Sunday 3 May 2015

ఇవాళ ప్రపంచ నవ్వుల దినోత్సవం అట. అయినా విడ్డూరం కాకపోతే, నవ్వుకోవడానికి ఒక రోజు ఏంటండీ? హాయిగా ప్రతిరోజూ కసాబిసా నవ్వుకోక...అంటే ఈరోజు ప్రముఖ కార్టూనిస్టులు, కమెడియన్లను తలుచుకుంటారేమో బహుశా...అంతేలెండి, వాళ్ళకీ ఒకరోజు కావాలిగా అందరూ తలుచుకోవడానికి. ఈ ఆలోచన కూడా తప్పేమో! అంత గొప్పగా హాస్యాన్ని పంచేవారిని మనం ప్రతిరోజూ తలుచుకుంటూనే ఉంటాంగా! మరయితే ఈ దినం ఎందుకు ప్రారంభం అయిందబ్బా! ఏదో ఒక కారణం ఉండే ఉంటుందిలెండి. చార్లీ చాప్లిన్, లారెల్ అండ్ హార్డీ, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు,  రమాప్రభ, శ్రీలక్ష్మి,  బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్,  దర్శకులు జంధ్యాల గారు, రచయిత భమిడిపాటి కామేశ్వరరావు గారు, కార్టూనిస్ట్ మల్లిక్,  ఇలా ఎంతోమంది మనకు నవ్వులు పంచారు, పంచుతూనే ఉన్నారు. మనిషికి మాత్రమే చేతనయిన ఈ విద్యని మనం నేర్చుకుందాం, అందరికీ నేర్పిద్దాం, దరహాసం, మందహాసం, వికటాట్టహాసం ఇలా నవ్వుల్లో ఎన్నో రకాలు. ఎలా నవ్వినా పర్వాలేదు, అసలంటూ ముఖం ముడుచుకుని మూల కూర్చోకుండా.....కొంతమంది ఉంటారు, జోక్ వేసినా అర్ధం కాదు. మనమే జోక్ వేసి, మనమే అర్ధం చెప్పి, మనమే నవ్వుకోవాలి అటువంటి వాళ్ళ దగ్గర మాట్లాడితే, కొంతమంది మొహమాటస్తుల దగ్గర వాళ్ళు వేసే జోక్ కి నవ్వు రాకపోయినా వచ్చినట్టు నటించాలి. జీవితమే నటనమూ అనుకుంటూ. కొన్ని రచనలు, కొన్ని సినిమాలు ఉంటాయి, ఎప్పుడు, ఎన్నిసార్లు  చదివినా, ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా నవ్వొస్తాయి. ఎప్పుడూ గంభీరంగా ఉండేవాళ్ళని కొంతమందిని దేవుడు తయారు చేస్తాడు. అలాంటివాళ్ళు మనందరికీ జీవితంలో ఒక్కసారి అయినా తారసపడతారు. ఇక వాళ్ళతో గడపడం అనే శిక్షకు మనం రెడీ అవ్వవలసిందే. ఏం చేస్తాం? ఒక్కో ఘడియ అలా ఉంటుంది. భరించక తప్పదు. అదండీ సంగతి. అసలే ఆదివారం. ఈ పాటికి అందరి ఇండ్లలో భోజనాలు అయిపోయి ఉంటాయి. మరి ఇవ్వాళ చక్కగా ఒక మంచి పుస్తకం చదువుతూనో, ఒక మంచి పుస్తకం చదువుతూనో హాయిగా గలగలా మనస్ఫూర్తిగా నవ్వేసుకోండేం... మీ నవ్వులు మీ ఇంట్లోనే కాకుండా, మీ చుట్టుపక్కల కూడా ప్రతిధ్వనించాలి మరి.....


No comments:

Post a Comment