Sunday, 3 May 2015

మాఘమాస ప్రాశస్త్యం:

ఈ మాసం స్నానానికి ప్రసిధ్ధి. మాఘస్నానం ఇహపర శుభద్దయకం. సూర్యోదయం కాబోతున్న సమయంలో మాఘమాసంలో స్నానం చేస్తే మహాపాతకాలు పోతాయి. అన్ని వర్ణాల వారూ, నాలుగు ఆశ్రామాలా వారు అందరూ ఈ స్ననం చేయవచ్చు..

ఈ మాసంలో సూర్యుడు మకరంలో ఉండే సమయంలో సూర్యోదయానికి మునుపు, వేడినీటిలోనైనా ఇంట్లో స్నానం చేసినా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. బావినీటి స్నానం పన్నెండేళ్ళ పుణ్య స్నాన ఫాలాన్నీ, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ శతగుణం, మహానదే సంగమ స్నానం దానికి చతుర్గుణం, గంగాస్నానం సహస్రగుణం, గంగా యమునా సంగమ (త్రివేణీ సంగమ ) స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయి. మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగాయమునాది దివ్య తీర్థాలను స్మరించి చేయాలి. ఆరోగ్యం అనుకూలించనప్పుడు పాడ్యమొ, విదియ, తదియ,త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు.

మాఘమాస ఆదివారాలలో నియమబధ్ధంగా సూర్యునకు క్షీరాన్నం వండి నివేదించితే రోగ, దారిద్ర్యాలు పోతాయి. ఆ రోజున తరిగిన కూరలు తినకూడదు. తైలాన్ని రాసుకోవడం, మాంసం, ఉల్లి, వెల్లిల్లి తినడం పనికిరాదు.

ఒక రోజులో సంధ్య ఎటువంటిదో, ఒక సంవత్సరంలో మాఘమాసం అటువంటిది. ఇది సంవత్సరానికి సంధ్య వంటిది. దైవశక్తులు జాగుర్తమయ్యే ధ్యానానికి అనువైన కాలం . యోగానికి ఉపాసనకి ఎంతో ఉపయోగకరం. అందుకే ఈ మాసంలో చవితి, సప్తమి, పూర్ణిమ, ఏకాదశి, మాసశివరాత్రి, అన్నీ మహాఫలాలను ఇస్తాయి.ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలలలో ఈ మాసానికి ప్రత్యేక స్ఠానం. సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం ఇది. ఉత్తరాయణ పుణ్యకాలంలోని ఈ పవిత్ర మాసం లో సూర్యారాధన, విష్ణ్వర్చన, శివోపాసన వంటివి విశేష ఫలాల్ని ఇస్తాయి.

కార్తీకం దీపానికి ముఖ్యం, మాఘానికి స్నానం ముఖ్యం. సూర్యోదయానికి ముందు నదీస్నానం శ్రేష్టం. నది లభ్యం  కానప్పుడు తటాకం కానె, నూయి గాని, శ్రేష్టం. మాఘమాసం లో త్రివేణీ సంగమ స్నానం ఉన్నతమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రవచనం. స్నాన సమయంలో శివకేశవాది దేవతా స్మరణ, గంగ యమున సరస్వతి గోదావరి వంటి పుణ్య నదుల స్మరణ చేయాలి. ఈ మాసంలో దానం, జపం విశేషంగా చేస్తే మంచిది.

మాఘ శుక్ల చవితి ఢుంఢి గణపతికి ప్రీతికరం. ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రి ప్రారంభంలో గణపతిని పూజించాలి. తిలలతో చేసిన లడ్డూలను నివేదించాలి. ఈ వ్రతం సంపదలను ప్రసాదిస్తుంది. ఈరోజు శివుని మల్లెపూవులతో పూజించితే ఐశ్వర్యం లభిస్తుంది.

మాఘ శుధ్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. దేవీ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం మొదలైన వాటిలో ఈ "శ్రీపంచమి" గురించి విశేషంగా చెప్పారు. ఈ రోజు సరస్వతీ దేవిని ఆరాధించాలి. ప్రతిమలో కాని, పుస్తక రూపంలో గాని, పటం రూపంలో కాని సరస్వతీ ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించాలి. క్షీరాన్నం, పళ్ళు, కొబ్బరి, ఇతర పిండివంటలను నివేదించాలి. తెల్లని పూవులతో పాటు ఇతర కుసుమాలను అర్చనకు ఉపయోగించాలి. ఈరోజున శారదాంబను ఆరాధిస్తే, విద్యాబుధ్ధులు లభిస్తాయి. మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. దేవతలు సైతం ఈ రోజున సరస్వతీ దేవిని ఆరాధిస్తారుట. జ్ఞానవిజ్ఞానాలు, లౌకికమైన చదువులే కాక, పరమమైన బ్రహ్మవిద్య కూడా ఈ జగజ్జనని కృప చేతనే లభ్యం అవుతాయి.

మాఘ శుధ్ధ సప్తమి నాడు సూర్యుని ఆరాధించడం గురించి భవిష్య పురాణమున విశేషముగా వర్ణనలున్నాయి. షష్టి నాడు రాత్రి ఉపవసించి సప్తమి నాడు అరుణోదయమున స్నాన మాచరించిన ఏడు జన్మముల పపము తొలగునని రోగశోకములు నశించునని, జన్మజన్మల నుండి మనోవాక్కాయకృతమును, జ్ఞాతాజ్ఞాతమును అగు ఏడు విధములయిన పాపములు పోతాయని ధర్మగ్రంధల్లో ఉంది. స్ననము చేయునపుడు ఏడు జిల్లేడాకులు కాని, ఏడు రేగు ఆకులు కాని తలపై ఉంచుకొని స్నానం చేయాలి. ఈ మాసమంతా నియమంగా సూర్యుని ఆరాధిస్తూ "ఆదిత్య హృదయం" వంటివి పారాయణం చేయడం మంచిది. ప్రతి ఆదివారమ ఉదయాన్నే శుచిగా క్షీరాన్నం వండి సూర్యుని అర్చించాలి. ఈరోజు తరిగిన కూరలు తినరాదు.

మాఘ శుధ్ధ అష్టమి భీష్మాష్టమి అంటారు. ఈరోజు నువ్వులతో తర్పణాలు విడవాలి. ఇలా చేసిన వారి పాపాలు సత్వరమే హరితాయి.

మహాభారతానికి ఆదిపురుషుడు భీష్ముడు. ధర్మ శాస్త్రాలు తెలిసిన జ్ఞాని. త్యాగపురుషుడు, మహోదాత్తుడయిన వీరుడు. భీష్ముడు తనువు చాలించింది అష్టమి నాడే అయినా శ్రీకృష్ణుడు తనకెంతో ప్రీతిపాత్రమయిన ఏకాదశీ తిథిని భీష్ముని పెరిట ఏర్పాటు చేసి, భీష్మ ఏకాదశిని పర్వదినం చేశాడు. తాను ఎరిగిన విష్ణుమూర్తి కృపా విశేషాలన్నింటినీ ఏర్చి కూర్చి ఐహికాముష్మిక మహానందానుసంధాయకమైన ఈ విష్ణు సహస్రనామాలని భక్తకోటికి వరంగా ప్రసాదించాడు భీష్ముడు. శ్రీకృష్ణుడు తనకు తానుగా భీష్ముడు అంతిమ శ్వాస విడిచే సమయానికి వచ్చి, తన సహస్రనామాలను స్వయంగా విని ఆనందించి భీష్మునికి మోక్షం కలిగించాదంతే, భీష్ముని గొప్పతనం ఎంతటిదో కదా!ఈ విష్ణు సహస్ర నామ పారాయణ చేసిన వారందరికీ కామితార్ధములు ఈడేరి అంతమున విష్ణు సాయుజ్యం పొందగలరని సాక్షాత్తూ కృష్ణ భగవానుడే చెప్పాడు.

మాఘ శుధ్ధ ఏకాదశి నాడు ఏకాదశీ వ్రతం చేసి విష్ణు సహస్ర నామ పారాయణ చేసిన వారు జీవన్ముక్తులు అవుతారని పురాణాలలో చెప్పబడింది.

ప్రతీనెలా బహుళ పక్షంలో 14వ రోజు మాసశివరాత్రి కాగా, మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది. పద్మపురాణం, స్కాంద పురాణం, లింగపురాణం, గరుడపురాణం ఈ మహా శివరాత్రిని విశేషంగా వర్ణించాయి. ఈరోజు శివారాధన, శివసాన్నిధ్యంలో జాగారం ఎంతో విశేష ఫలితాలను ఇస్తాయి.  శివరాత్రి పర్వకాల నిర్ణయంలో కొన్ని నియమాలు ఉన్నాయి.ఆరోజు బహుళ చతుర్దశి తిథి అర్ధరాత్రి వరకూ ఉండాలి. దీనికి తోడు ఈ పర్వదినం మంగళవారం వస్తే ఇంకా ప్రశస్తం.

శివరాత్రి నాదు సంధ్యాదికములు పూర్తి చేసుకుని, నిత్యపూజ, జపం అయిన తర్వాత చతుర్దశి తిథి అంతా నిరాహారుడై ఉపవాసం చేయాలి. "ఓం నమశ్శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని యధాశక్తి జపించాలి. శక్తి ఉన్నవారు రుద్రాభిషేకం చేసుకుంటారు. రుద్రాభిషేకమునకు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. 

No comments:

Post a Comment