Sunday 1 March 2015

ప్రతి రోజు మనం వార్తల్లో వింటూనే ఉంటున్నాం, దినపత్రికలలో చదువుతూనే ఉంటున్నాం. అయినా ప్రతి వీధికి ఒకరుగా వెలుస్తున్న దొంగ బాబాలను నమ్ముతూనే ఉన్నాం. మొన్ననే దేవిశ్రీ బాబా గారి గురించి వార్తల్లో విని ఆశ్చర్య పోయాను. అయన ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో జ్యోతిష్యం చెప్పడం నేను చూసాను. సామాన్యుల సంగతి సరే, ప్రముఖులు, రాజకీయ నాయకులూ, వ్యాపారవేత్తలు, సినీ నటులు, ఇలా ఎందరెందరో దొంగ బాబాల కు శిష్యులు అవుతారు. రాజకీయ నాయకులూ, సినీ నటులను పలుకుబడి కో, ప్రచారానికో ఉపయోగించు కుంటారు సరే, ఎంతో చదువుకుని, ఎంతో అనుభవం కలిగి, కోట్ల తో వ్యాపారం చేసే వ్యాపారస్తులకు, మరెంతమందో మేధావులకు ఈ బాబాల వలలో పడే అవసరం ఏముంది? ఏ వంచకుడి చరిత్ర చూసినా ఎక్కువ చదవుకోలేక పోవడం, అపరిమితమైన తెలివి తేటలు, ఎదుటివారిని బోల్తా కొట్టించా గల మాట చాతుర్యం ఇవి common గా కనిపిస్తున్న లక్షణాలు. వీరు ఆడవారిని కూడా వంచించి తమ శారీరిక అవసరాలకు వారిని బలి చేస్తున్నారు. మోసగాడు ఎప్పుడూ మోసగాడే.... మరి చదువుకున్న స్త్రీలు కూడా ఎలా వీరి వలలో పడుతున్నారో అర్ధం గాకుండా ఉంది. ప్రతి దొంగ స్వామీ, మహిళలను మోసం చేసి వారిని తరువాతే బెదిరించే వాడె. ఆ స్త్రీల ఇండ్లలో ఈ విషయం తెలియడం లేదా? అసలు, పూజలు చేయాలి, నువ్వు ఒక్కదానివే నా దగ్గరకు రా అని పిలిచే పరాయి మగవాడి ( వాడు స్వామి అయినా, బాబా అయినా సరే) దగ్గరకు కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా, వేరేవారి తోడూ లేకుండా మహిళలు ఇటువంటి వారి దగ్గరకు వెళ్ళటం మానుకోవాలి. ఒకవేళ వెళ్ళిన తరువాత ఏదైనా జరగకూడనిది జరిగితే, తప్పని సరిగా వారిని చట్టానికి పట్టించాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు భయపడి మౌనంగా ఉండటం కాకుండా, బయటికి చెప్పటం నేర్చుకోవాలి.
అసలు ఈ ప్రపంచం లో పుట్టిన ప్రతివాడికి, వాడి స్థాయి, జీవితాన్ని బట్టి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ధైర్యం గా పరిష్కారం వెతుక్కోవాలి కాని ఈ దొంగ స్వాముల వెంట పడకూడదు. పిల్లల చదువు, వివాహం, ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు అందరి ఇండ్లలో సామాన్యం. కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించు కోవాలి. లేదా పెద్దలను సలహా అడగాలి. అంతే కానీ పరాయి వారి దగ్గర మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకోవటం మూర్ఖత్వం.
అలాగే ఇంటి దగ్గరకు వచ్చి మీ సమస్యలకు సమాధానం చెప్తాము, మీ కోసం పూజలు చేస్తాము అనే వారిని కూడా లోపలి రానివ్వకూడదు. మన బలహీనతలే వారి పెట్టుబడి. అటువంటి వారిని ప్రోత్సహించ కండి. మన శాస్త్రాల్లో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయ్. పెద్దవారిని అడిగితె తెలుస్తుంది. నిజమైన స్వామి ఎవరూ కూడా భక్తులకు ఏకాంతంగా పూజలు చేయాలి అని చెప్పరు. వారి వద్ద నుండి పెద్ద మొత్తం లో డబ్బు వసూలు చేయరు. నిజమైన సన్యాసి, స్వామి దేవుడిని నమ్ముకో, లేదా ఫలానా దేవుడికి ఫలానా పూజ చేయి అంటారే కాని, నాకే పూజ చేయి, లేదా నేనే నీ తరఫున పూజ చేస్తాను, అని చెప్పడు.
ముఖ్యంగా ఇండ్లలో ఒంటరిగా ఉండే స్త్రీలు ఈ విషయాన్ని గమనించండి. సాధారణంగా కొంత మంది స్త్రీలు వాకిట్లో నుంచుని, పెద్ద పెద్దగ మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు గమనించక పోయినా, మీ కబుర్లు మోసగాళ్ళ దృష్టిలో పడితే, మీరే వారికీ సమాచారం ఇచ్చిన వారు అవుతారు. బయట ఉన్నప్పుడు ఫోన్ లలో మాట్లాడేటప్పుడు, ఏ విషయాలు మాట్లాడుతున్నారు, మీ విషయాలు ఎవరు వింటున్నారు , మీ చుట్టుపక్కల ఎవరైనా వింటున్నారా అనే విషయాలు గమనించు కోవాలి. లేదా ఫోన్ వచ్చినా ముఖ్యమైన విషయాలు బయట మాట్లాడకుండా, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడడం మేలు.
ఇవన్ని దృష్టి లో ఉంచుకుని మోసగాళ్ళ నుంచి దూరంగా ఉండండి.
Like · 

No comments:

Post a Comment