Sunday, 1 March 2015

మా చిన్నతనాల్లో, క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తోందంటే, అదో పెద్ద హడావిడి. షాప్స్ నిండా క్రిస్మస్ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్, పెద్ద పెద్ద స్టార్స్ తో ఎంతో కళకళ లాడేవి. మంచి ఖరీదైన కార్డు కొనాలంటే 5 , 10 రూ. మధ్య ఉండేది, ఇంక కొంచెం తక్కువ లో అయితే, 2 రూ. వచ్చేవి. అందులోనే, మంచి సేనరీలు, పువ్వులు, ఉన్న కార్డు లు ఒక రకం, సినిమా తారల కార్డు లు ఒక రకం. మళ్ళీ మధ్యలో వ్రాసి ఉండే సందేశం హృదయానికి హత్తుకునేలా ఉండాలి. అదో రూలు. సాదాసీదాగా విష్ యు అ హ్యాపీ న్యూ ఇయర్ అని ఉన్న కార్డు ఎవరైనా ఇస్తే వాళ్ళకు ఈస్తటిక్ సెన్స్ లేదు అనుకునే వాళ్ళం. ఊళ్ళో ఉండే ఫ్రెండ్స్ కి ఇచ్చేవి కొన్ని, పొరుగు ఊళ్లకు పంపవలసిన గ్రీటింగ్ కార్డు ల కయితే అదో పెద్ద పని. ముందు, ఒక్కొక్కరికి ఎంత మంది ఫ్రండ్స్ ఉన్నారు, ఎన్ని కార్డు లు కావాలి, అని లెక్క పెట్టి పెద్దవాళ్ళకు చెప్తే, వాళ్ళు అన్ని కొనటానికి approve చేయాలి. తరువాత budget వాళ్లే నిర్ణయించి డబ్బు లెక్కపెట్టి ఇచ్చేవాళ్ళు. పొరుగు ఊళ్లకు పంపే కార్డు లకు పోస్టల్ స్టాంప్ లు కొని, అతికించి, అడ్రెస్ వ్రాసి పోస్ట్ చేయాలి. మిగిలిన చిల్లర లెక్కపెట్టి తిరిగి ఇవ్వాలి ఇంట్లో. మధ్యలో కొంత చిల్లర పోయిందంటే, ఆ నష్టం మనకే. డబ్బు నష్టమే కాకుండా, డబ్బు పోగొట్టినందుకు చీవాట్లు మళ్ళీ బోనస్. న్యూ ఇయర్ నాడు, క్రిస్మస్ నాడు ఊళ్ళో ఉండే ఫ్రెండ్స్ కి ఇళ్ళకు వెళ్లి ఇచ్చి రావాలి. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏమి తినకూడదు. ఇవన్నీ కూడా దైనందిన చదువుకు ఆటంకం కాకుండా చేయాలి. ఒకవేళ న్యూ ఇయర్ కి ఫ్రెండ్స్ కి వెళ్ళాలి అంటే, ముందు రోజు బాగా చదివి అన్నీ అప్పచెప్పాలి. ఇలా బోలెడు ఆంక్షలు ఉండేవి. న్యూ ఇయర్ హడావిడి అయిన తర్వాత, మనం కార్డు లు ఇచ్చిన వారిలో ఎంతమంది మనకు తిరిగి ఇచారు, ఎంత మంది ఊరికే విష్ చేసారు, ఇవన్ని వేరే లెక్కలు ఉండేవి... న్యూ ఇయర్ ధనుర్మాసం మధ్యలో వస్తుంది కాబట్టి, ఎవరి ముగ్గు ఎంత అందంగా ఉంది, ఎవరు న్యూ ఇయర్ అని ముగ్గుతో వ్రాసారు , ఎవరెవరు ఎన్ని కలర్స్ వేసారు ముగ్గుకి అనే లెక్కలు మళ్ళీ వేరే.డిసెంబర్ 31 నాడు అర్ధరాత్రి వరకు మెలుకువగా ఉండి సరిగ్గా 12 గంటలకు ఇరుగు పొరుగు వాళ్ళకు న్యూ ఇయర్ విషెస్ చెప్పడం అదో హడావిడి... కొన్నాళ్ళ తరువాత ఫోన్ లో గ్రీటింగ్స్ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి చెప్పటం అదో సరదా.... లైన్ లు కలవక పోవడం, అవతలి వాళ్ళు ఫోన్ చేసినా, మనమే ముందు విష్ చేసేయటం, అదో వేడుక. తరువాత మొబైల్ ఫోన్ లు వచ్చాక మెసేజ్ లు... తరువాత రోజుల్లో, ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో మెసేజ్ లకు డబ్బులు ఛార్జ్ చేయడం మొదలు పెట్టాయి సెల్ కంపెనీలు.... అప్పుడు ముఖ్యమైన వాళ్ళకు రాత్రి విష్ చేసి, మిగిలిన వాళ్ళకు మర్నాడు పొద్దుటే ఫోన్ లో గ్రీటింగ్స్ చెప్పడం.... అదో సందడి....తరువాత పేస్ బుక్ అలవాటు అయిన కొత్తలో కానీ ఖర్చు లేకుండా, అందులో విష్ చేయడం, ఇప్పుడు whatsapp . కొత్తనీరు వచ్చి పాత నీరును కొట్టేస్తుంది అన్నట్టు, whatsapp అలవాటు అయిన తరువాత, పేస్ బుక్ msg లు తగ్గిపోయాయి. ఆండ్రాయిడ్ ఫోన్ లు వచ్చాక ప్రపంచం అరచేతిలోకి వచేసింది. ఇవన్ని ఒకరి సందేశాలు ఒకరికి అందచేస్తున్నాయి క్షణం ఆలస్యం లేకుండా కానీ, ఆ సందేశాలలో, ఇదివరకటి ఆప్యాయత, మమకారం ఉంటోందా అని నా లాంటి వాళ్ళకు ఒక చిన్న సందేహం. యంత్ర జ్ఞానం ( Technology ) ఎక్కువైనా కొద్దీ యాంత్రికత కూడా ఎక్కువ అయిపోతోంది. గ్రీటింగ్ కార్డ్స్, సెలెక్ట్ చేసి, అందులో మన స్వహస్తాలతో ఒక సందేశం వ్రాసి, పోస్ట్ చేయడం, లేదా స్వయంగా ఇవ్వడం అనేది ఒక చక్కటి అనుభూతి. అది ఇప్పుడు కోల్పోయాం. నాలాంటి చాదస్తులు ఒకవేళ అలా ఇచ్చినా వెర్రిదాన్ని చూసినట్టు చూస్తారు. కొండొకచో భయపడతారు కూడా, నాకు ఏమైందా అని. కాల ప్రవాహం లో మనమూ కొట్టుకుపోవడమే.....

No comments:

Post a Comment