Saturday 2 May 2015

 పుష్యమాస ప్రాశస్త్యం: (రెండవ భాగం )

దేవఋణం.
త్రిమూర్తి స్వరూపుడైన సూర్యనారాయణ భగవానుణ్ని ప్రపంచ పోషకుడిగా, వేడి-వెలుతురు-ఆరోగ్యం ప్రసాదించే వాడిగా, జ్ఞాన భాస్కరునిగా, యుద్ధాధిపతిగా భారతీయులు అనాదిగా ఆరాధిస్తున్నారు. ఇంద్ర, వరుణ, వాయుదేవతల సహాయంతో సూర్యుడు భూమిపై వర్షించడం వల్లనే మకర సంక్రాంతి పండుగానాటికి పంటలు పండి, మన చేతికి అందుతాయి. మన జీవన నిర్వహణ జరుగుతోంది. అందుకే సంక్రాంతి నాడు తలంటు స్నానం చేసి, సూర్యాది దేవతలను పూజించి, కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలను పొంగించి, సూర్యభగవానునికి భక్తితో, కృతజ్ఞతలతో నివేదించడం ఆచారం.

పితౄణం:

పితృతర్పణాలు, పిండోదక దానాలు, శ్రాధ్ధకర్మలు మొదలైనవి ఆచరించడం ద్వారా మరణించిన పితరుల ఋణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు. మకరరాశికి శని అధిపతి. శని వాతప్రధాన గ్రహం. వాతం తగ్గాలంతే సంక్రాంతినాడు తెలకపిండితో , నువ్వులు, బెల్లంతో చేసిన అరిశెలు మొదలైన పదార్థాలు సేవించాలి. నువ్వులు, బెల్లం, గుమ్మడికాయ మొదలైనవి దానం ఇస్తే శనిదోషం కొంత పోతుంది అంటారు.

భూతఋణం.

భూమి, నీరు, గాలి మొదలైన భూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతున్నాయి. అందుకే కృతజ్ఞతతో వాటిని కూడా పూజిస్తాం. పండిన పొలాల్లో పొంగలి మెతుకులు, పసుపు కుంకాలు చల్లి, ఎర్ర గుమ్మడికాయను పగలగొట్టి దిష్టి తీయడం ఆచారమైంది. పాడి పశువులు పాలిచ్చి మనల్ని పోషిస్తున్నాయి. ఎద్దులు వ్యవసాయంలో శ్రమిస్తున్నాయి. అందుకె కృతజ్ఞతా సూచకంగా కనుమనాడు పశువులను, పశుశాలలను శుభ్రం చేసి, అలంకరిస్తారు. ఇళ్ళ ముంగిట బియ్యంపిండితో రంగవల్లులు వేస్తారు. ఆ పిండి క్రిమికీటకాదులకు ఆహారం. ఇలా మూగజీవులకు, భూమి మొదలైన భూతాలకు మానవాళి కృతజ్ఞతలు తెలిపే ఆచారాలను ఈ పండుగలో నిబధ్ధం చేశారు.

మనుష్య ఋణం.

ఇతరుల సహాయ సహకారాలు లేనిదే సమాజంలో జీవనం కొనసాగించలేము. అందుకు కృతజ్ఞతగా ఈ పండుగ నాడు ధాన్యం, తిలలు, కర్రలు, చెరకు, గోవులు, పళ్ళు, వస్త్రాలు మొదలైనవి విరివిగా దానధర్మాలు చేస్తారు. అతిథులను ఆదరిస్తారు. వ్యవసాయంలో సాయం చేసిన వారికీ, గ్రామంలోని ఇతర వృత్తులవారికీ కొత్థ ధాన్యాన్ని పంచిపెట్టడం ఈ పండుగ లోని మరో ఆచారం.

ఋషిఋణం:

ఈ పండుగ సమయంలో ఆచరించే జపతపధ్యానాది ఆధ్యాత్మిక సాధనలూ, సద్గ్రంథ పఠనాదులూ శీఘ్రఫలాలిస్తాయని విశ్వసిస్తారు. ధాన్యం, ఫలాలు, అజినం, కంచు, బంగారం, దానం శ్రేష్టం.

కనుము:

సంక్రాంతి పండుగలో ఆఖరిది కనుము పండుగ. వ్యవసాయంలో సాయం చేసిన పశువులను గౌరవించే పండుగ ఇది. ఎద్దులు, ఆవులు మున్నగువాటిని, స్నానం చేయించి, అలంకరించి, వాటి కొట్టాలను శుభ్రం చేసి, అలికి, అలంకరించి, అక్కడ పొంగళ్ళు వండుతారు. వ్యవసాయకూలీలను కూడా గౌరవించే పండుగ ఇది. ఈ దినం పూర్తిగా కర్షకులకు సంబంధించిన దినం.  

No comments:

Post a Comment