Sunday 1 March 2015

నిన్న గురజాడ వారి స్వగృహం లో అయన జయంతి వేడుకలు జరిగాయి. మేము సాయంత్రం ఆ గృహం చూడడానికి వెళ్ళాము. మొత్తం కింద, పైన కలిపి 10 గదులు. మధ్యలో మండువా లాగా ఉండి, చుట్టూ గదులు. మేడ మిద ఒక వసారా, పంచ, రెండు గదులు. గాలి వెలుతురూ ధారాళంగా వస్తూ, ఎంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో ఇపుడు ఒక గ్రంధాలయం నడుపుతున్నారు. అలా అయినా మనుషుల రాకపోకలు ఉంటె, ఇల్లు పాడైపోదు అనే ఉద్దేశ్యం తో. కింద హాల్ లో అయన చిత్రపటం కు పూల మాల వేసి సత్కరించారు. పైన గదులలో ఒక గదిలో బీరువాలలో అయన చదివిన పుస్తకాలూ, అయన వాడిన కుర్చీ, కళ్ళజోడు, టేబుల్, వంటివి ఉంచారు. మరో గదిలో ఆయనకు వివిధ వ్యక్తుల నుంచి అందుకున్న లేఖలు పటం కట్టి ప్రదర్శించారు. అందులో అమృతాంజన్ కంపెనీ వారి నుండి వచ్చిన లేఖ, ఉదకమండలం క్లబ్ వారి లేఖ, కొండా వెంకటప్పయ్య గారి లేఖ, శ్రీ రబీంద్ర నాథ్ టాగోర్ గారి లేఖ, ఆంధ్ర పత్రిక వారి నుండి వచ్చిన లేఖ, బాలాంత్రపు వెంకట్రావు గారి లేఖ అన్ని మనం చూడవచ్చు. అయన స్వదస్తూరి తో వ్రాసిన దేశమును ప్రేమించుమన్నా గేయం, అయన డైరీ లలో కొన్ని పేజీలు కూడా ప్రదర్శించారు. అప్పటి కాలం నాటి విజయనగరం ఫోటోలు, అయన మహారాజ వారి కళాశాలలో లెక్చరర్ గా పనిచేసినప్పటి ఫోటో లు కూడా మనం అక్కడ చూడవచ్చు. అలాగే కింద హాల్ లో విజయనగరం నాకు చెందినా ఎంతో మంది మహానుభావుల చిత్ర పటాలను చూడవచ్చు. పి. సుశీల, మహారాజ ఆనంద గజపతి రాజు గారు, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, శ్రీ కోడి రామమూర్తి గారు, అమర గాయకుడూ ఘంటసాల, మహా మహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు, పద్య నాటక సార్వభౌమ శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు, హరి కథా పితామహ శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు వీరందరి చిత్రపటాలు ఉన్నాయి. మరొక గదిలో "కన్యాశుల్కం" నాటకం లోని ప్రముఖ ఘట్టాలు చిత్ర రూపంలో ఉన్నాయి.
ఒకటవ చిత్రం గురజాడ వారి ఇంట్లో మండువా స్థలం. 2.పైన వసారా 3. వారి స్వదస్తూరి తో వ్రాసిన దేశమును ప్రేమించుమన్నా గేయం. 4. ఆ కాలం లో గంటస్తంభం ప్రాంతం చిత్రం. 5. మహారాజ శ్రీ పూసపాటి ఆనంద గజపతి రాజు గారు.

No comments:

Post a Comment