అరిషడ్వర్గాలను జయించడం చాల కష్టసాధ్యమైన పని. కానీ, వాటిని జయించనిదే మానవుని జీవితం సుఖమయం కాదు. ఎంతో నిష్ఠ తో తపస్సు చేసిన మహా మహా మునులకు, యోగి పుంగవులకే క్రోధాన్ని అసూయను జయించడం సాధ్యం కాలేదు. ఈ కలియుగం లో సామాన్య మానవునికి అంత శక్తి లేదని తెలిసి, పెద్దలు భగవంతుని కోసం దీక్ష లను ప్రారంభించారు. 41 రోజుల పాటు పాటించే ఈ దీక్షలు ఎవరి ఇష్ట దైవాన్ని బట్టి వారు తీసుకోవచ్చు. అయ్యప్ప దీక్ష, భవాని దీక్ష, గణపతి దీక్ష, హనుమాన్ దీక్ష, గోవింద మాల--ఇలా... దీక్షా ధారులు పాటించే నియమాలు సూక్ష్మం లో మోక్షంగా అరిషడ్వర్గాలను జయించే వైపుగా మానవుని ప్రేరేపిస్తాయి. సర్వుల లోను భగవంతుని చూస్తున్నట్టే, మగవారిని స్వామి అని, స్త్రీలను మాతా అని పిలవడం, ఇంద్రియ నిగ్రహం పాటించే విధంగా భూ శయనం , ఒంటిపొద్దు భోజనం, తామస గుణాలను ప్రేరేపించే ఆహారాన్ని విసర్జించడం, మద్య మాంసాలను విడిచి పెట్టడం, చన్నీటి స్నానం, ఇరు సంధ్యలలో దైవప్రార్ధన, మొదలైనవి. ఈ దీక్ష లోనే సాత్వికంగా మాట్లాడడం, ఈర్ష్య అసూయలను జయించడం కూడా ఒక విధి గా చెప్తారు. ఈ దీక్షలు అన్నీ, 41 రోజులు సాగుతాయి. ఒక మనిషి లోని రోగ లక్షణాలను మాన్పి, సేవించే మందు ఒంటికి పట్టి, ఆరోగ్యం చేకూరాలంటే, 41 రోజులు ఖచ్చితంగా ఔషధ సేవనం చేయాలి అంటుంది ఆయుర్వేద శాస్త్రం. మన లోని తామస గుణాలు నశించి, పరిపూర్ణ వ్యక్తులుగా రూపొందడానికి ఈ దీక్షలు దోహదం చేస్తాయి అని పెద్దల ఉద్దేశ్యం.
కానీ, ఇప్పుడు ఎవరి వెసులుబాటు ప్రకారం, సప్తాహ దీక్ష, 18 రోజుల దీక్ష, ఇటువంటివి ప్రారంభం అయ్యాయి. దీక్షాధారులు దీక్ష విరమించే దేవాలయం ప్రక్కనే, బార్లు వెలుస్తున్నాయి. 41 రోజుల దీక్ష తరువాత కూడా వారిలోని కోపం, ఈర్ష్య, అసూయ అనే దుర్గునాలు తొలగడం లేదు. దీక్ష విరమించిన తరువాత మళ్లీ వారి ప్రవర్తన మునుపటి విధంగానే ఉంటోంది. అటువంటప్పుడు ఈ దీక్షలు తీసుకోవటం వలన ప్రయోజనం ఉందా? 41 రోజులు ఒక విధమైన కట్టుబాట్లలో ఉన్న వ్యక్తులు, తరువాత కూడా అలా ఉండలేరా? దీక్షాధారణ కు ఉన్న ప్రయోజనం చేకూరనప్పుడు దీక్షలు పాటించి లాభం ఏమిటి? ఇటువంటి దీక్షాధరుల వలన మనం వేరేవారికి మనలను విమర్శించే అవకాశం ఇస్తున్నామేమో! మానవుని సంకల్ప బలం ఎంతో గొప్పది. సంకల్పం ఉంటె, కొండను అయినా కదల్చవచ్చు. ప్రవర్తన సరిదిద్దుకోవటం అసాధ్యం కాదు. దయచేసి, దేవుని పేరు మిద దీక్షలు చేసేవారు మిగిలిన వారికీ ఆదర్శంగా ఉండేలా, హిందూ ధర్మం యొక్క గౌరవం నిలిపేలా ఉంటారు అని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
No comments:
Post a Comment