Sunday, 1 March 2015

మా చిన్నతనాల్లో సంక్రాంతి.
మా చిన్నప్పుడు సంక్రాంతి పండుగ వస్తోంది అంటే అబ్బో... పెద్ద హడావిడి. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి ముగ్గులు.. గొబ్బిళ్ళు....తెల్లవారే లేచి గుడికి వెళ్ళడం (ధనుర్మాసం ప్రసాదం మీద భక్తి, దేవుడి మీద కాదు. ) అసలు ధనుర్మాసం లో వైష్ణవ ఆలయాల్లో పెట్టె చక్కర పొంగలి, దద్ద్యోజనం రుచే వేరు. సత్యం శంకరమంచి గారు అమరావతి కధలలో చెప్పినట్టు, దద్ద్యోజనం లో వేసే కరివేపాకు కూడా మహా రుచిగా ఉంటుంది లెండి. ఇంటి ముందు పెట్టె ముగ్గులు మహా కుట్రలతో కూడుకొన్నవి. మేము ముగ్గులు రాత్రి పూట వేసేవాళ్ళం. ముందుగ పెట్టేస్తే, మా ముగ్గు ఎవరైనా కాపీ కొడతారేమో అని బాగా పొద్దుపోయాక వేసేవాళ్ళం. చుక్కలు ఎన్నో తెలియకుండా, ముగ్గులు పెట్టడం లో మా అక్క మహా నేర్పరి. ఉన్న ముగ్గుకి ఎన్నో సొగసులు అద్ది, చుక్కలు ఎన్నో తెలియకుండా చేసేది. మళ్లీ తెల్లవారే లేచి, గుడికి వెళ్తూ వెళ్తూ, ఎవరి ముగ్గు బాగుంది, ఎవరెవరు ఈ సంవత్సరం కొత్త ముగ్గులు వేసారు అని విశ్లేషణలు.....ఇంక ధనుర్మాసం చివర వచ్చే కనుమ, ముక్కనుమ రోజు వేసే రధం ముగ్గులు ప్రతి సంవత్సరం ఒక కొత్త రకంగా వేసేది మా అక్క. ఆ రధం తాడును ప్రతి ఇంటి ముందు రధం ముగ్గుకి కలిపి (మధ్యలో ఎవరైనా మాకు నచ్చకపోతే, వారి ఇంటి ముగ్గుకి కలపకుండా )వీధి చివర వరకు లాగే వాళ్ళం.
గొబ్బిళ్ళ కథలు వేరు. ఉదయాన్నే ఆవుపేడ తెచ్చి, గొబ్బెమ్మలు చేసి, పూజ చేసి, అప్పుడు స్కూల్ కు వెళ్ళవలసి వచ్చేది. సాయంత్రం ఎవరో ఒకరి ఇంట్లో సందె గొబ్బెమ్మల పేరంటాలు... ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరిగుతూ పాటలు పాడడం, మంగళ హారతి పాటలు పాడడం, అదో మధుర జ్ఞాపకం. భోగి పండుగకు రెండు మూడు రోజుల ముందరే, మా వీధి లో మగపిల్లలు చెక్కలు, కట్టెల కోసం ఇల్లిల్లూ తిరిగి చందాలు వసూలు చేసేవారు. అప్పట్లో, స్నానానికి వేడి నీళ్ళు కాచుకోవడం కట్టెల పొయ్యి మీదనే కాబట్టి, ఇంట్లో చెక్క మొద్దులు, కట్టెలు సేకరించి ఉంచుకున్న వారు ఈ మగపిల్లలతో మిగిలిన ఏడాది అంత ఎలా ఉన్నా, ఈ భోగి రోజుల్లో మహా మంచిగా ఉండేవారు, వారి కట్టెల కి ఏఅపాయమూ రాకూడదు అని. మగపిల్లలు మహా టక్కరి వాళ్ళు. వాళ్లతో మంచిగా ఉంటూనే సగం కట్టెలు, దూలాలు ఎత్తుకోచ్చేసే వారు. ఇక భోగి రోజు నడిరాత్రి నుంచే భోగి మంటల సందడి. ఇంట్లో వాళ్ళు మొత్తుకుంటున్నా వినకుండా అక్కడే తెల్లరేవరకు మా మకాం. తరువాత అమ్మతో సహస్ర నామార్చన ఎలాగు ఉండేది. సాయంత్రం భోగి పండ్ల పేరంటాలు. అప్పట్లో టీవీ ఉండేది కాదు కనుకా ఈ సరదాలు అన్నీ ఎంతో చక్కగా మనసారా ఆస్వాదిన్చాము.
సంక్రాంతి పండుగకు ప్రతి సంవత్సరం పట్టు పరికిణీ, పూలజడ తప్పనిసరి. మాకే కాదు. మకర సంక్రాంతి నాడు మా కాంపౌండ్ లో ఉన్న ప్రతి ఆడపిల్లకు మా అమ్మ పూల జడ కుట్టేది. సాయంత్రం బొమల కొలువు పేరంటం. ఇక మా ఇంట్లో బొమ్మల కొలువు అంటే 10 రోజుల ముందు నుంచి తయారీ. పార్క్ కోసం ఆవాలు మొలకేత్తించడం, కొత్త కొత్త బొమ్మలు కొనడం, ఒక పల్లెటూరు, కొండ మీద ఒక గుడి, పార్క్, బడి, దశావతారాలు, పెండ్లి వారు, సీతా కళ్యాణం, ఈ బొమ్మలన్నీ పైనుంచి తీసి దులపడం, అమర్చడం, రోజూ ఉదయం సాయంత్రం హారతి ఇవ్వడం,ఇవన్ని ఒక ఎత్తైతే, పండగ సరదా తీరి, అలసిపోయిన తర్వాత అవన్నీ తీసి మళ్లీ పెట్టెల్లో పెట్టి దాచడం ఒక పెద్ద పని.
ఇక కనుమ రోజు పిల్లలకు పెద్దగా పని ఉండేది కాదు. గుడికో, లైబ్రరీ కో వెళ్లి వచ్చి అమ్మ చేసిన గారెలు తినడమే.
ఇక ధనుర్మాసం మొత్తం హరిదాసులు, గంగిరెద్దులు, బుడబుక్కల వాళ్ళు, కొమ్మ దాసరి వాళ్ళు, పిట్టల దొరలూ, ఇవన్ని మధురమైన జ్ఞాపకాలు. హరిదాసు చిడతలు వీధి చివరన వినబడగానే, పిల్లలందరూ బియ్యం పట్టుకొని వాకిళ్ళలో నుంచునే వారు. గంగిరేద్దులకు పాత బట్టలు ఇచ్చెవాల్లమ్. ఆ గంగిరెద్దు విన్యాసాలు చేస్తూ ఉంటె ఆశ్చర్య కరంగా ఉండేది. ఇక పిట్టల దొర కబుర్లకు ఆకాశమే హద్దు.
సంక్రాంతి పండుగలో అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ పండగ half yearly ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలవులు ఇచ్చేవారు. ఒక పక్క ముగ్గులు ఇతరత్రా హడావిడి, ఒక పక్క పరీక్షల టెన్షన్. అంతా అదో సందడి.... ఇవండీ మా సంక్రాతి కబుర్లు.....
సభ్యులందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు....

No comments:

Post a Comment