్గర మాట్లాడుకునే మాటలు చూడాలి, దేశం అంతా వీళ్ళ వలనే నడుస్తున్నట్టు. వెధవ రాజకీయాలు వీళ్ళూను. పైసా కి పనికిరాని మాటలు, ఆ మంత్రి అలాగండీ, వీడు ఇల్లాగండీ అని దిక్కుమాలిన విశ్లేషణలు.... వీళ్ళు చర్చిన్చుకున్నంత మాత్రాన దేశ రాజకీయాలు మారిపోతాయా, ఇంక ఆఫీసు కబుర్లకు వస్తే, మరీ ఘోరం, వాళ్ళ ఆఫీసు వలననే దేశ ఆదాయం వచ్చి పడిపోతోంది అన్నట్టు వెధవ బిల్డప్ లు. మీ ఆఫీసు లో మీరేం చేస్తారు, మీరేం చేస్తారు అంటూ పోట్లాటలు. పచ్చడి పూర్తీ చేసి, , పులుసు లోకి వచ్చేసరికి వీళ్ళల్లో వీళ్ళే కత్తులతో పొడిచేసుకుంటారో, తలకాయలు నరికేసుకుంటారో అని చచ్చే భయం వేస్తుంది చూసే వాళ్ళకు.
ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళ మాటలను పనికిరాని మాటలుగా కొట్టి పారేస్తారు. వాళ్ళేదో పెద్ద మేధావులు అనుకుంటారు కానీ, ఆడవాళ్ళ విలువ తెలుసుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోతుంది టండీ ఈ మగ మహారాజులకి.... ఇంక ఉంటాను. మళ్ళి కలుద్దాం. ఇంకో విషయం తో.
ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళ మాటలను పనికిరాని మాటలుగా కొట్టి పారేస్తారు. వాళ్ళేదో పెద్ద మేధావులు అనుకుంటారు కానీ, ఆడవాళ్ళ విలువ తెలుసుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోతుంది టండీ ఈ మగ మహారాజులకి.... ఇంక ఉంటాను. మళ్ళి కలుద్దాం. ఇంకో విషయం తో.
No comments:
Post a Comment