Sunday 1 March 2015

ఈ పోస్ట్ నేను ముఖ్యం గా స్త్రీల కోసం వ్రాస్తున్నాను. స్త్రీల యొక్క శరీర పని తీరును బట్టి, వారి హార్మోన్ లెవెల్స్ ను బట్టి వారికీ కాల్షియమ్ చాలా చాలా అవసరం. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటినా స్త్రీలకూ కాల్షియమ్ ప్రతిరోజూ తీసుకోవడం తప్పనిసరి. వయసు పెరిగే కొద్దీ వారిలోని హోర్మోన్స్ యొక్క అసమతుల్యత వల్ల కాల్షియమ్ తగ్గుతూ ఉంటుంది. శరీరం తయారుచేసుకునే కాల్షియమ్,తీసుకునే ఆహారం నుంచి వచ్చే కాల్షియమ్ వారికి సరిపోదు. ఫలితంగా ఎముకల మిద ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మగవారిలో కన్నా స్త్రీలకూ ఎముకల సంబంధించిన వ్యాధులు ఎక్కువ గా రావడానికి ఇదే కారణం. సాధారణంగానే స్త్రీలు ఇంటిలోని మిగిలిన సభ్యుల ఆరోగ్యం మిద పెట్టె శ్రద్ధ, తమ ఆరోగ్యం మిద చూపించారు. పని వత్తిడి, కొంత నిర్లక్ష్యం వీటికి కారణాలు. ఈ కాల్షియమ్ లోపాన్ని అధిగమించ డానికి వైద్యులు పాలు, పెరుగు, పనీర్, వంటి పదార్ధాలు, కాల్షియమ్ టాబ్లెట్స్ తీసుకోమని చెప్తారు. నడివయసు స్త్రీలలో కాల్షియమ్ తీసుకోవడం తప్పని సరి. కాల్షియమ్ నిల్వలు ఎక్కువగా ఉండే పదార్ధాలు. : పాలు, పాల ఉత్పత్తులు, పాలకూర, టమాటాలు, జామకాయలు, మొదలైనవి. ఐతే, మన అందరికీ తెలియని ఇంకొక పదార్ధం రాగులు. వీటిలో ఉండే కాల్షియమ్ నిల్వలు అపారం. కొంత మంది దీనితో జావ కాచుకుని తాగుతారు. కొంతమంది రాగి మాల్ట్ లాగా చేసుకుని పాలతో తీసుకుంటారు. మరి కొంతమంది దీనితో ఇడ్లీలు, అట్లు చేసుకుంటారు. రాగులు కాల్షియమ్ కొరకే కాకుండా ఇంకా ఎన్నో విధాల మనకు మేలు చేస్తాయి.
1. వీటిని ఇంక పోలిష్ పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి, పూర్తీ ప్రక్రుతి పరమైన అన్ని లాభాలు పొందవచ్చు. 2. వీటిలో పీచు పదార్ధం చాలా విరివిగా ఉంటుంది కాబట్టి, జీర్ణ సమస్యలకు, బరువు తగ్గటానికి ఉపయోగ పడుతుంది. 3. కాన్సర్ రాకుండా కాపాడుతుంది. 4. అన్నవాహిక కు మేలు చేస్తుంది. 5. చెడు కొవ్వును తొలగిస్తుంది కాబట్టి, రక్త నాళాలు మూసుకు పోయే సమస్య ఉత్పన్నం కాదు. 6. తద్వారా గుండె పోటు ముప్పును తొలగించుకోవచ్చు. 7. పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహ రోగులకు కూడా మంచిది. 8. ఐరన్ విరివిగా ఉండడం వలన రక్తహీనత ఉన్నవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. 9. ఇందులో antioxidants మరియు aminoacids ఉండటం మూలంగా వత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 10. ప్రోటీన్లు, ఎమినో ఆసిడ్లు, రిబోఫ్లావిన్ ఇంకా ఎన్నో ఖనిజాలు రాగులలో పుష్కలంగా ఉన్నాయి. 11. ఇందులో ఉండే విటమిన్ సి. ఐరన్ ను శరీరం చక్కగా ఉపయోగించుకునేలా చూస్తుంది. అందువలన రక్తహీనత ఉన్న రోగులకు రాగులు చక్కటి ఆహారం. 12. పాలిచ్చే తల్లులకు పాలు మరింత పెరిగేటట్టు తోడ్పడుతుంది. 13. చర్మం ముడుతలు పడకుండా, బిగుతుగా ఉంది యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
1. రాగులు ఒకసారి కడిగి ఎండలో ఆరనిచ్చి పొడి కొట్టుకుని కొంచెం మరిగిన నీళ్ళలో కలిపి జావ చేసుకోవచ్చు.
2. రాగులు కడిగి గుడ్డలో మూటకట్టి, మొలకలు వచ్చాక నీడలో ఆరబెట్టి, కొంచెం వేయించి, ఏలకులు, బాదాం పప్పు తో సహా పొడి కొట్టి, పాలలో కలుపుకొని తీసుకోవచ్చు.
3. ఉడికిన నీటిలో కలిపి ముద్దగా చేసుకొని తినవచ్చు.
4. బియ్యం పిండి, రాగి పిండి, మైదా కలుపుకొని అట్లు లా తినవచ్చు.
5. ఇలా ఏ విధంగాను ఇష్టం లేని వారు, మామూలుగా చేసుకునే దోసెలు, చపాతీలు, వంటి వాటిల్లో ఒక్కో గరిటెడు పిండి కలుపుకొని దోసెలు, చపాతీలు తయారు చేసుకోవచ్చు.
6. స్వీట్ ఇష్టమైన వారు రాగి పిండిని నేతిలో పచ్చి వాసనా పోయేవరకు వేయించి అందులో బెల్లం పొడి కలిపి, నేతితో ఉండలు చుట్టుకుని మినప సున్ని లాగా కూడా చేసుకోవచ్చు.
7. రాగి జావ ను, ఉప్పు కలిపి మజ్జిగాతోను, లేదా బెల్లం పొడి కలిపి తీపిగాను కూడా తీసుకోవచ్చు.
తమిళ వాళ్ళు ఈ రాగి జావను తప్పని సరిగా ఉదయాన్నే తీసుకొంటారు.దయచేసి, ఈ రాగుల గొప్పదనం గుర్తించి, వీటిని మీ ఆహారం లో ఒక భాగం చేసుకుని, ఆరోగ్యం పొందండి. . మహిళలు అందరికీ ఇదే నా విన్నపం

No comments:

Post a Comment