ఈ చరాచర సృష్టిని ఏ అంతరాయము లేకుండా నడిపిస్తున్న ఒక మహాశక్తి పేరే దైవము. పవిత్రమైన హిందూ ధర్మం దైవశక్తిని ఒక రూపానికి మాత్రమే పరిమితం చేయ లేదు. కోట్లాదిమంది మానవుల భావనలకు తగినట్టుగా దైవశక్తి కోట్లాది రూపాలను సంతరించుకున్నది. అఖండమైన ఆ శక్తి, సృష్టి, స్థితి, లయ కారకులుగా శ్రీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా, జ్ఞానమునకు అధిదేవతగా సరస్వతి దేవి, ధనానికి అధిదేవతగా లక్ష్మి, ధైర్యము, సాహసమునకు ప్రతీకగా హనుమంతుని ఇలా ఎన్నెన్నో రూపాలు కలిగి భక్తుల మనోభీష్టాలను నేరవేరుస్తున్నది. జీవుడు పుట్టిన దగ్గర్నుంచి, దేహం విడిచే వరకు ఎన్నో కర్మలు (పనులు) చేస్తాడు. వాటన్నిటి కారణంగా అతనికి పాపపుణ్యాలు కలుగుతాయి. అవి అతని జీవన క్రమానికి బాటలు వేస్తాయి. మంచి పనులు చేస్తే, మంచి జీవితము, చెడు పనులు చేస్తే చెడు జీవితము ప్రాప్తిస్తుంది అనేది పెద్దల మాట. ఒక మానవుని యొక్క ఆజన్మాంతం ఎన్నో విధాలుగా సహకరిస్తున్న ఆ దైవానికి మనం ఏ విధంగా ఋణం తీర్చుకుంటున్నాం? మన వేదాలు, పురాణాలు, శాస్త్రాలలో చెప్పిన పూజలు, వ్రతాలు ఆచరించటం ద్వారా... అయితే అందుకు ఆశక్తులైన వారు ఏమి చేయాలి? భగవంతుడు మనలను కష్టపెట్టి తాను పూజలు జరిపించుకోవాలి అని ఆశించడు. ఎవరి శక్తి కొలదీ వారు తనను ఆరాధించమనే భగవంతుడు చెప్పాడు. భగవంతుని తృప్తి పరచడానికి ఒక సులభమైన మార్గం, భగవంతుని నామ స్మరణ. నవ విధ భక్తీ మార్గములలో ఒకటి అయిన ఈ దైవ నామ స్మరణ తో భగవంతుని సులభంగా దర్శించవచ్చు. నడుస్తున్నా, తిరుగుతున్నా, ప్రయాణం లో ఉన్నా, అనారోగ్యం తో ఉన్నా, మనసులో కాని, పైకి ఉచ్చరిస్తూ కాని, భగవంతుని నామ జపం చేయవచ్చు. ఎవరి ఇష్ట దైవమును వారు మన: పూర్వకంగా భక్తీ తో స్మరించు కోవచ్చు.
No comments:
Post a Comment