శీతాకాలం -- వివిధ నూనెల ఉపయోగం.
శీతాకాలం వచ్చేసింది. చర్మానికి కష్టకాలం మొదలయింది. ఈ కాలం లో ప్రకృతి రమ్యంగా ఉన్నప్పటికీ, చర్మం పగిలి చిరచిర లాడుతుంటే, మహా చిరాగ్గా ఉంటుంది. కొంత మంది సున్నిత చర్మ తత్త్వం ఉన్న వాళ్లకి చర్మం తీవ్రంగా పగిలి, రక్తం కూడా వస్తుంది. ఈ కాలం లో సబ్బులను వదిలి సున్నిపిండి తో స్నానం చేయాలి. చలి నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ వేడి నీటితో స్నానం చేయకుండా, గోరువెచ్చని స్నానం చేయడం, చర్మానికి, ఆరోగ్యానికి కూడా చాల మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు చలి గాలి సోకకుండా, ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవడం ఉత్తమం. అలాగే, ఫుల్ స్లీవ్స్ ఉన్న దుస్తులు ధరించడం మేలు. స్నానానికి ముందు నువ్వుల నునె వ్రాసుకొని, సున్నిపిండి తో స్నానం చేయాలి. పూర్వకాలం లోనే నువ్వులనూనె ఉపయోగాలను మన పెద్దలు గుర్తించారు. చర్మానికి వట్టిగా వ్రాసుకున్నా, లేక మర్దనా చేసుకున్నా కూడా ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి, అలాగే గుండె పనితీరుకు కూడా నువ్వులనూనె మేలు చేస్తుంది. నువ్వుల నూనెను చర్మం లోకి బాగా ఇంకేలాగా మర్దన చేసుకొని కొంత సేపు ఎండలో నుంచుంటే, గుండె పని తీరు మెరుగు పడుతుంది. ఇందులో ఉండే కాల్షియమ్, మెగ్నీషియం చర్మ సౌందర్యానికి ఎంతో దోహద పడతాయి. తరువాతది కొబ్బరి నూనె, దీనిని మర్దన చేసుకోవడం వల్ల చర్మం బిగుతుగా ఉండడమే కాక, చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కొంతమందికి కొబ్బరి నూనె వల్ల చర్మం బిరుసుగా అయినట్టు అనిపిస్తుంది. అటువంటి వారు కొబ్బరి నూనె, రోజ్ వాటర్ కలిపి వ్రాసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది. బాదాం నూనె చర్మానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. ఇందులో ఉండే విటమిన్ బి, విటమిన్ ఇ లు చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కొన్ని బాదాం నూనెలు కొంచెం జిడ్డుగా , ఉన్నట్టు అనిపిస్తాయి. అటువంటప్పుడు కొద్దిగా వెచ్చ చేసి వ్రాసుకుంటే, ఆ జిడ్డు ఉండదు. దుస్తులు మరకలు పడవు. ఆలివ్ ఆయిల్ కూడా విటమిన్ ఇ, కలిగి ఉంటుంది కాబట్టి చర్మం మృదువుగా మారడానికి దోహదం చేస్తుంది. దీనిని ఆహారం లో కూడా ఉపయోగించ వచ్చు. అనవసర కొవ్వును తీసివేసి, మంచి కొవ్వును పెంచడం లో ఇది సహాయకారి. అవకడో ఆయిల్, చర్మం మిద ముడుతలను తగ్గిస్తుంది. వచ్చే ముడుతలను నివారిస్తుంది. ఈ నూనెలు అన్నీ చర్మానికి మేలు చేసేవే. మృదువుగా ఉంచి, ముడుతలను నివారిస్తాయి. నూనె వ్రాసుకుని, మర్దనా చేసుకుని స్నానం చేసే వీలు, సమయం లేకపోతే, స్నానం చేసిన తర్వాత, ఆఖరున కొద్ది నీటిలో కొన్ని చుక్కల నునె కలిపి పోసుకున్నా, ప్రయోజనం ఉంటుంది. అలా కాక, moisturiser వాడేవాళ్ళు, స్నానం చేసాక, చర్మం కొంచెం తడిగా ఉండగానే వ్రాసుకుంటే శరీరం అంతా సమానంగా వ్యాపించి, లోపలికి ఇంకుతుంది. పాదాలకు సాక్సులు వేసుకోవడం కూడా ఈ కాలం లో తప్పనిసరి. సున్నిపిండి వాడె తీరిక లేని వాళ్ళు, పెసర పిండి , బియ్యం పిండి సమపాళ్ళలో తీసుకుని శరీరం రుద్దుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది.
No comments:
Post a Comment