Sunday 1 March 2015

పూర్వం రోజుల్లో అంటే ఓ 20, 30 సంవత్సరాల వెనుక పిల్లలకు ఎలాగైనా చదువు రావాలి అనే ఉద్దేశ్యం తో బళ్ళో టీచర్లకు అప్పగించి, కొట్టో, తిట్టో, మా వాడికి కాసిని అక్షరం ముక్కలు నేర్పించండి అనేవారు తల్లితండ్రులు. ఆ టీచర్లు కూడా, వాళ్ళ కి ఉన్న జ్ఞానాన్ని అంతా పిల్లల మెదళ్ళలోకి పంపడానికి శతవిధాలా ప్రయత్నించే వారు. పరీక్షల రోజుల్లో కొంచెం డల్ గా ఉన్న విద్యార్ధులను ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ చదివించేవారు. పరీక్షలు ఉన్నన్నాళ్ళు పిల్లల పడక మాస్టారి ఇంట్లోనే. ఈ క్రమంలో పిల్లలు చదవలేదనో, పాఠం అప్పచేప్పలేదనో, పనిష్మెంట్ ఇవ్వాలి అంటే, బెత్తం తో కొట్టడమో, గోడ కుర్చీ వేయించాడమో, బెంచి మీద నుంచో బెట్టడమొ, లేదా మోకాళ్ళు వెయించడమొ, ఇటువంటి శిక్షలు ఉండేవి. తప్పితే దెయ్యం అవహించినట్టు పిల్లవాడి ప్రాణాలకే ముప్పు వచ్చేలా కొట్టటం ఉండేది కాదు. పిల్లలు కూడా మాస్టారు అంటే భయపడే వారు కానీ, సినిమాలలో చూపించినట్టు వారినే బ్లాకు మెయిల్ చెయ్యడం ఆనాటి కుర్రాళ్ళకి చేతకాలేదు. పిల్లలకు ఇంట్లో తల్లితండ్రుల, తాతల భయం, స్కూల్లో టీచర్ల భయం ఉండేది. క్రమశిక్షణతో ఉండేవారు. ఇప్పుడు ఇంట్లో తల్లితండ్రుల గారం, సరే, తాతలు ఇప్పుడు వాళ్లతో ఉండడం లేదు కాబట్టి, ఆ ప్రశ్నే లేదు. స్కూల్లో పిల్లలను కొడితే ఏమౌతుందో అనే భయం, ఎవడు పోట్లాడడానికి మీదకు వస్తాడో అనే భయం, ఎప్పుడు శ్రీముఖం అందుకోవాలో అనే భయం. వీటి వలన, పిల్లలకు చదువు వచ్చేలా చెప్పడం అనే బాధ్యత నుండి టీచర్లు తప్పుకుని, కేవలం చదువు చెప్పేస్తున్నారు అంతే. ఇదివరకు 40, 45 మంది పిల్లలు ఉన్న క్లాస్సులో ఎవరు తెలివైన వాడు, ఎవరు కొంచెం డల్ స్టూడెంట్ అనేది గమనించుకుని, డల్ స్టూడెంట్స్ మీద ప్రత్యెక శ్రద్ధ తీసుకునే వారు. ఎంత మొద్దు వెధవ అయినా కనీసం స్కూల్ ఫైనల్ పాస్ అయేలా చదువు చెప్పేవారు. ఇప్పుడు దానికి వ్యతిరేకం. ఎవరు తెలివైన వాడో, ఎవరు మెరిట్ స్టుడెంటొ చూసి, వాళ్ళకు రాంకులు వచ్చేలాగా చదువు చెప్తున్నారు. ఎందుకంటే తెలివైన వాడు మంచి రాంక్ తెచుకుంటే వీళ్ళ స్కూల్ కి పబ్లిసిటీ జరుగుతుంది. మరి డల్ స్టూడెంట్ ని పట్టించుకునే వాడెవడు? వాడు కూడా వాళ్లతో సమానంగా ఫీజు కట్టి, గంగలో కలవాలి. మెరిట్ స్టూడెంట్ కి ఫీసు లో రాయితీ. డల్ స్టూడెంట్ చచ్చినట్టు మొత్తం ఫీజ్ కట్టాల్సిందే. యింక క్లాసు టెస్ట్ లో వచ్చిన మార్కులను బట్టి సెక్షన్లు మార్చడం ఇంకో దౌర్భాగ్యం. ఒక డల్ స్టూడెంట్ ఇంకా వెనుక సెక్షన్ లోకి వెళ్తే, వాడి మనోభావాలు ఎలా ఉంటాయి.వాడు అసలు చదువుతాడా? ఇంకా డల్ అయిపోతాడ? అలాగే ఒక మెరిట్ స్టూడెంట్ ఖర్మ కాలి ఒక సెక్షన్ వెనుకకు వెళ్తే, వాడి ఆందోళన వర్ణనాతీతం. 16,17 సంవత్సరాల లోపునే పిల్లలకు ఇంత ఒత్తిడి అవసరమా? గదికి 70 మందికి పైబడి విద్యార్ధులు ఉన్న క్లాసులో పిల్లలకు టీచర్ కి మధ్య ఒక అనుబంధం ఉంటుందా? ఆ స్కూల్ చదువు అయిపోయి బయటికి వెళ్ళిపోయాక 4,5 సంవత్సరాలకు ఆ టీచర్ చెప్పినది కాని, ఆ టీచర్ తో ఉన్న బంధం కానీ పిల్లలు గుర్తు చేసుకుంటారా? ఇక ఇంటికి వచ్చి టీచర్ మీద ఏదైనా నెపం వేస్తె, ఇదివరకు అయితే, టీచర్ ని సమర్ధించి పిల్లలతోనే పోట్లాడేవాళ్ళు పెద్దలు. ఇప్పుడు నీకెందుకు, నేను రేపు వచ్చి మాట్లాడతానుగా అని పిల్లలను సమర్ధిస్తే, వాడు అసలు ఎవరి మాట వింటాడు? ఫలానా ఒకడు పాస్ అవ్వాలి, ఇది నాకు ఒక సవాల్ అని టీచర్లు అనుకోవడం లేదు. గురుర్బ్రహ్మా, గురుర్విష్ణు అని పిల్లలూ, తల్లితండ్రులు అనుకోవడం లేదు. పైగా పిల్లలతో సమానంగా పెద్దలు కూడా టీచర్ల పై సెటైర్లు. ఈ పరిస్థితులలో పెరిగిన పిల్లలు, రేపు సమాజానికి ఎలా ఉపయోగపడతారు? వారు సమాజానికి ఏమి సందేశం ఇస్తారు?

No comments:

Post a Comment